Tuesday, October 15, 2019
Follow Us on :

గేమ్ ఛేంజర్ భారత్ చేతికి చిక్కింది.. ఇక పాక్ కు హడల్

By BhaaratToday | Published On Oct 9th, 2019

ఇంతకీ, మోదీ ప్రభుత్వం రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలుపై ఎందుకంత ఆసక్తి కనబరిచింది..? అత్యంత ఖరీదైన ఈ యుద్ధ విమానాలు మనకిప్పుడు అవసరమా..? అంటే అవుననే అంటోంది మోదీ సర్కార్. కాలం చెల్లిన యుద్ధవిమానాలతో అవస్థలు పడుతున్న భారత వైమానిక దళానికి.. రఫేల్ కొత్త జవసత్వాలను అందివ్వనుంది. ఓవైపు పాక్, మరోవైపు డ్రాగన్ ఆగడాలు ఎక్కువైన నేపథ్యంలో.. రఫేల్ రూపంలో సరైన అస్త్రం దొరికింది. అసలు రఫేల్ యుద్ధ విమానాలతో మనకు లాభమేంటి..? భారత వైమానిక దళాలని అవి ఏమేరకు ఉపయోగపడున్నాయి..?

తరుచూ పాకిస్తాన్, చైనా నుంచి యుద్ధ మేఘాలు ముసురుకుటున్న సమయంలో భారత వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేయాలని మోదీ సర్కార్ భావించింది. ఇందులో భాగంగానే.. ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ విమానాల్లో ఒకటైన రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలుకు 2016లో ఫ్రాన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై నాటి ఇరు దేశాల రక్షణశాఖామంత్రులు మనోహర్ పారికర్, జీనీ లెడ్రియన్ లు సంతకాలు చేశారు.

రెండు వైపులా యుద్ధం చెలరేగితే తిప్పికొట్టడానికి భారత్‌కు 44 స్క్వాడ్రన్ల మేర యుద్ధవిమానాలు ఉండాలని వ్యూహకర్తలు అంచనావేశారు. భారత్‌ వద్ద ప్రస్తుతం 34 స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. వాటిలోనూ కాలం చెల్లిన మిగ్‌-21, మిగ్‌-27ల వాటా 10 స్క్వాడ్రన్లు. మిగిలిన యుద్ధవిమానాల్లోనూ అధికశాతం 1980ల నాటివే. ఈ నేపథ్యంలో రష్యా నుంచి కొనుగోలు చేసిన సుఖోయ్‌-30ఎంకేఐ పైనే భారత్‌ ప్రధానంగా ఆధారపడుతోంది. పాకిస్థాన్‌ వద్ద 70కి పైగా మెరుగైన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు ఉన్నాయి. దీనికితోడు భారత్‌ వద్ద ఎక్కువగా తేలికపాటి, భారీ యుద్ధవిమానాలే ఉన్నాయి. కీలకమైన మధ్యశ్రేణి పోరాట విమానాల విషయంలో కొరత ఉంది. ఈ నేపథ్యంలో వీటి కొనుగోలుకు వైమానిక దళానికి మరింత బలం చేకూర్చింది.

రఫేల్ యుద్ధ విమానాలను అందించడంతో పాటు, ఐదేళ్లపాటు వాటి నిర్వహణ, విడిభాగాల సరఫరా బాధ్యత ఫ్రాన్సే చూసుకునేలా ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంతో భారత వాయుసేన సామర్థ్యం మరింత పెరిగినట్టయింది.

నాలుగోతరంలోని అధునాతన రకానికి చెందిన రఫేల్‌.. గగనతలంలో ఎలాంటి విధులనైనా పకడ్బందీగా నిర్వహించగలవు. ఎక్కువదూరం ప్రయాణించే సామర్థ్యం, ఇతర ఏర్పాట్ల వల్ల అణ్వస్త్ర ప్రయోగానికీ పనికొస్తుంది. అత్యాధునిక మిసైల్ వ్యవస్థ రఫేల్ సొంతం. సుదూర లక్ష్యాలను చేధించగల 150 కిలోమీటర్ల బియాండ్‌ విజువల్‌ రేంజి, ఎయిర్‌ టు ఎయిర్‌ మీటియోర్ మిస్సైళ్లు, 300 కిలోమీటర్లకుపైగా దూరంలోని లక్ష్యాలను చేధించగల ఎయిర్‌ టు గ్రౌండ్‌ ‘స్కాల్ప్‌’ మిస్సైళ్లు ఈ యుద్ధవిమానంలో ఉంటాయి.

వీటిసాయంతో భారత వైమానిక దళం దేశ సరిహద్దులు దాటకుండా పాకిస్థాన్‌లోని ఏ మారుమూల లక్ష్యంపైనైనా క్షిపణులను ప్రయోగించగలుగుతుంది. పాకిస్థాన్‌ వద్ద 80 కిలోమీటర్ల బియాండ్‌ విజువల్‌ రేంజి సామర్థ్యంతో లక్ష్యాలను చేధించగల యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయి. తొమ్మిదిన్నర టన్నుల ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం రఫేల్ సొంతం. ఎలాంటి ప్రతికూల వాతావరణంలోనైనా, రాత్రిపగలు తేడా లేకుండా దూసుకుపోగలగడం దీని ప్రత్యేకత. ఏకకాలంలో ఆకాశం, భూమిపైనున్న లక్ష్యాలను చేధించగలుగుతుంది.

