Tuesday, October 15, 2019
Follow Us on :

రవిప్రకాష్ ను కలవనున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి

By BhaaratToday | Published On Oct 7th, 2019

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో నిధులను అక్రమంగా దారి మళ్లించారంటూ అలంద సంస్థ కేసు పెట్టడంతో పోలీసులు అరెస్ట్ చేసి, రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీని విధించారు. ఆయన్ను పరామర్శించడానికి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హైదరాబాదులోని చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. జైల్లో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను పరామర్శించి, సంఘీభావం తెలపనున్నారు. 

టీవీ9.. తెలుగు నాట ఈ న్యూస్ ఛానల్ ఎంత సంచలనమో ఇప్పుడు ఆ ఛానల్ మాజీ సీఈవో రవి ప్రకాశ్ వ్యవహారమూ అంతే సంచలనంగా మారింది. టీవీ9 విక్రయం, దానిపై పట్టు కోసం ఆధిపత్య పోరు, వాటాల విక్రయం వంటి అనేక వ్యవహారాలలో భాగంగా ఫోర్జరీ ఆరోపణలను మెరుగైన సమాజం కోసమే ఇంతకాలం పని చేసిన రవిప్రకాశ్ ఎదుర్కొంటున్నాడు. అయితే ఈ వివాదంలో అలంద మీడియా పెట్టిన కేసుల్లో రవి ప్రకాశ్ విచారణకు సహకరించడం లేదని గతంలోనే పోలీసులు స్పష్టం చేశారు. తాజాగా టీవీ9 నిధులు దుర్వినియోగం చేశారంటూ రవి ప్రకాశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సాధారణ జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి, కొంత మంది ప్రమోటర్లతో టీవీ9 అనే సంస్థలో పని చేస్తూ తెలుగు మీడియా రంగంలో సంచలనం సృష్టించాడు రవిప్రకాశ్. అనతికాలంలోనే దక్షణాది భాషలన్నిటికీ విస్తరించిన నెంబర్ 1 న్యూస్ ఛానల్ కు సీఈవోగా ఎదిగాడు రవి ప్రకాశ్. అయితే టీవీ9 సంస్థ విక్రయం తర్వాత బోర్డు డైరెక్టర్లకు, రవిప్రకాశ్ కు మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో అధిక వాటాలు ఉన్న అలంద మీడియా.. టీవీ9ను స్వాధీనం చేసుకొని సీఈవో రవి ప్రకాశ్ ను ఉద్యోగం నుంచి తీసేసింది. అయితే టీవీ9ను స్వాధీనం చేసుకునే క్రమంలో అలంద మీడియా రవి ప్రకాశ్ పై పలు కేసులు పెట్టింది. సంస్ధ హక్కులు, నిధులు పక్కదారి పట్టాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఆ కేసులే రవి ప్రకాశ్ ను చిక్కుల్లో పడేశాయి.

తాజాగా టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారించారు. ఏబీసీఎల్ బ్యాంక్ అకౌంట్ల నుంచి అక్రమంగా రూ.18కోట్లకు పైగా నిధులను డ్రా చేశారంటూ రవిప్రకాశ్, టీవీ 9 మాజీ సీఎఫ్ వో మూర్తిపై టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మూర్తిని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే టీవీ9లో భారీగా నిధుల కుంభకోణం జరిగినట్టు నిర్ధారించారు.బోనస్ ల పేరుతో బోగస్ రికార్డులు క్రియేట్ చేసి డబ్బు స్వాహా చేసినట్టగా గుర్తించారు. రవిప్రకాశ్, మూర్తిలపై పోలీసులు సెక్షన్ 409, 418, 420, 509 కింద కేసులు నమోదు చేశారు.

ఇక టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ చెక్‌పవర్‌ను దుర్వినియోగం చేశారని అలంద మీడియా డైరెక్టర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బోనస్‌, ఎక్స్‌గ్రేషియాల పేరిట రవిప్రకాశ్‌, మూర్తిలు నిధులు డ్రా చేసినట్లు చెప్పారు. అయితే కొత్త యాజమాన్యం రికార్డుల తనిఖీలు చేయగా ఈ దోపిడి బయపడిందని చెబుతున్నారు. డైరెక్టర్లు, షేర్‌ హోల్డర్ల అనుమతి లేకుండా రవిప్రకాశ్ నిధులు డ్రా చేసినట్లు చెప్పారు. క్లిఫోర్డ్‌ పెరీరాకూ అక్రమంగా రూ.5.97 కోట్ల బోనస్‌ను రవిప్రకాశ్ జారీ చేశారని అలంద మీడియా ఆరోపిస్తోంది.  2017-18, 2018-19లో ఏబీసీఎల్‌కు వచ్చిన లాభాలకు సరిపడా నిధులను రవిప్రకాశ్, మూర్తిలు అక్రమంగా తీసుకున్నారని చెబుతున్నారు. 

