Friday, July 19, 2019
Follow Us on :

గెలుపు బాటలో రాహుల్ రాణిస్తారా..?

By BhaaratToday | Published On Mar 16th, 2019

‘కలివిడి’ మాటలు. ‘కలుపు’గోలు సమావేశాలు. ఎన్నికల ప్రచారంలో మారుతున్న రాహుల్ శైలి. ఈ మార్పుతో మోదీని ఢీకొట్టగలరా..? యువనేతకు ‘మిత్రులు’ జైకొడతారా..? గెలుపు బాటలో రాహుల్ రాణిస్తారా..? లేక, మళ్లీ ఓటమితోనే ముగిస్తారా..? నిలబడతారా..?.. ఘనమైన కుటుంబ నేపథ్యంతో వారసత్వ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రాహుల్‌ గాంధీ.. ఇప్పుడు ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయంగా ఎన్నికల గోదాలోకి దిగారు. బీజేపీ కంటే స్పీడుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇటీవలి మూడు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచిన జోష్ తో లోక్ సభ పోరుకు సిద్ధమయ్యారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు రాహుల్ గాంధీ. మరి ఈ జోష్ రాహుల్ ను అధికార పీఠంపై కూర్చోబెడుతుందా..? కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేరుస్తుందా..? ఒకవేళ రాహుల్ గెలిస్తే కేంద్ర రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయి..? ఓడిపోతే, ఆయన భవిష్యత్తు ఎలా వుండబోతోంది..?  2017లో ఎప్పుడైతే రాహుల్‌ చేతికి కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు వచ్చాయో.. అప్పటి నుంచి ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందనేది నిపుణుల మాట. గుజరాత్ ఎన్నికల్లో ఓటమిపాలైనా.. నైతిక విజయం సాధించిన రాహుల్.. ఇటీవలి మూడు రాష్ట్రాల ఎన్నికల్లో విజయంతో పరిణితి కనబరిచారు. ఇక రాఫెల్‌ అంశంలో మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టడం, సోషల్‌ మీడియాలో కూడా మోదీతో పోటీపడడం వంటి అంశాలు రాహుల్‌ని బలమైన ప్రత్యర్థిగానే నిలబెట్టాయి. కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు రాహుల్ గాంధీ. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రెండు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇదంతా బాగానే వుంది. ఈ ఐదేళల్లో పెద్దయెత్తున ప్రజాదరణ చూరగొన్న.. ప్రధాని మోదీని ఢీకొట్టి రాహుల్ నిలబడగలరా..? అనేది.. ఇప్పుడు వేయి డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఢిల్లీ పీఠం అధిరోహించాలంటే రాహుల్ లో వచ్చిన ఈ పరిణితి, ఈ దూకుడు సరిపోతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

13 దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ప్రధాని పదవి కోసం రిజర్వ్ చేసిన ఒకే ఒక్క పేరు రాహుల్ గాంధీ. 2017లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడిగా పగ్గాలు చేపట్టిన ఈ యువనేత.. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీని ఢీకొడుతున్నారు. మరి, ఈ హోరాహోరీ యుద్ధంలో ఆయన విజయం సాధిస్తారా..? లేక పరాజయం పాలవుతారా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  సరిగ్గా 15 నెలల క్రితం రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే నాటికి.. పార్లమెంట్ లో కాంగ్రెస్ కు కేవలం 44 మంది ఎంపీలున్నారు. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. రాష్ట్రాల్లోనూ దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2014 ఎన్నికల తరువాత జరిగిన అనేక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బలు తగులుతూ వచ్చాయి. కానీ, పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత రాహుల్ గాంధీ.. దూకుడు పెరిగింది. తీరు మారింది. పనితీరు వేగం అందుకుంది. ఇప్పుడు అదే జోష్ తో లోక్ సభ ఎన్నికల గోదాలోకి దిగారు రాహుల్ గాంధీ. అహ్మదాబాద్‌లో గత మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంతో రాహుల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అది కూడా ఈసీ ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసిన రెండు రోజుల్లోనే కార్యాచరణను వేగవంతం చేశారు. మోదీ, అమిత్ షా సొంత రాష్ట్రం నుంచి ఎన్నికల భేరీ మోగించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత గుజరాత్ రాజధాని గాంధీనగర్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని అదాలాజ్ వద్ద జరిగిన ఆ పార్టీ భారీ బహిరంగ సభలో మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు రాహుల్ గాంధీ. గుజరాత్ సభతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపటంతో పాటు.. బలప్రదర్శనగా కూడా ఈ బహిరంగ సభను వేదికగా చేసుకున్నారు. 1930లో మహాత్మా గాంధీ దండియాత్రను ప్రారంభించిన.. మార్చి 12వ తేదీన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అంతేకాదు.. ఈ సమావేశాన్ని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ స్మారకం దగ్గరే నిర్వహించటం ద్వారా పటేల్ తన కాలంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడని దేశానికి గుర్తుచేశారు. ఇక బహిరంగ సభకు 'జై జవాన్ - జై కిసాన్' సభగా పేరు పెట్టటం ద్వారా మరో సందేశం ఇచ్చారు.  పటీదార్ నాయకుడు హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా.. గుజరాత్‌లో కాంగ్రెస్ బలపడుతోందని చెప్పేలా ఇంకో సందేశం ఇచ్చారు రాహుల్ గాంధీ. అన్నిటికీ మించి.. మోదీ, షా ద్వయాన్ని వారి సొంత బరి నుంచే సవాల్ చేయటానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నది ఈ సమావేశం, సభల సంకేతం. మోదీ సొంత రాష్ట్రం నుంచి ప్రచార భేరి మోగించిన రాహుల్ గాంధీ.. చెన్నై పర్యటనతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అంతేకాదు, తన వేష భాషలను కూడా మార్చుకుని యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.  చెన్నైలోని ఓ మహిళా కాలేజీ విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్ గాంధీ.. మహిళా ఓటర్లే లక్ష్యంగా సంచలన హామీలు గుప్పించారు. పార్లమెంటులో పెండింగులో వున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకి చట్టరూపం కల్పిస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే పార్లమెంట్, అసెంబ్లీల్లో స్త్రీలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తామని స్పష్టంచేశారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించి సంచలనం రేపారు. కాంగ్రెస్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ పార్టీలు సైతం మహిళా ఓటర్లపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. టీఎంసీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాలో 40 శాతం మంది మహిళలకు టికెట్లు కట్టబెట్టారు మమతా బెనర్జీ. అటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సైతం 33శాతం లోక్‌సభ సీట్లను మహిళలకే కేటాయించారు. తాజాగా రాహుల్ గాంధీ ప్రకటన రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. మరోవైపు తన ప్రచార శైలిని సైతం వినూత్నంగా మార్చుకున్నారు రాహుల్ గాంధీ. సందర్భానికి తగిన విధంగా తన వేష, భాషల్లోనూ మార్పులు చేసుకున్నారు. చెన్నై లో విద్యార్థినులతో భేటీ సందర్భంగా స్టూడెంట్స్ తో కలుపుగోలు తనం ప్రదర్శించారు. తనను సార్ అని సంబోధించవద్దని.. కేవలం రాహుల్ అని పిలిస్తే సరిపోతుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  2014 ఎన్నికలతో  పోలిస్తే రాహుల్ గాంధీలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగానూ ఎన్నికలు ఎదుర్కోబోతున్న రాహుల్‌ గాంధీలో రాజకీయంగా పరిణతి కనిపిస్తోంది. సోషల్‌మీడియాలో గతంలో పప్పుగా అందరినోళ్లల్లోనూ నానేవారు రాహుల్. ఇప్పుడా పరిస్థితి లేనేలేదు. రాజకీయంగా వివిధ అంశాలను లేవనెత్తే విషయంతోపాటు పదునైన విమర్శలు సంధించడంలోనూ చురుకుగా ఉన్నాడని పరిశీలకులే చెబుతున్నారు. కాపలాదారుడినన్న మోదీ వ్యాఖ్యను కాపలాదారుడే దొంగ.. చౌకీదార్‌ చోర్‌ హై.. అని తిప్పి కొట్టడం.. జీఎస్‌టీని గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌గా అభివర్ణించడం.. రఫెల్ వివాదం, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ అంశాల్లో రాహుల్ ప్రశ్నలు, పదునైన విమర్శలు చేయడంలో రాహుల్ పరిణితి చెందినట్టే కనిపిస్తోంది.

ఒక జాతీయ పార్టీలో బాధ్యాతాయుతమైన పదవుల్లో కొనసాగిన.. కొనసాగుతున్న రాహుల్ గాంధీ.. గతంలో ఎన్నో సందర్భాల్లో తన రాజకీయ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. రాజకీయాలు రంజుగా సాగుతున్న సమయంలో హఠాత్తుగా విదేశాలకు వెళ్లిపోయేవారు. ఎందుకు వెళ్లేవారో ఎక్కడికి వెళ్లేవారో కొందరు సన్నిహితులకి తప్ప మరెవరికీ తెలిసేది కాదు. ప్రజాప్రతినిధులను అనర్హత వేటు నుంచి తప్పించడానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కాపీని విలేకరుల సమావేశంలోనే చించిపారేశారు. ఓ రకంగా చూస్తే అది మంచి పనే అయినప్పటికీ సొంత ప్రభుత్వాన్నే ఇరుకున పెట్టినట్టయింది. అంతేకాదు, కేంద్రంపై అవిశ్వాసం చర్చ సందర్భంగా అప్పటివరకు మోదీపై నిప్పులు చెరిగిన రాహుల్, అంతలోనే ఆయన సీటు దగ్గరకి వెళ్లి కౌగిలించుకున్నారు. మళ్లీ తన సీటుకి తిరిగొచ్చాక కన్నుగొట్టి అందరినీ తన రాజకీయ అపరిపక్వతను ప్రదర్శించుకున్నారు. గతంలో ఎన్నడూ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టని రాహుల్.. అమేథీ నియోజకవర్గానికి కూడా పెద్దగా చేసింది లేదు. గాంధీ, నెహ్రూ కుటుంబంపై అభిమానంతో అక్కడ రాహుల్‌కి ఓట్లు పడుతున్నాయనేది వాస్తవం. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయంతో సోషల్‌ మీడియాలో ఆయన టార్గెట్‌ అయ్యారు. రాహుల్‌ని పప్పూ అంటూ జోకులు మీమ్‌లతో సామాజిక మాధ్యమాలు హోరెత్తిపోయాయి. 2017లో రాహుల్‌ చేతికి కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు వచ్చాయి. అప్పుడే రాహుల్‌లో ఉన్న సత్తా బయటకి వచ్చింది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయినప్పటికీ రాహుల్‌ గెలిచాడని ప్రజలు నమ్మారు. అప్పట్నుంచే ఆయనపై పప్పు ముద్ర చెరిగిపోతూ వస్తోంది. రాఫెల్‌ అంశంలో మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టడం, సోషల్‌ మీడియాలో కూడా మోదీతో పోటీపడడం వంటి అంశాలు రాహుల్‌ని బలమైన ప్రత్యర్థిగానే నిలబెట్టాయి. గత ఏడాది మూడు హిందీ రాష్ట్రాల్లో రాహుల్‌ ఒంటిచేత్తోనే ప్రచారం చేసి కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆ విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో పక్కా ప్రణాళికలతో లోక్‌సభ బరిలోకి దూకుతున్నారు. నిజానికి, మూడు రాష్ట్రాల్లో విజయం కోసం రాహుల్ అవలంబించిన యువమంత్రం ఫలించిందంటారు రాజకీయ నిపుణులు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తూనే.. యువ నేతలను క్రియాశీలకంగా ఉపయోగించుకోవడంలో రాహుల్ సమతుల్యత పాటించడం కలిసి వచ్చందనే అభిప్రాయం ఉంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ వంటి సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తూనే.. జ్యోతిరాదిత్య సింధియా వంటి యువ నాయకులపై ఎన్నికల ప్రచార బాధ్యతలు పెట్టి రాహుల్ తెలివిగా వ్యవహరించారు. రాజస్థాన్ లోనూ అశోక్ గెహ్లాట్ రాజకీయ అనుభవాన్ని వాడుకుంటూ, సచిన్ పైలెట్ ని ప్రముఖంగా తెరపైకి తెచ్చారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు వెనుక జ్యోతిరాదిత్య, సచిన్ పైలెట్ కృషి ఉందని తెలిసినా వారిని ఆయా రాష్ట్రాలకు సీఎంలుగా చేయాలని వ్యక్తిగతంగా బాలంగా కోరుకున్నా.. తల్లి మాటకు, పార్టీలోని సీనియర్ల సలహాలకు తలపించే.. గెహ్లాట్ కు, కమల్ నాథ్ లకు సీఎంలుగా చేసిన రాహుల్.. మొండి రకం కాదని చెప్పకనే చెప్పారు. అయితే, రాష్ట్రాల్లో కాంగ్రెస్ ని గెలిపించడం వేరు, జాతీయ స్థాయిలో ఆ పార్టీకి పూర్వవైభవం తేవడం వేరు. 2014 ఎన్నికల్లో ఘోర పరాభవంతో కుదేలైన కాంగ్రెస్ కొత్త జవజీవాలు తీసుకొని రావడంలో రాహుల్ బాగానే నెగ్గుకొస్తున్నారు. పార్టీలో తన నాయకత్వానికి సొంత నిర్వచనాలిస్తున్నారు. అంతర్గత కుమ్ములాటలను పరిష్కరించడంలో రాహుల్ స్టైలే వేరంటారు. నాయకుల మధ్య విభేదాలను తగ్గించి, పార్టీని ఏక తాటిపైకి తీసుకొని రావడంలోనే రాహుల్ విజయం దాగుంది. కాంగ్రెస్ పార్టీ అంటే అది వయోవృద్ధుల పార్టీ అనే భావన నుంచి బయటపడేయడంలో రాహుల్ విజయం సాధించారు. పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కిస్తున్నారు. పాతతరం మనోభావాలు దెబ్బతినకుండా.. యువ ప్రాధాన్యతను పెంచుతున్నారు. అచ్చమైన యువ నాయకుడిలా దేశంలోని యువజనుల్లో ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని, ప్రధాని మోదీకి స్వయంగా ప్రమేయం ఉందని జాతీయస్థాయిలో ప్రధాన అంశంగా చేయడంలో రాహుల్ విజయం సాధించారనే చెప్పాలి. ప్రతి సందర్భంలో, ప్రతి ఎన్నికల సభలో పార్లమెంటు వెలుపలా, బయట ఒంటి చేత్తో రాఫెల్ అంశాన్ని ప్రచారం చేశారు. కర్నాటక ఎపిసోడ్ లో రాహుల్ చతురత బాగానే పనిచేసింది. మూడో స్థానంలో ఉన్న జనతాదళ్ గారెల బుట్టలో పడింది. సీఎం పదవి ముఖ్యం కాదు.. బీజేపీని రానివ్వొద్దన్న సిద్ధాంతంతో కుమారస్వామికి పట్టంగట్టడంలో కాంగ్రెస్ ఆధునిక పోకడలు అవలంబించింది. కుమారస్వామి సీఎం పట్టాభిషేకానికి దేశంలోని విపక్షాలను ఆహ్వానించి.. బీజేపీకి ప్రత్యామ్నాయం ఉందని రాహుల్ నిరూపించడంలో విజయం సాధించారు. అసలు కర్నాటకలో కాంగ్రెస్ వ్యవహారశైలితోనే కాంగ్రెస్, రాహుల్ పైనా నమ్మకం కలగడానికి బీజం పడిందని చెప్పాలి. గత డిసెంబర్లో వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. కాంగ్రెస్ రైతు రుణ మాఫీ హామీ బాగా పని చేసింది. చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో రాహుల్ ఇచ్చిన రుణ మాఫీ హామీకి రైతుల నుంచి బాగానే స్పందన వచ్చింది. హామీ ఇవ్వడమే కాకుండా.. