Saturday, August 24, 2019
Follow Us on :

అత‌డు లేకున్నా.. భారత్ బలమైన జట్టే

By BhaaratToday | Published On Jun 12th, 2019

ఐసీసీ ప్రపంచకప్ 2019లో భాగంగా నాట్టింగ్‌హామ్ వేదిక‌గా భారత్, న్యూజిలాండ్ మధ్య గురువారం క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించిన ఓపెనర్ శిఖర్ ధవన్.. ఆ మ్యాచ్‌లో గాయపడ్డాడు. బంతి అతని బొటన వేలికి తాకడంతో ఫ్రాక్చర్ అయింది. దీంతో అతను మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. 

అయితే ధవన్ లేకపోయినా.. భారత్ బలమైన జట్టే అని కివీస్ ఆటగాడు రాస్ టేలర్ అభిప్రాయపడ్డాడు. నేడు మీడియా సమావేశంలో టేలర్ మాట్లాడుతూ.. ‘‘ధవన్ లేకపోవడం భారత్‌కు లోటే. ఐసీసీ టోర్నమెంట్‌లలో అతనికి మంచి రికార్డు ఉంది. రోహిత్ శర్మ, అతని భాగస్వామ్యం అద్భుతంగా ఉంటుంది. రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్‌ల జోడీ ఎప్పుడూ బాగుంటుంది. ఇద్దరు రైట్ హ్యాండ్ లేదా ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ల మధ్య జోడీ అంత బలంగా ఉండదు. కానీ ఇండియా బ్యాటింగ్ లైన్ ఆప్ చాలా బలంగా ఉంది. ధవన్ లేకపోయినా.. భారత్ బలమైన జట్టే’’ అని టేలర్ పేర్కొన్నాడు. 

ఇప్పటికే లీగ్ దశలో న్యూజిలాండ్ ఆడిన మూడు మ్యాచుల్లో విజ‌యం సాధించ‌గా, భారత్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి మంచి జోరు మీద ఉన్నాయి. దీంతో గురువారం జరిగే మ్యాచ్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది.