Saturday, October 19, 2019
Follow Us on :

కడపలో టీడీపీకి షాక్..! ఫ్యాన్ కిందకు రాజంపేట కీలక నేత..!!

By BhaaratToday | Published On Jan 31st, 2019

టీడీపీ సీనియర్, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో అనుచరులతో మేడా వైసీపీలోకి వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో కొందరు నేతల దుశ్చర్యలు చూడలేకపోయానని, తనను అన్యాయంగా పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారని ఇదివరకే మేడా మల్లికార్జునరెడ్డి చెప్పారు. వైఎస్సార్‌సీపీ నుంచి రాజంపేట అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా కలిసి పనిచేస్తామన్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ జిల్లాలో పోటీ చేసి.. గెలిచిన ఏకైక టీడీపీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి. ఆయనతోపాటు రాజంపేట నుంచి భారీ ఎత్తున వచ్చిన ఆయన అనుచరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. ప్రతి ఒక్కరినీ పలకరించిన వైఎస్‌ జగన్‌.. కండువాలు కప్పి వారిని పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సందడి నెలకొంది. వైఎస్సార్‌సీపీలో చేరిన సందర్భంగా మేడా మల్లికార్జునరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసినట్టు ఆయన వెల్లడించారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను తాను పంపానని తెలిపారు. వైఎస్‌ జగన్‌తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. గత నాలుగున్నరేళ్లుగా అమలు చేయని హామీలు ఇప్పుడు ఎలా చంద్రబాబు అమలు చేస్తారని మేడా ప్రశ్నించారు. ఎన్నికల నేపథ్యంలోనే చంద్రబాబు కొత్త వాగ్దానాలు ఇస్తున్నారని, ఆయన హామీలను ప్రజలు నమ్మబోరని పేర్కొన్నారు.