Sunday, August 25, 2019
Follow Us on :

దేశభక్తుడు అని చెప్పుకునే మోడీ విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు

By BhaaratToday | Published On Mar 9th, 2019

భారత ప్రధాని నరేంద్ర మోడీపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ ఎక్కడకు వెళ్లినా తానేదో పెద్ద దేశభక్తుడిని అని చెప్పుకుంటూ తిరుగుతారని.. కానీ మోడీ దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ రాహుల్ ఆరోపించారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

దేశభక్తుడు అని చెప్పుకునే వ్యక్తి విద్వేషాలు రెచ్చగొడతారా అంటూ మోడీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలకు సంబంధించిన సొమ్మును 15 మంది దోపిడీదారులకు కట్టబెట్టడమే దేశభక్తా.. రాఫెల్ కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు దోచెయ్యడమేనా దేశభక్తి అంటూ ప్రశ్నలు సంధించారు. భారతదేశం సరిహద్దుల్లోకి చైనా సైన్యం దూసుకువస్తుంటే ప్రతిఘటించేందుకు చర్యలు తీసుకోకుండా ఆ దేశ అధ్యక్షుడితో ఛాయ్ తాగుతున్న మోదీయా దేశభక్తుడు అంటూ ధ్వజమెత్తారు. 

చైనా-భారత్ సరిహద్దు ప్రాంతమైన డోక్లా వద్ద చైనా సైన్యం భారత్ లోకి వస్తుంటే శాంతికి చర్యలు తీసుకోవాల్సిన మోడీ చైనా అధ్యక్షుడి చేతులు పట్టుకుని వచ్చేశారని రాహుల్ గాంధీ అన్నారు. పుల్వామాలో ఉగ్రవాద దాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోతే స్పందించకుండా సినిమా షూటింగ్ లో మోడీ ఉన్నారని ఆరోపించారు రాహుల్.  దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇద్దరు ప్రధానమంత్రులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారేనని.. ప్రజలు మేల్కొనాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.

నోట్ల రద్దుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ మద్దతిచ్చారని రాహుల్ తెలిపారు. నోట్ల రద్దుతో దేశంలో కోట్లాది మంది నిరుద్యోగులుగా మారితే కేసీఆర్‌ మాత్రం మంచిపని చేశారని అంటారన్నారు. జీఎస్టీ విషయంలో కేసీఆర్‌.. మోడీకి సర్టిఫికెట్‌ ఇచ్చారని.. మోడీకి కేసీఆర్‌ మద్దతిచ్చారని వెల్లడించారు. 

ప్రధాని మోడీ.. నీరవ్‌మోడీ జేబులో డబ్బులు వేస్తారు కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భారత్‌లోని పేదవాళ్ల జేబుల్లో డబ్బులేస్తానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. నీరవ్‌ మోడీని పట్టుకుని డబ్బును పేదలకు పంచుతామని హామీ ఇచ్చారు. ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులు వేయడమే కాంగ్రెస్ లక్ష్యమని రాహుల్ చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన కేవలం పదిరోజుల్లోనే రైతుల రుణమాఫీ చేస్తానని ఇప్పటికే తాను ప్రకటించిన విషయాన్ని మరోసారి ఆయన గుర్తు చేశారు.