Tuesday, October 15, 2019
Follow Us on :

విజయదశమి నాడు.. వాయుసేన అమ్ముల పొదిలోకి మరో తిరుగులేని బ్రహ్మాస్త్రం

By BhaaratToday | Published On Oct 9th, 2019

చెడుపై మంచి విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి నాడు.. భారత వాయుసేన అమ్ముల పొదిలోకి మరో తిరుగులేని బ్రహ్మాస్త్రం చేరింది. పాక్, చైనా జంటకు షాక్ ఇచ్చే అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాన్ని భారత్ సొంతం చేసుకుంది. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ జెట్ ఫైటర్ జెట్ ను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అందుకున్నారు. ఒప్పందంలో భాగంగా ఆ దేశం నుంచి రావాల్సిన 36 యుద్ధ విమానాల్లో తొలి జెట్ కు రాజ్ నాథ్ ‘శస్త్రపూజ’ నిర్వహించారు. ఆ తర్వాత అత్యాధునిక లోహ విహంగాన్ని అధికారికంగా స్వీకరించారు.

ఎంతోకాలంగా భారత్ ఎదురుచూస్తున్న 36 రఫెల్ యుద్ధ విమానాలలో మొదటిది భారత్ అమ్ములపొదిలో చేరింది.  డసో ఏవియేషన్ నుంచి.. అధికారికంగా భారత్ కు అందింది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ వెళ్లిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. తొలి రఫేల్ విమానాన్ని స్వీకరించారు. రఫెల్ ను స్వీకరించేందుకు రాజ్ నాథ్ సింగ్.. పారిస్ నుంచి మెరిగ్నాక్ డసో ఏవియేషన్ యూనిట్ కు.. ఫ్రాన్స్ మిలటరీ యుద్ధ విమానంలో ప్రయాణించారు. పారిస్ లోని వెలిజీ-విల్లాకోబ్లే ఎయిర్ బేస్ నుంచి మెరిగ్నాక్ కు వెళ్లారు. అక్కడ డసో ఏవియేషన్ అసెంబ్లీంగ్ యూనిట్ లో రఫెల్ యుద్ధ విమానాల అసెంబ్లింగ్ ను పరిశీలించారు.

అంతకుముందు.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్‌తో రాజ్ నాథ్ సమావేశం అయ్యారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరును మాక్రాన్ అభినందించారు. టెర్రరిజంపై ఉమ్మడి పోరాటానికి తమ అండ ఉంటుందని ఈ సందర్భంగా చెప్పారు.

 షెడ్యూల్‌ ప్రకారం రఫెల్ ను భారత్ కు డెలివరీ చేయడం పట్ల రాజ్ నాథ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. రఫేల్ అప్పగింత సందర్భంగా.. జాయింట్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన రాజ్ నాథ్.. ఇది భారత వైమానిక దళానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్-ఫ్రాన్స్ రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాల మధ్య సహకారం అన్ని రంగాలలో మరింత పెరుగుతుందని అన్నారు. భారత్ లో ఇవాళ విజయదశమి పండుగ జరుపుకుంటున్న శుభసందర్భంలో.. రఫేల్ ను స్వీకరించడం ఆనందం కలిగిస్తోందన్నారు రాజ్ నాథ్. ఫ్రెంచ్ భాషలో రాఫెల్ అంటే ‘సుడిగాలి దెబ్బ’ అని అర్థమని, దాని పేరును సార్థకం చేసుకుంటుందని భావిస్తున్నానని రాజ్ నాథ్ అన్నారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి, భారతదేశానికి, ఫ్రాన్స్, డసో ఏవియేషన్లకు కూడా ఇది గొప్ప రోజని అన్నారు డసో ఏవియేషన్ సీఈవో ఎరిక్ ట్రాపియర్. కాంట్రాక్ట్ లో భాగంగా భారత్ కోసం రఫెల్ యుద్ధ విమానాలు రెడీ చేశామని తెలిపారు.

 వాయుసేన దినోత్సవంతో పాటు.. విజయదశమి కూడా కలిసిరావడంతో రాజ్ నాథ్ తొలి రఫెల్ కు ఫ్రెంచ్ గడ్డపైనే ఆయుధపూజ నిర్వహించారు. శాస్త్రోక్తంగా పూజలు చేసి, ఆ యుద్ధ విహంగంపై కుంకుమ మిశ్రమంతో 'ఓం' అని రాశారు. అంతేకాదు, విమానం టైర్ల కింద నిమ్మకాయలు ఉంచి దిష్టి తీశారు.

ఆ తర్వాత.. రఫేల్ విమానంలో రాజ్ నాథ్ ప్రయాణించారు. మెరిగ్నాక్ ఎయిర్ బేస్ నుంచి తొలిసారి ఎగిరిన భారత రఫేల్ విమానం.. ఓ ఐదు నిమిషాల పాటు.. ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ఒప్పందం ప్రకారం భారత్ కు డసో ఏవియేషన్ సంస్థ 36 రాఫెల్ యుద్ధ విమానాలను అందించాల్సి ఉంది. ప్రస్తుతం రాజ్ నాథ్ అందుకున్నది తొలి విమానం. దీనికున్న అద్భుత పోరాట సామర్థ్యాల దృష్ట్యా భారత్ అగ్రరాజ్యాలకు దీటుగా వాయుశక్తిని సముపార్జించుకున్నట్టయింది.

 ఇక, 2020 మే నుంచి మిగిలిన విమానాలు ఒక్కొక్కటిగా భారత్ కు చేరుకుంటాయి. మొదట తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో ఒక్కో రఫేల్ విమానాన్ని మోహరిస్తారు. హర్యానాలోని అంబాల ఎయిర్‌బేస్‌తో పాటు పశ్చిమ బెంగాల్‌లోని హసిమరా ఎయిర్‌బేస్‌‌లో రఫేల్‌ విమానాల స్క్వాడ్రన్‌ లను తరలించనున్నట్టు రక్షణ వర్గాల సమాచారం. అంతేకాదు, రఫేల్ విమానాలను నడిపేందుకు ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ పైలట్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది డసో ఏవియేషన్. 24 మంది పైలట్లకు మూడు బ్యాచ్‌ల వారీగా పంపించి శిక్షణ ఇస్తారు.

పైలెట్ల శిక్షణ ముగిసిన తర్వాత.. తొలివిడతలో భాగంగా.. వచ్చే ఏడాది మే లో భారత్ కు నాలుగు రఫేల్ యుద్ధ విమానాలు రానున్నాయి. ఆ తర్వాత విడతల వారిగా.. సెప్టెంబర్ 2022 నాటికి మొత్తం 36 విమానాలు భారత వాయుసేనలో చేరనున్నాయి.