Saturday, October 19, 2019
Follow Us on :

సీనియ‌ర్ పాత్రికేయుడు వామ‌న్‌రావు క‌న్నుమూత‌

By BhaaratToday | Published On Feb 16th, 2019

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ పాత్రికేయుడు పెండ్యాల వామన్‌రావు (90) శుక్రవారం కేర్ దవాఖానలో కన్నుమూశారు. 1928, జూన్ 12న‌ కరీంనగర్‌లో జన్మించిన వామన్‌రావు.. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూలో బ్యూరోచీఫ్‌గా పనిచేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్‌గా, న్యూస్వతంత్ర టైమ్స్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ పాత్రికేయుడు ఖాసా సుబ్బారావుకు వామన్‌రావు అల్లుడు. ఇండియన్ బిజినెస్ టైకూన్ బీఎం బిర్లాకు సంబంధించిన గ్రూప్ సంస్థలకు డైరెక్టర్‌గా, భారతీయ విద్యాభవన్స్ సంస్థల ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కూడా పనిచేశారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు పంజాగుట్టలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వామన్‌రావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వివిధ మీడియా సంస్థల్లో, సుదీర్ఘకాలం జర్నలిస్టుగా ఆయన అందించిన సేవలను సీఎం గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.