Sunday, August 25, 2019
Follow Us on :

సంప్రదాయాల గురించి మీరు మాట్లాడ‌కండి.. విడ్డూరంగా ఉంది

By BhaaratToday | Published On Jul 16th, 2019

ఫైర్‌బ్రాండ్, వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ అధినేత‌ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడాతూ.. సభా సంప్రదాయాల గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే జనం నవ్వుతున్నార‌ని.. పార్టీ పెట్టి గెలిపించిన ఎన్టీఆర్‌కే సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కన్నీళ్లు పెట్టించిన చంద్రబాబు సంప్రదాయాలు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. గత సభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అంతు చూస్తామని నాడు చంద్రబాబు బెదిరించారని.. అది మ‌రిచి, నేడు అచ్చెంనాయుడు గింజుకుంటున్నార‌ని ఫైర్ అయ్యారు.

గతంలో ప్రతిపక్ష నాయకుడు జగన్‌ని కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు సభా సంప్రదాయాలు గుర్తుకురాలేదా అని టీడీపీ నేత‌ల‌పై మండిప‌డ్డారు. ఈ దేశంలో ఏ అసెంబ్లీలో లేనివిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్షానికి ఉన్న బలం కంటే ఎక్కువ అవకాశాలిస్తున్నారని.. అయినా కానీ.. మా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై చర్చను దారిమళ్లించేందుకే టీడీపీ ఎమ్మెల్యేలు ఇలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. అమ్మ ఒడి, రైతు భరోసా లాంటి పథకాలపై చర్చ జరగకుండా రాద్ధాంతం చేయాలనుకుంటున్నారని సీరియ‌స్ అయ్యారు.

సభలో బడ్జెట్‌పై మాట్లాడే దమ్మూ, ధైర్యం లేకే చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారని.. మళ్లీ వాళ్లే అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వడం విడ్డూరమ‌ని రోజా అన్నారు. ఎమ్మార్వో వనజాక్షిపై చింతమనేని దాడి చేసిన‌ప్పుడు.. నారాయణ కాలేజీల్లో ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న‌ప్పుడు, కాల్‌మని సెక్స్ రాకెట్‌లో ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవుతున్న‌ప్పుడు టీడీపీ నేతలకు సంబంధముందని కేసులనే లేకుండా చేసింది మీరు కాదా? అటువంటి మీరు..  శాంతి భద్రతల గురించి మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు అని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.