Tuesday, May 21, 2019
Follow Us on :

‘ఆర్ఆర్ఆర్’ క‌థ చెప్పిన‌ రాజ‌మౌళి

By BhaaratToday | Published On Mar 14th, 2019

దర్శకధీరుడు రాజమౌళి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో కలిసి తెరకెక్కిస్తున్న‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై ఉన్న అనుమానాల‌ను నివృత్తి చేయ‌డానికి సిద్ద‌మ‌య్యాడు. నేడు ఆయ‌న ఇద్ద‌రు క‌థానాయ‌కుల‌తో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ‘‘ఆడియన్స్ సినిమాకు వచ్చే ముందు ఆ సినిమాలో ఎలాంటి కథ చూడబోతున్నాం? ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఆ సినిమా ఇవ్వబోతోంది? ఆ అంచనాలను పర్‌ఫెక్ట్‌గా ఇవ్వగలగాలి. ఈ సినిమా కథేంటో ముందే చెప్పబోతున్నా అన్నారు.

క‌థ‌ విషయానికి వస్తే.. 1897లో ఆంధ్ర ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు పుట్టారు. ఆయన ఇంగ్లీషే కాదు పురాణాలూ చదివారు. యుక్త వయసులో ఆయన ఇల్లు వదిలి వెళ్లిపోయారు. రెండు సంవత్సరాలు లేరు. తిరిగి వచ్చాక స్వాతంత్ర్య పోరాటం మొదలు పెట్టారు. ఆయన వచ్చాక జరిగిందంతా మనకు తెలిసిందే. యుక్త వయసులోనే బ్రిటీషర్స్ చేతిలో మరణించారు. 1901లో ఆదిలాబాద్‌లో కొమరం భీం పుట్టారు. ఆయన కూడాయుక్త వయసులో ఉండగానే ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఆయన నిరక్షరాస్యుడిగా వెళ్లి అక్షరాస్యుడిగా తిరిగొచ్చారు. ఆయన కూడా బ్రిటీషర్స్ చేతిలో చనిపోయారు.
 
వీరిద్దరి కథ చదువుతుంటే వారిద్దరి కథ ఒకేలా అనిపించింది. అందుకే ఆ ఇద్దరి మహావీరులు.. ఒకరికొకరు తెలియనివాళ్లు. ఒకే సమయంలో పుట్టడం.. ఒకే సమయంలో ఇల్లు వదిలి వెళ్లిపోవడం.. తిరిగొచ్చాక ఒకే విధంగా ఫైట్ చేయడమనేది నాకు చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. అయితే ఆ ఇద్దరు మహా వీరులు ఒకవేళ కలిసుంటే.. ఒకరికొరకు స్ఫూర్తిగా నిలిస్తే.. తరువాతి కాలంలో వారిద్దరి స్నేహంతో బ్రిటీషర్స్‌పై పోరాడి ఉంటే.. ఎలా ఉంటుంది? అనేదే మా కథ. ఇది ఒక ఫిక్షనరీ స్టోరీ. ఈ సినిమా కూడా త‌న గ‌త సినిమాల్లాగానే భారీ స్థాయిలో ఉంటుంద‌ని తెలిపారు.