Saturday, August 24, 2019
Follow Us on :

బ‌ర్గ‌ర్ తిన్నాడు.. వెంట‌నే ర‌క్తం క‌క్కుకొని..

By BhaaratToday | Published On May 21st, 2019

స్నేహితులతో క‌లిసి సరదాగా రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. బర్గర్‌ తింటుండగా గాజుముక్కలు గొంతులో గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. ప‌క్క‌నే ఉన్న‌ స్నేహితులు అతన్ని వెంట‌నే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. గత బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఆటో డ్రైవర్‌ సాజిత్‌ పఠాన్‌(31) స్నేహితులతో కలిసి గత బుధవారం ఎఫ్‌సీ రోడ్డులోని బర్గర్‌ కింగ్‌ ఫాస్ట్‌ఫుడ్‌ రెస్టారెంట్‌లో లంచ్‌కు వెళ్లాడు.
 
బర్గర్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, కూల్‌డ్రింక్‌ ఆర్డరిచ్చాడు. ఆర్డర్‌ రాగానే లొట్టలేసుకుంటూ బర్గర్‌ను తినడం మొదలుపెట్టాడు. ఇంతలో అతని గొంతులో ఏదో గుచ్చుకున్నట్లు నొప్పిగా అనిపించడంతో గట్టిగా అరిచాడు. నోట్లో నుంచి రక్తం కూడా కారడంతో సాజిత్‌ స్నేహితులు బర్గర్‌ను గమనించగా అందులో గాజుముక్కలు కనిపించాయి. దీంతో వారు సాజిత్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు సాజిత్‌ గొంతులో గుచ్చుకున్న గాజుముక్కలను తొలగించారు. 

విషయం తెలుసుకున్న స్టోర్‌ యజమాన్యం.. అప్పటికప్పుడు ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం సజీత్‌కు రూ. 15 వేలు చెల్లించింది. మరుసటి రోజు అంతకు రెట్టింపు డబ్బులు ఇచ్చి.. ఈ విషయం బయటకు చెప్పవద్దని కోరింది. దీని గురించి ఔట్‌లెట్ మేనేజర్‌ని ప్రశ్నించగా.. తనకు ఈ విషయం గురించి తెలీదని.. ఆ రోజు సెలవులో ఉన్నానని తెలిపాడు. విషయం తెలుసుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెడికల్‌ రిపోర్ట్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు. అవి రాగానే బర్గర్‌ కింగ్‌ ఔట్‌లెట్‌ మీద తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.