Thursday, July 18, 2019
Follow Us on :

బెంగాల్ లో జరుగుతున్న హింసపై స్పందించిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్

By BhaaratToday | Published On Jun 17th, 2019

పశ్చిమబెంగాల్ లో ఇటీవలి కాలంలో హింస భారీగా పెరిగిపోయింది. కొందరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడం.. కొందరు మృతి చెందడం.. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే డాక్టర్ల మీద దాడి చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. పరిస్థితి చేయి దాటిపోతే రాష్ట్రపతి పాలన విధిస్తామని ఆ రాష్ట్ర గవర్నర్ కూడా చెప్పారు.   


ఈ హింసాత్మక ఘటనలపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. పశ్చిమ బెంగాల్ లో హింసకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఉన్న అధికార కాంక్షే కారణమని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మరోసారి అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో హింసను మమత ప్రోత్సహిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజలను రక్షించడం కోసం, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం కోసం మమత చర్యలు తీసుకోవాలని కోరారు. బెంగాల్ లో గతంలో ఎన్నడూ ఇలాంటి హింస చోటుచేసుకోలేదని అన్నారు. హింసలో ప్రాణాలు కోల్పోయినవారంతా ఒకే పార్టీకి చెందినవారని.. ఇకనైనా ఈ ఘటనలు ఆగాలని ఆయన కోరారు. 

ఇక పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెను విరమించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో వైద్యుల ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో తాము సమ్మె విరమిస్తున్నట్టు వైద్యులు ప్రకటించారు.  దాదాపు గంట పాటూ మమతా బెనర్జీతో చర్చలు జరిపారు.. ఆమె వారి డిమాండ్లకు అంగీకరించడంతో సమ్మెను విరమించారు.