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడుతూనే మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం, అమలు చేయడంలో దేశంలోని రైతులు ఒక్కసారిగా కాంగ్రెస్ వైపు చూసేటట్లు చేయడం కూడా రాహుల్ కి కలిసి వచ్చేదే! కాంగ్రెస్ అధ్యక్షపదవి చేపట్టిన నాటి నుంచి జాగ్రత్తగ గమనిస్తే.. రాహుల్ తన రాజకీయ ప్రత్యర్థిగా నరేంద్ర మోదీనే ఎంచుకున్నట్టు తెలుస్తోంది. దేశానికి కాపలాదారుగా ఉంటానన్న మోదీ.. రాఫెల్ ఒప్పందంలో ప్రజా ధనాన్ని అనిల్ అంబానీ కంపెనీకి అప్పనంగా కట్టబెట్టారని రాహుల్ ప్రచారం చేశారు. పెద్దనోట్ల రద్దుపై భారీగా విమర్శలు ఎక్కుపెట్టారు.  గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ సంకీర్ణంలో ఉన్నా.. దానికి నాయకత్వం వహించాల్సిందే. పెద్దన్న పాత్రను కాంగ్రెస్ ఎన్నడూ వదులుకోలేదు. వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఈ విషయంలో రాహుల్ వ్యవహారశైలి దేశంలోని ప్రాంతీయ పార్టీల మనసు చూరగొంటోంది. 22 పార్టీలతో ఏర్పడని మహా ఘట్ బంధన్ కి తానే సూత్రధారి అని రాహుల్ ఎన్నడూ వ్యవహరించలేదు. ఆయా సందర్భాలను బట్టి, ఎవరు ముందుకు నడిపించినా వారి వెన్నంటే ఉండడానికి రాహుల్ ఎలాంటి సంకోచాన్ని ప్రదర్శించడం లేదు. లోక్ సభలో కేవలం పదిహేను ఎంపీలున్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు చొరవ తీసుకొని.. కూటమిని నడుపుతున్నా రాహుల్ రాజకీయంగా ఏమీ ఇబ్బంది పడడం లేదు.  ప్రస్తుత ఎన్నికల్లో గెలిచేసి.. ప్రధాని అయిపోవాలనే ఆతృత రాహుల్ గాంధీలో ఏమాత్రం కనిపించకపోవడం కూటమిలోని భాగస్వామ్య పార్టీల నేతలకు ఎంతో సంతోషంగా ఉంది. రాజీవ్ గాంధీ తరువాత.. నెహ్రూ కుటుంబీలు ఎవరూ ప్రధాని పదవి చేపట్టలేదు. ఇప్పుడా అవకాశం రాహుల్ ముందున్నా.. దానిపై పెద్దగా ప్రేమ లేనట్లే కనిపిస్తున్నారు. ప్రధాని పదవి కన్నా.. బీజేపీని గద్దె దించడమే రాహుల్ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీల్లో ఎవరైనా ప్రధాని అయ్యే అవకాశాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ తలుపులు బార్లా తెరిచిందంటే.. దానికి రాహుల్ గాంధీ రాజకీయంగా పరిణితి చెందారనే వాదన వినిపిస్తోంది.