మరోవైపు సెప్టెంబర్‌ 18, 2018 నుంచి మే 8, 2019 మధ్య మూడు సార్లు బోనస్‌ల పేరిట రవిప్రకాశ్ డబ్బులు డ్రా చేసినట్లు గుర్తించారు. అయితే 2018 ఆగస్టులో ఏబీసీఎల్‌లో 90.54 శాతం షేర్లను అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్‌ మెంట్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఏబీసీఎల్‌ యాజమాన్య హక్కులు పూర్తిగా అలంద మీడియావే. కానీ అలంద మీడియా అనుమతి లేకుండానే రవిప్రకాశ్, మూర్తిలు అక్రమంగా బోనస్‌ తీసుకున్నారు. ఆ నిధులను బోనస్‌గా ఇచ్చినట్లు రికార్డుల్లో రాయమంటూ రవిప్రకాశ్ ఆదేశాలు జారీ చేశారని ఫిర్యాదులో పేర్కొంది. 

నిజానికి టీవీ9 చానళ్లు అసోసియేట్ బ్రాడ్ క్యాస్టింగ్ లిమిటెడ్ అనే సంస్థ యాజమాన్యంలో నడుస్తున్నాయి. దీనిలో మెజారిటీ షేర్లు ఆ సంస్థ పేరు మీదనే ఉన్నాయి. పేరుకు రవిప్రకాశ్ సీఈవో అయినా అతని పేరు మీద 8 శాతం షేర్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన దానిలో 90.54 శాతం షేర్లను అసోసియేట్ బ్రాడ్ కాస్టింగ్ లిమిటెడ్ సంస్థ అలంద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థకు గతేడాది అమ్మేసారు. మెజారిటీ షేర్లు అలంద గ్రూపుకే చెందినవి కాబట్టి కొత్త డైరెక్టర్లను ప్రతిపాదించే అవకాశం అలందకు దక్కింది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం చాలా నెలల పాటు వేచి చూడవలసి వచ్చింది. దీంతో టీవీ9 బోర్డుకు కొత్త డైరెక్టర్లను నియమించడం ఆలస్యమైంది. కానీ ఉద్దేశపూర్వకంగానే రవిప్రకాశ్ కొత్త డైరెక్టర్ల నియామకానికి అడ్డుపడుతున్నాడని అలంద గ్రూప్ పలుసార్లు బోర్డు మీటింగులో హెచ్చరిస్తూ వచ్చింది.

ఈ ఏడాది మార్చ్ 9న కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపినా కూడా బోర్డు మీటింగ్ పెట్టకుండా ఆలస్యం చేస్తున్నాడనేది రవిప్రకాశ్ మీదున్న ప్రధాన ఆరోపణ. అయితే తనకు చెందిన వాటాను శివాజీ పేరు మీద బదలాయించాడని, బోర్డులోకి కొత్త డైరెక్టర్లను తీసుకోవడానికి అతని సంతకాలు ఫోర్జరీ చేసాడని అలంద గ్రూప్ అధినేత కౌశిక్ రావు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డ్రామా మొదలైంది. రవిప్రకాశ్ మీద కేసు బుక్ చేసిన పోలీసులు 406, 420, 467, 471, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రవిప్రకాశ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో కూడా అంతకుముందే రవిప్రకాశ్ మీద ఫిర్యాదు ఉంది.

ఆ తర్వాత మూడు రోజుల హైడ్రామా తర్వాత మే 8న బోర్డు మీటింగులో రవిప్రకాశ్, మూర్తిలను సీఈవో, డైరక్టర్ పదవుల నుంచి తొలగిస్తున్నట్టు తీర్మానం చేసారు. అంతే కాకుండా మహేంద్ర మిశ్రాను సీఈవోగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. బోర్డులో వాటాదారుడైన రవిప్రకాశ్ ను మాత్రం ఇక డైరెక్టర్ గా కాకుండా వాటాదారుడిగానే పరిగణిస్తామని తెలిపింది. ఇక తాజాగా ఇంత భారీగా నిధులను తీసుకోవడానికి రవిప్రకాశ్‌కు అధికారమెక్కడిది..? అంటూ అలంద మీడియా మరోసారి రవిప్రకాశ్ పై కేసులు పెట్టడంతో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మొత్తం మీద సంస్థను ముంచి రవిప్రకాశ్.. సొంత అకౌంట్లను నింపుకున్నారని అలంద మీడియా డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా మీడియా సంస్థల్లో పెద్దగా పరిచయం లేని పేరు అలంద మీడియా ఎంటర్టైన్మెంట్స్. అయితే టీవీ9 లో మెజారిటీ వాటా కొనుగోలు చేసి అందరి దృష్టిలో పడింది. ఇప్పటికే 10 టీవీలో చాలా శాతం వాటా కొన్న అలంద మీడియా, అతిపెద్ద సంస్థ అయిన టీవీ9 ను కూడా కొనుగోలు చేయడంతో రాష్ట్రంలో అతిపెద్ద మీడియా సంస్థగా అవతరించింది.