Monday, December 09, 2019
Follow Us on :

ఆ రోజులు మ‌ర్చిపోయారు.. అదొక్క‌టే గుర్తుపెట్టుకుని దండెత్తుతున్నారు

By BhaaratToday | Published On Jun 21st, 2019

ఆఫ్ఘనిస్థాన్ టాప్ లెగ్‌‌స్పిన్నర్ అయిన రషీద్ ఖాన్ పేరు నిన్నమొన్నటి వరకు మార్మోగిపోయింది. అత్యుత్తమ బౌలర్ అంటూ అభిమానుల చేత‌, దిగ్గ‌జాల నోటా ప్రశంసలు అందుకున్నాడు. అయితే, ఇదంతా గతం. ప్రపంచకప్‌లో భాగంగా 18న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ రషీద్‌కు పీడకలను మిగిల్చింది. ఈ మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసిన రషీద్ ఖాన్ ఏకంగా 110 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ కూడా తీయ‌లేక‌పోయాడు.
 
దీంతో.. వన్డేల్లో వందకు పైగా పరుగులు సమర్పించుకున్న తొలి స్పిన్నర్‌గా అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. దీనివ‌ల్ల‌ రషీద్‌పై స‌ర్వ‌త్రా విమర్శలు వెల్లువెత్తాయి. రషీద్ నుంచి ఇటువంటి బౌలింగ్‌ను ఊహించలేదంటూ అభిమానులు మండిపడుతున్నారు. తనపై వస్తున్న విమర్శలపై రషీద్ స్పందించాడు. 

గ‌తంలో తాను చక్కగా బౌలింగ్ చేసిన రోజులను మర్చిపోయారని, కానీ.. ఒకసారి చెత్త ప్రదర్శన చేస్తే దానిని గుర్తుపెట్టుకుని త‌న‌పై దండెత్తుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది చాలా ‘టూ మచ్’ అని పేర్కొన్నాడు. కారణం లేకుండానే తనను నిందిస్తున్నారని పేర్కొన్నాడు. అయినప్పటికీ తాను నవ్వుతూనే ఉంటానని, విమర్శలను పట్టించుకోబోనని రషీద్ ఖాన్ తేల్చి చెప్పాడు.