Monday, November 18, 2019
Follow Us on :

సరోజ స్క్రీన్ ప్లే.. భర్తను చంపిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలంటూ శోకాలు

By BhaaratToday | Published On Oct 17th, 2019

వారం రోజుల క్రితం భర్త దారుణ హత్యకు గురయ్యాడు. అందరి ముందు శోకాలు పెట్టి సానుభూతి పొందింది భార్య. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేశారు. ఎక్కడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. హత్యకు కారణాలు తెలియరాలేదు. నిందితుల వివరాలు అంతుచిక్కలేదు. పోలీసులు తలలు పట్టుకుంటున్న టైమ్ లో దిమ్మతిరిగే విషయం తెలిసింది. అంతే..! భార్య సరోజను తమ స్టైల్ విచారించిన పోలీసులు అసలు విషయాన్ని కక్కించారు. అసలు ప్రసాద్ బాబు అనే వ్యక్తిని ఎందుకు చంపారు..!? ఎవరు చంపారు..!? 


పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకుని భార్యలకు నరకం చూపించే మృగాళ్లను ఇన్నాళ్లూ చూశాం. కానీ ప్రియుడి మోజులో పడి మొగుడి ప్రాణాలు తీస్తున్న భార్యలు ఈ మధ్య కాలంలో పెరిగారు. దీంతో మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారుతోంది. దంపతుల్లో ఎవరో ఒకరు వేస్తున్న తప్పటడుగులు.. పచ్చని సంసారాల్లో చిచ్చురేపుతోంది. వివాహేతర సంబంధాలు ఎన్నో కాపురాలను కూల్చేస్తున్నాయి. క్షణిక సుఖాల కోసం భర్తలను చంపేస్తున్న భార్యలు వెలుగులోకి వస్తున్నారు. తమ సంబంధాలకు అడ్డొస్తున్న భర్తలను పథకం రచించి మరీ చంపేస్తున్నారు. సంసారంలో సమస్యలు.. ఇష్టం లేని పెళ్లి. పెళ్లయినా ప్రియుడిపై తగ్గని మోజు. కారణాలు ఏవైతేనేం..! కొంతమంది భార్యలు కర్కశంగా మారుతున్నారు. 

గత వారం హైదరాబాద్ లోని వనస్థలిపురంలోని ఇంజాపూర్ లో పట్లవత్ ప్రసాద్ బాబు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తలించారు. అనంతరం మృతుల కుటుంబాలకు అప్పగించారు. అయితే ప్రసాద్ బాబును ఎవరు హత్య చేశారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఆయన కుటుంబ సభ్యులతో స్నేహితులు, తెలిసినవాళ్లను సైతం విచారించారు. కేసులో పురోగతి ఏమీ కనిపించలేదు.

విచారణలో భాగంగా మృతుడి భార్య సరోజను కూడా పోలీసులు విచారించారు. అయితే ఆమె విచారణలోనూ తన భర్తను చంపిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలంటూ శోకాలు పెట్టింది. ఆ ఏడుపు నిజమేనని నమ్మిన పోలీసులు.. కేసును లోతుగా దర్యాప్తు చేశారు. మృతుడు చనిపోవడానికి ముందు రోజుల్లో అతని ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయోనని స్థానికులను కూడా విచారించారు. అయితే ఆ విచారణలో పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.

ఈ మధ్య కాలంలో భార్య, భర్తలు తరుచూ గొడవలు పడేవారని స్థానికులు పోలీసులకు వివరించారు. దీనిపై మృతుడి భార్య సరోజను మరోసారి తమదైన స్టైల్లో విచారించడంతో నిజం మొత్తం కక్కేసింది. తన ప్రియుడితో ఏర్పడిన వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడనే హత్య చేయించినట్లు భార్య సరోజ ఒప్పుకుంది. ఈ హత్యలో భార్య సరోజతో పాటు ప్రియుడు నర్సింహ, వీరికి సహకరించిన మరో వ్యక్తి రామకృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు. 

 భర్తలను చంపిన భార్యల ఉదంతాలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. అక్రమ సంబంధాల విషయంలో మహిళను నిందితురాలిగా చేయవచ్చునా అనే విషయంపై సుప్రీంకోర్టు పరిశీలించడానికి సిద్ధపడడం యాధృచ్ఛికమే కావచ్చు. కానీ ప్రియుల మోజులో పడి భర్తలను భార్యలు మట్టుబెడుతున్న వైనం ఆందోళనకరంగానే ఉంది. ఆవేశంలోనో, ఉద్రేకంలో జరుగుతున్న హత్యలు కూడా కావు. ప్రియులను, వారి స్నేహితులను సాయంగా తీసుకుని పక్కా పథకం ప్రకారం హత్య చేస్తున్నారు నేటి భార్యలు.