మోదీని గద్దెదింపడమే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు రాహుల్ గాంధీ. ఇంతవరకు బాగానే వున్నా.. దేశ ప్రజల్లో అత్యంత ఆదరణ చూరగొన్న మోదీని ఢీకొట్టి విజయం సాధిస్తారా అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.  ప్రస్తుత ప్రత్యర్థి వంటి రాజకీయ శత్రువు కాంగ్రెస్ కి గతంలో ఎన్నడూ లేరు. వాజ్ పేయి తరహా వేరు, ఆనాటి అద్వానీ సారథ్యంలో బీజేపీ పోరాటం, వ్యూహం వేరు. ఇప్పుడు మోదీ, అమిత్ షా ద్వయం దూసుకుపోతోంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో ఆ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. గతంలో కంటే బీజేపీ వ్యూహాలు కూడా మారాయి. దూకుడు పెరిగింది. నిర్ణయాలు తీసుకోవడంలో, అమలు చేయడంలో బీజేపీ ధాటిగా వ్యవహరిస్తోంది. ఇలాంటి శత్రవు కాంగ్రెస్ కి గతంలో ఎన్నడూ తారస పడలేదు. ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూలగొట్టడంలో, రాష్ట్రపతి పాలనలు విధించడంలో, వారి ఎమ్మెల్యేలను, ఎంపీలను లాక్కోవడంలో ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ కే బీజేపీ సరికొత్త పాఠాలు నేర్పిస్తోంది. ఇలాంటి బీజేపీని ఓడించడం రాహుల్ గాంధీకి సాధ్యమేనా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. కశ్మీర్ విషయంలో బీజేపీ వ్యూహాల బలమెంతో నిరూపితమైంది. పీడీపీతో జోడీ కట్టిన బీజేపీ జమ్ము కశ్మీర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. ఆ తరువాత పీడీపికి మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో అసెంబ్లీ సుసుప్థావస్థ స్థితిలోకి వెళ్లిపోయింది. దీన్ని ఆసరాగా తీసుకుని విపక్షాలు పీడీపీకి మద్దతిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనుకునేలోగానే.. జమ్ము, కశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించి.. బీజేపీ పైచేయి సాధించింది. ఇది నేరుగా కాకపోయినా.. బీజేపీ వ్యతిరేక కూటమికి, అదే విధంగా రాహుల్ కి ఎదురు దెబ్బనే. ప్రత్యర్థి ఎత్తుగడలను ముందే పసిగట్టి.. ఎత్తులు వేయడంలో రాహుల్ నెమ్మదిగా ఉన్నారనేది మాత్రం వాస్తవం. తెలంగాణ విషయానికి వస్తే.. రాహుల్ వ్యూహాలు ఇక్కడ ఘోరంగా దెబ్బతిన్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ లలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మహా కూటమి ఏర్పాటు చేసినా.. చతికిల పడింది. తెలంగాణలో తెలుగు దేశం పార్టీపై ఉన్న వ్యతిరేకతను అంచనా వేయడంలో రాహుల్ గాంధీ విఫలమయ్యారనే ఆరోపణలొచ్చాయి. టీఆర్ఎస్ పార్టీ ఆకర్షణలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు పడిపోతుంటే.. హైకమాండ్ చూస్తూ ఊరుకుందనే విమర్శలు కూడా రాహుల్ నాయకత్వ పటిమకి ప్రశ్నార్థకంగా మారాయి. ఇక మహా ఘట్ బంధన్ అని ప్రకటించినా.. ఆదరణలో అది ఎంత గట్టిగా