Thursday, April 25, 2019
Follow Us on :

మాన‌వ‌త్వం చాటుకున్న ఎంపీ బుట్టా రేణుక‌

By BhaaratToday | Published On Mar 21st, 2019

క‌ర్నూలు జిల్లా కొడుమూరు-ఎమ్మిగనూరు రహదారిపై బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గోనెగండ్ల మండలం లింగందిన్నె గ్రామానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయయ్యాయి. అయితే ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన ఇద్ద‌రిని ఎంపీ బుట్టా రేణుక త‌న వాహ‌నంలో ఆస్ప‌త్రికి త‌ర‌లించి మాన‌వ‌త్వం చాటుకున్నారు. గాయ‌ప‌డ్డ వారికి మెరుగైన చికిత్స అందించాల‌ని వైద్యుల‌ను ఆదేశించారు. వివ‌రాల్లోకి వెళితే...లింగందిన్నె గ్రామానికి చెందిన వరుసకు అన్నదమ్ములైన బోయ‌ లక్ష్మన్న, బోయ రాముడు, బోయ గోపాల్, రామాంజి, రమేష్ లు పుట్టపాశం గ్రామంలో బుధవారం జ‌రిగిన‌ దేవర ఉత్సవాల్లొ పాల్గొన్నారు. అనంతరం రెండు ద్విచక్ర వాహనాలపై గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో వేములగోడు దాటిన తర్వాత జేసీబీ టైరు పేలడంతో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలపై దూసుకొచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బోయ లక్ష్మన్న (30), రాముడు (42), బోయ గోపాల్ (33) అక్కడికక్కడే మృతి చెంద‌గా, రామాంజి, ర‌మేష్‌ల‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే సమయంలో ఆదోని నుంచి కర్నూలు వెళ్తున్న వైఎస్సార్ సీపీ కర్నూలు ఎంపీ బుట్టారేణుక..తీవ్ర గాయాల‌తో ర‌క్త‌స్రావంతో కొట్టుమిట్టాడుతున్న‌వారిని తన వాహనంలో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయ‌ప‌డిన వారిని స‌కాలంలో ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌డంతో బాధిత కుటుంబ స‌భ్యులు బుట్టా రేణుక‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.