Monday, November 18, 2019
Follow Us on :

షర్మిల ఫిర్యాదు.. అయిదుగురి అరెస్ట్.. వారెవరంటే..?

By BhaaratToday | Published On Jan 19th, 2019

వైఎస్ జగన్ సోదరి షర్మిల తన మీద తప్పుడు కథనాలు రాస్తున్న వారిపై కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. మొత్తం 15 మందిని గుర్తించిన పోలీసులు.. 5 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన 5 మంది ఎవరో తెలుసా..? కొన్ని యూట్యూబ్ చానళ్లు నిర్వహిస్తున్న వాళ్ళు..! వీరంతా క్లిక్కుల కోసం లేని పోని అబద్దాలను పబ్లిష్ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యక్తులు చాలా మందే ఉన్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గతంలోనే తెలిపారు.   

 

సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించి.. నిందితులుగా పరిగణించి నోటీసులు జారీ చేశారు. వీరంతా హైదరాబాదుకు చెందిన వారు. షర్మిలపై అసభ్యకర రాతలు రాసిన వారిలో శుక్రవారం నాటికి పోలీసులు మొత్తం 15 మందిని గుర్తించారు.

 

పోలీసులు అదుపులోకి తీసుకున్న ఐదుగురూ సొంత యూట్యూబ్ చానళ్లు నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే మొత్తం 60 వీడియో లింకుల్ని గుర్తించిన పోలీసులు అవి ఏయే యూట్యూబ్ ఛానల్స్‌కు సంబంధించినవో గుర్తించే పనిలో ఉన్నారు. వీడియో పోస్టు చేసిన వారితో పాటు దానికి కామెంట్ చేసినవారు కూడా నిందితులే అవుతారని పోలీసులు తెలిపారు. యూట్యూబ్‌ ఛానల్‌లో వారు క్రియేట్ చేసుకున్న పేరు తప్ప ఇతర వివరాలేవీ ఉండవు. కాబట్టి ఆ వివరాలు కావాల్సిందిగా సైబర్ క్రైం పోలీసులు యూట్యూబ్‌కు లేఖ రాశారు. వారి లాగిన్, ఐపీ వివరాలు ఇవ్వాల్సిందిగా కోరారు. త్వరలో మరికొందరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది.