Monday, September 23, 2019
Follow Us on :

తిరుమల ఘటనపై రాజా సింగ్ ఆగ్రహం.. వారిపై ఏపీ సియం చర్యలు తీసుకోవాలి

By BhaaratToday | Published On Aug 23rd, 2019

తిరుమల భక్తులకు ఇచ్చే ఆర్టీసీ బస్ టికెట్ల వెనుక జరూసలేం యాత్రకు తక్కువ ఖర్చుతో తీసుకెళతామని ఓ ప్రకటన కనిపించింది. తక్కువ ఖర్చు, అన్ని సౌకర్యాలతో క్రైస్తవులకు పవిత్ర జరుసలేం యాత్ర అంటూ ఓ ప్రకటన ముద్రితమై ఉండటం భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఈ టికెట్లను పొందిన భక్తులు, ఆర్టీసీ అధికారులను నిలదీశారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చీపోయే ప్రయాణికులకు ఇస్తున్న టికెట్ల వెనుక అన్యమత ప్రచారం ఉండటంపై హిందూ బంధువులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

 తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ ఘటనపై స్పందించారు. మీడియాతో మాట్లాడిన రాజాసింగ్ టికెట్లపై అన్యమత ప్రచారం చేయడం సరికాదని, ఈ విషయం గురించి సీఎం జగన్ కు తెలుసా? అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిపై జగన్ చర్యలు తీసుకోవాలని, అన్యమత ప్రచార విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను చెడగొట్టాలని గతంలో చాలా మంది ప్రయత్నించారని.. అయితే వారికి ఏ గతి పట్టిందో అందరికీ తెలుసునని రాజా సింగ్ అన్నారు. తిరుమలకు భారతదేశం నుండి మాత్రమే కాదు ప్రపంచదేశాల నుండి భక్తులు వస్తూ ఉంటారని.. తిరుమల పాతివ్రతను కాపాడాల్సి ఉందని అన్నారు రాజాసింగ్. ఎవరైతే ఇటువంటి పని చేశారో వారందరిపై చర్యలు తీసుకోవాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు.