Tuesday, November 19, 2019
Follow Us on :

వారి కారణంగానే ఊర్మిళ రాజీనామా చేశారు..!

By BhaaratToday | Published On Sep 11th, 2019

బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్  మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో ఆమెకు సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతో రాజీనామా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఆమె ముంబై నార్త్ నుండి పోటీ చేశారు.. కానీ గెలవలేకపోయారు. లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం పుచ్చుకున్న ఆమె కేవలం ఆరంటే.. ఆరు నెలలు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉండగలిగారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడానికి తన మనసు అంగీకరించడంలేదంటూ ఆమె రాజీనామా చేశారు. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టడానికి కారణాలపై  ముంబై కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ మిలింద్‌ దేవరా స్పందించారు. 

ఊర్మిళ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడానికి నార్త్‌ ముంబై లీడర్లే కారణమని ఆయన అన్నారు. ఊర్మిళను పార్టీలోకి తీసుకొచ్చిన నాయకులే ఆమెను రాజకీయంగా తొక్కేశారని, ఆ సమయంలోనూ ఆమెకు తాను మద్దతుగా నిలబడ్డానని చెప్పారు. ఆమె రాజీనామాకు ఉత్తర ముంబై కాంగ్రెస్‌ నాయకులే కారణమని.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఊర్మిళకు తాను మనస్ఫూర్తిగా సహకరించానని అన్నారు. అయితే ఊర్మిళ తన రాజీనామా నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కాంగ్రెస్‌ నేత సంజయ్‌ నిరుపమ్‌ కోరారు.