ఉందనేది ప్రశ్నార్థకంగా మారడం కూడా రాహుల్ లోపంగానే చెబుతారు. మరీ ఉదార వాదంగా.. కూటమిలోని పార్టీలు వాటి ఇష్టానుసారంగా ప్రవర్తించడం వెనుక కూడా రాహుల్ ఈ వ్యవహారాలను తేలిగ్గా తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఎవరు బడితే వారు ప్రధాని కావొచ్చనే ఆలోచనలకూ కూడా రాహుల్ తీరే కారణమనే వారు లేకపోలేదు. మాయావతి, మమతా బెనర్జీ వంటి వారిని పక్కన బెడితే, దేవెగౌడ వంటి వారు కూడా ప్రధాని రేసులో ఉన్నారనే వార్తలు.. మహా ఘట్ బంధన్ సత్తానే సందేహాస్పదంగా మార్చేశాయి. రాజీవ్ గాంధీ హయాంలో బోఫోర్స్ పై విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి.. ఉమ్మడిగా దేశమంతా పెను దుమారం సృష్టించాయి. బోఫోర్స్ ఆరోపణల కారణంగా ఆనాడు కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా..? యూపీఏ పక్షాలు, తాజాగా మహా ఘట్ బంధన్ తో అనుబంధం పెంచుకున్న పార్టీలు కానీ, రాఫెల్ వ్యవహారంలో ముక్కుబడిగా విమర్శలు చేస్తున్నారు. రాఫెల్ పై ప్రధానిని నిలదీయడంలో రాహుల్ చూపిస్తున్న శ్రద్ధ.. పడుతున్న శ్రమ ఇతర పార్టీల నుంచి రావడం లేదు. బోఫోర్స్ పై ఆనాడు తన తండ్రి పరువు తీసిన విపక్షాలు, మరీ ముఖ్యంగా బీజేపీ దుంప తెంచడమే లక్ష్యంగా రాహుల్ వ్యవహరిస్తున్నారనే విమర్శ ఉంది. ఈ విషయంలో రాహుల్.. ప్రధాని మోదీపై వ్యక్తిగత పగతో రగిలిపోతున్నారనే సంకేతాలు జనాల్లోకి వెళ్లడం కాంగ్రెస్ కి కలిసి వచ్చే అంశం కాదంటున్నారు. ఓట్లేసే జనాలు.. రాఫెల్ గురించి ఆలోచిస్తారా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. పుల్వామా దాడుల తరువాత.. బాలాకోట్ సర్జికల్ స్ట్రయిక్స్ అనంతరం ఏర్పడ్డ పరిస్థితులు కాంగ్రెస్ కి, రాహుల్ కి ప్రతికూలంగానే ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొన్నటికి మొన్న జేషే అధినేత మసూద్ ని గారు అంటూ రాహుల్ సంబోధించడం కూడా కాంగ్రెస్ ని ఇరకాటంలో పెట్టింది. బీజేపీని హిందూత్వ పార్టీ అని విమర్శించే కాంగ్రెస్ కి రాహుల్ అవలంబిస్తున్న విధానాలు, చేస్తున్న పనులు కొంత తలనొప్పిగా మారాయి. శివభక్తుడినని రాహుల్ ఎక్కడికి వెళితే అక్కడ ఉన్న ఆలయాలను సందర్శిస్తున్నారు. ఫొటోలు విడుదల చేస్తున్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెష్ ఏకంగా రాముడి వనవాస మార్గంలో యాత్రను సైతం నిర్వహించింది. దీంతో కాంగ్రెస్ వెన్నంటే ఇంత కాలం ఉన్న మైనార్టీలు కొంత గందరగోళంలో పడ్డట్టు కనిపిస్తోంది. రాహుల్ వైఖరితో.. హిందువేతర వర్గాలు కాంగ్రెస్ కి దూరమయ్యే ప్రమాదముండడం కూడా ప్రతికూల అంశమే. మరి ఇన్ని ప్రతికూలతల మధ్య మోదీని ఢీకొట్టి రాహుల్ నిలబడతారా అనేది ఆసక్తికరంగా మారింది. రాహుల్ ప్రచారశైలిలో, వ్యవహారశైలిలో వచ్చిన మార్పు ఓట్లను రాబడతుందా అన్నది తెలియాలంటే.. ఎన్నికలయ్యే వరకు ఆగాల్సిందే.