రెండు ఇంజన్లు కలిగిన రఫేల్ యుద్ధవిమానాలు గంటకు 2 వేల 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. 3 వేల 700 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై దాడిచేయగలవు. క్షిపణులు, బాంబులను అమర్చేందుకు ఈ విమానాల్లో 14 హార్డ్ పాయింట్లు ఉంటాయి.

రఫేల్ విమానాలు శత్రువుకు గరిష్ఠస్థాయిలో నష్టం కలిగించగలవు. ఒక్కసారి దాడులు చేసి వచ్చాక, స్వల్ప సమయంలోనే మరోదాడికి ఇది సిద్ధం చేయవచ్చు. ఈ ప్రత్యేకత వల్ల రోజుకు ఐదుసార్లు దాడులు చేసే సామర్థ్యం దీని సొంతం. మిగతా విమానాలు మూడుసార్లు మాత్రమే దాడులు చేయగలవు. రఫేల్‌ ఇంజిన్‌ను మార్చడానికి అర గంట సమయం సరిపోతుంది. అదే సుఖోయ్‌-30 యుద్ధవిమానం 8 గంటల సమయం అవసరం. మొత్తం రఫేల్‌ యుద్ధవిమానాల్లో 75 శాతం ఏ సమయంలోనైనా పోరాటానికి సన్నద్ధంగా ఉంటాయి.

రఫేల్ యుద్ధ విమానాల్లోని సురక్షితమైన డేటా లింక్‌.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇతర యుద్ధవిమానాలకు, వ్యూహకర్తలకు అందిస్తుంది. విమానంలో అధునాతనమైన రాడార్ వ్యవస్థ, ఏకకాలంలో అనేక లక్ష్యాలపై కన్నేసి ఉంచుతుంది. పూర్తి కర్బన పదార్థాలతో రూపొందించిన రఫేల్ యుద్ధ విమానాలు శత్రువుల రాడార్‌కు దొరికే అవకాశం తక్కువే. అఫ్గానిస్థాన్‌, సిరియా వంటి చోట్ల ఇది ఇప్పటికే తన సత్తాను చాటింది. ప్రస్తుతం ఫ్రాన్స్, ఈజిప్ట్, ఖతార్ దేశాల వద్ద మాత్రమే రఫేల్ యుద్ధవిమానాలు ఉన్నాయి.

రఫేల్ యుద్ధవిమానాలు ఇప్పటికే ఫ్రాన్స్ వైమానిక దళంలో ఉన్నప్పటికీ, భారత్‌ తనకోసం అనేక మార్పులు చేర్పులు చేయించింది. ఇవి ఫ్రాన్స్‌ వద్ద ఉన్నవాటి కన్నా మెరుగైనవని విశ్లేషకులు చెబుతున్నారు. శీతల ప్రదేశంలోనూ ఇంజిన్లు ఆన్‌ అయ్యే సామర్థ్యం, అధునాతన రాడార్‌, శత్రువును గుర్తించే మెరుగైన సామర్థ్యం, శత్రువు ఎదురుదాడిని సమర్థంగా తట్టుకోగలిగే సత్తా తదితరాలు భారత వెర్షన్‌ సొంతం.

రక్షణ రంగంలో భారత్‌కు ఫ్రాన్స్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. రఫేల్‌ తయారీ సంస్థ అయిన డసో ఏవియేషన్‌ తయారుచేసిన మిరాజ్‌-2000 యుద్ధవిమానాలను భారత్‌ ఇప్పటికే వాడుతోంది. కార్గిల్‌ యుద్ధంలో అవి అద్భుతంగా పనిచేశాయి. పైగా విడిభాగాల సరఫరా, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ వంటి విషయాల్లో ఫ్రాన్స్‌ పనితీరు బాగుంది. మిరాజ్‌-2000 యుద్ధవిమానాల నిర్వహణకు ఏర్పాటు చేసిన వసతులే రఫేల్‌కూ సరిపోతాయి. మిరాజ్‌-2000 పైలట్లు స్వల్ప శిక్షణతోనే రఫేల్‌నూ నడపొచ్చు.

దేశ రక్షణ ఒప్పందాల చరిత్రలోనే రఫేల్ డీల్ అత్యున్నతమైనదని డిఫెన్స్, విదేశాంగ నిపుణులు ఎన్నోసార్లు స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన తర్వాత యుద్ధానికి కాలుదువ్వుతున్న పాకిస్తాన్ కు.. అలాగే.. ఉగ్రదేశానికి వంతపాడుతున్న చైనా కు.. రఫేల్ ఏకకాలంలో చెక్ పెట్టగలదు. అందుకే, ఈ అత్యాధునిక అణ్వస్త్ర విహంగం కోసం భారత వైమానిక దళం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. మరికొద్ది రోజుల్లోనే రఫేల్ యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో చేరనున్నాయి.