Tuesday, October 15, 2019
Follow Us on :

శాస్త్రవేత్త శ్రీధరన్ సురేష్‌ డెత్ మిస్టరీ.. ఎన్నో ట్విస్టులు

By BhaaratToday | Published On Oct 7th, 2019

ఆయనో శాస్త్రవేత్త. వృత్తిరిత్యా కుటుంబానికి దూరంగా హైదరాబాద్ ఒంటరిగా ఉంటున్నారు. అయితే స్థానిక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త అనైతిక సంబంధానికి దారి తీసింది. అంతే..! ఆ వ్యక్తి శాస్త్రవేత్తను వేధించడం మొదలుపెట్టాడు. డబ్బుల కోసం పదే పదే విసిగించే వాడు. అయినా సురేష్ పట్టించుకోకపోవడంతో నిందితుడు మెదల్లో ఓ దృష్ట ఆలోచన వచ్చింది. సైంటిస్టును చంపేయాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం సురేష్ ఫ్లాట్ లోనే ఆయన్ని హత్య చేసి బయట నుంచి తాళం వేసి వెళ్లిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అసలు నిందితున్ని కటకటాల వెనక్కి పంపించారు. 

శాస్త్రవేత్త శ్రీధరన్ సురేష్‌ దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. సురేష్‌తో అనైతిక సంబంధం ఏర్పరచుకున్న శ్రీనివాస్‌ డబ్బు కోసమే అతడిని హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.  సురేష్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు స్పందించకపోవడంతో భార్య ఇందిరా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీపీ తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న ఎస్సార్‌ నగర్ పోలీసులు విచారణ చేపట్టారని పేర్కొన్నారు. 

హత్య జరిగిందని నిర్ధారించుకున్న పోలీసులు.. తరచుగా శ్రీనివాస్ అనే వ్యక్తి సురేష్ ఇంటికి వస్తున్నట్లు గుర్తించినట్లు సీపీ తెలిపారు. లాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. సురేష్ తరచూ బ్లడ్‌టెస్టు కోసం విజయ డయాగ్నస్టిక్స్‌కు వెళ్లేవాడని... అక్కడే లాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌తో అతడికి పరిచయం ఏర్పడిందని వెల్లడించారు. భార్యకు దూరంగా... ఒంటరిగా ఉంటున్న సురేష్‌తో శ్రీనివాస్ అనైతిక సంబంధం ఏర్పచుకున్నాడని తెలిపారు.  

ఈ క్రమంలో రెండు నెలల నుంచి డబ్బులు కావాలని శ్రీనివాస్ సురేష్‌ను అడుగుతూ వచ్చాడు. సురేష్ ఇందుకు స్పందించకపోవడంతో అతడిని హత్య చేయాలని శ్రీనివాస్ ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా సురేష్ గదికి వెళ్లి తనతో పాటు తెచ్చుకున్న కత్తితో సురేష్‌ను హత్య చేశాడని సీపీ వెల్లడించారు. ఈ క్రమంలో శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని అతడి నుంచి ఒక కత్తి, రెండు ఉంగరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఈ నెల ఒకటో తేదీన అమీర్‌పేటలోని డీకే రోడ్డులో ఎస్ సురేశ్ కుమార్ అనే శాస్త్రవేత్తను శ్రీనివాస్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆయన బాలానగర్‌లోని ప్రతిష్టాత్మక సంస్థ ఎన్‌ఆర్‌ఎస్‌సీ లో శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు. సురేశ్ కుమార్ నివాసం ఉంటున్న అన్నపూర్ణ అపార్ట్‌మెంట్‌లోని ఆయన ఫ్లాట్‌లో హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. క్లూస్ టీమ్ తో పాటు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. పలు ఆధారాలు సేకరించి.. విచారణ జరిపారు 

తమిళనాడుకు చెందిన సురేశ్‌ కుమార్‌.. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌ఆర్‌ఎన్‌సీలో శాస్త్రవేత్తగా పనిచేస్తూ గత ఇరవై ఏళ్లుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేశ్ కుమార్ భార్య ఇందిర ఇండియన్ బ్యాంక్‌లో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు. గతంలో అమీర్‌పేట శాఖలో మేనేజర్‌గా పనిచేసిన ఆమె 2005లో చెన్నైకి బదిలీ కావడంతో అక్కడే ఉంటున్నారు. 14 ఏళ్ల నుంచి సురేశ్ కుమార్ ఒక్కరే అమీర్‌పేటలో నివాసం ఉంటున్నారు. సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన సురేశ్‌ కుమార్‌ తన గదిలోకి వెళ్లి తిరిగి బయటకు రాలేదు.  

గత మంగళవారం ఉదయం పనిమనిషి లక్ష్మి వచ్చి చూడగా తాళం వేసి ఉండటంతో వెళ్లిపోయింది. ఆఫీస్‌కు రాకపోవడంతో తోటి ఉద్యోగులు ఆయనకు ఫోన్‌ చేశారు. ఎంతకూ ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోగా.. కాసేపటి తర్వాత స్విచ్ఛాఫ్ రావడంతో చెన్నైలోని ఆయన భార్యకు సమాచారం అందించారు. చెన్నై నుంచి హుటాహుటిన ఇందిర, కొంత మంది బంధువులు హైదరాబాద్ చేరుకున్నారు. ఇంటికి బయటి నుంచి తాళం వేసి ఉన్నా.. లోపల ఫ్యాన్ తిరుగుతున్న శబ్ధం వస్తుండంతో పోలీసుల సమక్షంలో సురేశ్‌ కుమార్‌ గది తాళాన్ని తెరిచి లోపలికి వెళ్లారు. ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న సురేశ్ కుమార్‌ను చూసి బోరుమన్నారు. బలమైన ఆయుధంతో తలపై మోదడంతో సురేశ్‌ కుమార్‌ మృతి చెందినట్టు పోలీసులు గుర్తించారు.  

పశ్చిమ మండలం ఇంఛార్జి డీసీపీ సుమతి, ఏసీపీ తిరుపతన్న సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోలీసు జాగిలం అపార్ట్‌మెంట్‌పై వరకు వెళ్లి తిరిగి వచ్చింది. ఈమేరకు ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సురేష్‌ తలపై బలమైన గాయమున్నట్లు గుర్తించారు. వ్యక్తిగత కారణాలతోనే హత్య జరిగి ఉండొచ్చని అప్పుడే పోలీసులు ప్రాథమికంగా భావించారు. సురేష్ ను హత్య చేసిన తర్వాత ఇంటి బయట తాళం వేసి పారిపోయి ఉంటారని అనుకున్నారు.

అయితే సురేష్‌ హత్యపై స్థానికులను పోలీసులు విచారించారు. గత రెండు నెలలుగా కొందరు వ్యక్తులు ఆయన ఇంటికి వస్తున్నట్లు తాము గుర్తించామని పోలీసులు తెలిపారు. వారితో ఘర్షణ పడటంతోనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అప్పుడే అంచనాకు వచ్చారు. సురేష్‌ వద్దకు శ్రీనివాస్‌ అనే వ్యక్తి వచ్చి వెళ్తున్నట్లు స్థానికులు తెలియజేయడంతో అసలు కథ బయటపడింది. దీంతో శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమ స్టైల్ విచారించే సరికి నిందితుడు నిజాన్ని ఒప్పుకున్నాడు.