Tuesday, October 15, 2019
Follow Us on :

విరాట్ కోహ్లీని కొనియాడిన అఫ్రీది..!

By BhaaratToday | Published On Sep 19th, 2019

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొహాలీలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కెప్టెన్ క్వింటన్ డికాక్ 52, తెంబా బవుమా 49 పరుగులు చేశారు.  150 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ శిఖర్ ధవన్ 40, కెప్టెన్ విరాట్ కోహ్లీ 72 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. 72 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో కోహ్లి అజేయంగా హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఫలితంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. ఈ క‍్రమంలోనే రోహిత్‌ శర్మ(21 హాఫ్‌ సెంచరీలు)ను కోహ్లి అధిగమించాడు. 

విరాట్‌ కోహ్లిపై పాకిస్తాన్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది ప్రశంసలు కురిపించాడు. అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లి అత్యధిక హాఫ్‌  సెంచరీలు విషయాన్ని ఐసీసీ ట్వీట్‌ చేయగా, అందుకు అఫ్రిది రీట్వీట్‌ చేస్తూ కోహ్లిని ప్రశంసించాడు. ‘ కోహ్లి నువ్వొక అసాధారణ ఆటగాడివి. నీ సక్సెస్‌ ఇలానే కొనసాగాలి. ప్రపంచంలోని క్రికెట్‌ అభిమానుల్ని నీ ఆట తీరుతో మరింత అలరించు’ అని అఫ్రిది అన్నాడు.

ఇక టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు. 2,434 పరుగులతో రోహిత్ ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉండగా,  72 పరుగులు చేసిన కోహ్లీ 2,441 పరుగులతో ఆ రికార్డును బద్దలుగొట్టి రోహిత్‌ను కిందికి నెట్టేశాడు. రోహిత్ 97 మ్యాచుల్లో ఈ ఘనత సాధించగా, కోహ్లీ 71 మ్యాచుల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం. కోహ్లీ, రోహిత్ తర్వాతి స్థానంలో మార్టిన్ గప్టిల్ (2,283), షోయబ్ మాలిక్ (2,263), బ్రెండన్ మెకల్లమ్ (2,140)లు టాప్-5లో ఉన్నారు.