Saturday, October 19, 2019
Follow Us on :

రంగంలోకి రామ్ జెట్..! ఇక శత్రుదేశాలకు వణుకే..!!

By BhaaratToday | Published On Feb 10th, 2019

గగనతలంలో సుదూర లక్ష్యాలను ఛేదించగలిగే క్షిపణుల వేగాన్ని గణనీయంగా పెంచే సాంకేతిక వ్యవస్థను భారత్‌ విజయవంతంగా పరీక్షించి చూసింది. ఈ చోదకవ్యవస్థ పేరు రామ్‌జెట్‌. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఒడిసాలోని చాందీపూర్‌ ప్రయోగ కేంద్రం నుంచి రామ్‌జెట్‌ చోదక వ్యవస్థను కలిగిన క్షిపణిని విజయవంతంగా పరీక్షించి భారత రక్షణ రంగాన్ని మరో మెట్టుకు తీసుకెళ్లింది. ఈ టెక్నాలజీ వల్ల మన క్షిపణులు గగనతలంలో దూసుకెళ్లే వేగం ఎక్కువవుతుంది. ధ్వనివేగం కన్నా రెట్టింపు స్పీడుతో మొదలై, అంతకు మూడు రెట్లు ఎక్కువ వేగంతో లక్ష్యాన్ని ఛేదించే వీలు ఏర్పడుతుంది. ఈ వ్యవస్థను కలిగిన జాబితాలో అమెరికా, ఈయూ, రష్యాల సరసన భారత్‌ కూడా చేరింది. రామ్‌జెట్‌ పూర్తి పేరు.. సాలిడ్‌ ఫ్యుయల్‌ డక్ట్‌డ్‌ రామ్‌జెట్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌! పంజాబ్‌ నుంచి ఎక్కడో ఉన్న చైనా సరిహద్దులలోకి క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం దీనికి ఉంటుంది. సాధారణంగా రాకెట్లలో ఘన ఇంధనాలు, ఆక్సిడైజర్లు ఉంటాయి. కానీ ఈ వ్యవస్థలో వాతావరణంలోని గాలే ఆక్సిడైజర్‌గా పనిచేస్తుంది. ప్రత్యేకంగా ఆక్సిడైజర్‌ను మోసుకెళ్లే పని ఉండదు. దీని వల్ల క్షిపణి బరువు కూడా తగ్గి తేలికపడుతుంది. క్షిపణి వేగాన్ని పెంచి శత్రువు స్పందించేలోగానే లక్ష్యాలను తుత్తునియలు చేయగల సామర్థ్యం రామ్‌జెట్‌ సొంతమని ఓ డీఆర్‌డీవో శాస్త్రవేత్త తెలిపారు. ఎస్‌ఎ్‌ఫడీఆర్‌ ప్రాజెక్టును 2013లో రూ.366 కోట్ల బడ్జెట్‌తో డీఆర్‌డీఎల్‌లో ప్రారంభించారు. 2020 నాటికి ఈ చోదక వ్యవస్థ సిద్ధమవుతుందని అంచనా వేయగా.. అనుకున్న సమయాని కన్నా ముందే రెడీ అయ్యింది. 2018లో ఈ టెక్నాలజీని పాక్షికంగా పరీక్షించి విజయం సాధించారు. వచ్చే ఏడాది దీనిని పూర్తిస్థాయిలో పరీక్షించే అవకాశముంది.