Friday, July 19, 2019
Follow Us on :

అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు..!

By BhaaratToday | Published On May 15th, 2019

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ టీవీ9 యాజమాన్యం ఆయన్ను విధుల నుండి తొలగించిన సంగతి తెలిసిందే. రవిప్రకాశ్‌ తెలంగాణ హైకోర్టులో పెట్టుకున్న ముందస్తు బెయిల్ దరఖాస్తును కూడా న్యాయమూర్తి తిరస్కరించారు. బుధవారం నాడు రవి ప్రకాష్ తరఫున హైకోర్టుకు హాజరైన న్యాయవాది ముందస్తు బెయిల్ ను ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తన క్లయింట్ పోలీసుల విచారణకు సహకరిస్తారని, ఆయన సంఘంలో పేరున్న వ్యక్తని, బెయిల్ ఇవ్వాలని కోరగా, ధర్మాసనం తిరస్కరించింది. వెంటనే పోలీసుల ఎదుట హాజరు కావాలని సూచించింది. సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు పంపినా, గడువులోగా రవి ప్రకాష్ స్పందించక పోవడంతో అరెస్ట్ తప్పేలా కనపడడం లేదు. 

ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిన రవిప్రకాశ్ తెలంగాణ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. ఆయన ఓ వెబ్ సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో, విద్యార్థుల ఆత్మహత్యలను ప్రశ్నిస్తూ టీవీ 9లో ఓ కథనాన్ని ప్రసారం చేశానని.. ఆ కథనం తెలంగాణ ప్రభుత్వానికి నచ్చకపోవడంతో అప్పటి నుంచి తనను టార్గెట్ చేశారని చెప్పారు. తనను టార్గెట్ చేయడం వెనుక ఒక స్పష్టమైన రాజకీయ, వ్యాపార అజెండా ఉందని రవిప్రకాశ్ తెలిపారు. వాస్తవానికి ఆ లైవ్ షోను ప్రసారం చేసే సమయంలో కూడా తాను ప్రభుత్వం గురించి ప్రస్తావించలేదని, కేవలం వ్యవస్థ వైఫల్యం గురించే ప్రశ్నించానని చెప్పారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే తామంతా ప్రశ్నించకుండా చూసీచూడనట్టు వ్యవహరించాలా? అని రవిప్రకాశ్ ప్రశ్నించారు.

మొదట ఆయనపై అవినీతి గురించి వార్తలు రాగానే.. ఆ రోజు సాయంత్రమే టీవీ 9లో అనూహ్యంగా ప్రత్యక్ష్యమయ్యారు. ఆరోజు రవి ప్రకాష్ మాట్లాడుతూ తప్పుడు కేసులు నిలబడవు, అవాస్తవాలు నిలబడవు, సత్యం మాత్రమే నిలబడుతుంది అని ఆవేశంగా చెప్పుకొచ్చారు. తాను పారిపోయినట్లు వచ్చిన వార్తలు కూడా వాస్తవాలు కావని అన్నారు. రవి ప్రకాష్ ను ఎవరూ అరెస్ట్ చేయలేదు.. అరెస్ట్ చేయబోవడం లేదు అని చెప్పారు.. కొందరు తప్పుడు కేసులు పెట్టాలని భావించారు.. అవి నిలబడవు అని ఆయన అన్నారు.