Saturday, October 19, 2019
Follow Us on :

42 ఏళ్లు ఆయనే సర్పంచ్..!

By BhaaratToday | Published On Jan 29th, 2019

ఒక ప్రజాప్రతినిధిని ఐదేళ్ల పాటు భరించాలంటేనే ప్రజలు విసిగిపోతారు. అభివృద్ధి సరిగా చేయడం లేదని, ప్రజలను పట్టించుకోవడం లేదని లేదా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని.. ఇలా రకరకాలుగా చర్చించుకుంటూ ప్రజాప్రతినిధులను ప్రజలు కొత్తవారిని ఎన్నుకుంరు. కానీ.. ఎలాంటి ఆటంకం లేకుండా ఏకంగా 42 ఏళ్లుగా ఆ గ్రామం అతన్ని సర్పంచ్ గా ఎన్నుకుంటూ వచ్చింది. ఏంటి ఆశ్చర్యపోతున్నారా.? ఇది నిజం. నిరాటంకంగా 42 ఏళ్లుగా సర్పంచుగా ఎన్నికైన ఆ నిరాడంబర వ్యక్తి ఎవరో తెలుసుకోవాల్సిందే.

ఇదిగో ఈయన పేరు వీరస్వామి. 42 ఏళ్లుగా సర్పంచ్ గా కొనసాగారు. ప్రజాసేవే లక్ష్యంగా తన జీవనాన్ని కొనసాగించారు. సుధీర్ఘ కాలంగా సర్పంచ్  గా కొనసాగుతున్నప్పటికీ నిరాడంబరంగా.. అందరితో కలివిడిగా ఉంటారు వీరస్వామి. విద్యార్ధి దశ నుంచి సామాజిక స్పృహ కలిగి ఉన్న వీరస్వామి.. గ్రామాభివృద్ధికి అంకితమవ్వాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు. సుదీర్ఘ కాలం నుంచి సర్పంచ్ గా కొనసాగడం చాలా అరుదు. అలాంటిది 1964 నుంచి 2001 వరకు వరుసగా ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నికవుతూ రికార్డు క్రియేట్ చేశారు వీరస్వామి. 
వీరస్వామి మహబూబ్ నగర్ జిల్లా భూత్పూరు మండలం అమిస్తాపూర్ గ్రామవాసి. ఆయన తండ్రి ప్రజల కోసం ప్రాణాలనే అర్పించిన వ్యక్తి. రజాకార్ల అరాచకాలను ఎదిరించి, వారి తూటాలకు బలయ్యారు. నాటి నుంచి కుటుంబ భారంతో పాటు, గ్రామ ప్రజల బాధ్యతను వీరస్వామి తన భుజాన వేసుకున్నారు.

11 ఏళ్లపాటు కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చిన వీరస్వామికి.. గ్రామ పంచాయతీగా ఏర్పడిన అమిస్తాపూర్ గ్రామానికి మొదటి సర్పంచుగా ఎంపికయ్యే అవకాశం లభించింది. గ్రామస్తుల సమస్యలను పరిష్కరించడంలో, ఆర్యసమాజ భావాలను ముందుకు తీసుకెళ్లడంలోనూ ప్రధానపాత్ర పోషించారు వీరస్వామి. 1959లో గ్రామస్తులు సమావేశమై గ్రామ సర్పంచుగా తొలిసారిగా వీరస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరో 9 మందిని వార్డు సభ్యులను సైతం ఏకగ్రీవం చేసుకున్నారు. అనంతరం 1964, 1969, 1974, 1979లలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వీరస్వామి సర్పంచుగాను, మరో 9 మంది వార్డు సభ్యులు సైతం ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు.

మొట్టమొదటి సారిగా 1984లో అమిస్తాపూర్ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఎంపికకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా వీరస్వామి, అతను బలపర్చిన వార్డు సభ్యులందరూ ఘన విజయం సాధించారు. వయస్సు మీదపడుతుండటంతో వీరస్వామి.. 2001 నుంచి ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు.


ప్రజాసేవే లక్ష్యంగా.. ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన వారికి.. ప్రజల నుంచి అదే స్థాయిలో ఆదరణ లభించింది. కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ప్రస్తుత కాలంలో పలువురు ప్రజాప్రతినిధులు.. రాజకీయాలను వ్యాపారంగా మార్చుతూ ప్రజా సమస్యలను, గ్రామాభివృద్ధిని విస్మరిస్తున్నారు. సమాజం అభివృద్ధి చెందాలంటే మళ్లీ పాతకాలం రావాలి. పాత కాలం నాయకుల్లా రాజకీయ నాయకులు మారాలి. అప్పుడే పల్లెలు, పట్టణాలు అభివృద్ది చెంది.. దేశం అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుస్తుంది.