Saturday, October 19, 2019
Follow Us on :

సిద్ధార్థ మరణంపై పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే

By BhaaratToday | Published On Aug 3rd, 2019

కొద్ది రోజుల క్రితం ‘కేఫ్ కాఫీ డే’ అధినేత వీజే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే..! ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయనే స్వయంగా నదిలో దూకారా? లేక, ఎవరైనా బలవంతంగా ఆయనను నదిలో తోశారా? అన్న విషయం తెలియాల్సి ఉంది. అయితే పోస్టుమార్టం రిపోర్టులో సిద్ధార్థ మరణించడానికి ముఖ్య కారణం మాత్రం నీటిలో మునగడం వల్లే అని తేలింది. 


పోస్టుమార్టం ప్రాథమిక అంచనాలో ఆయన నీటిలో మునగడం వల్లే మరణించినట్టు వెల్లడైంది. ఈ విషయాన్ని వెన్‌లాక్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ రాజేశ్వరి తెలిపారు. అదృశ్యమైన రోజునే సిద్ధార్థ నదిలో పడి మరణించినట్టు ఇప్పటి వరకు చేసిన పరీక్షల ద్వారా తెలిసింది. సిద్ధార్థ ఊపిరి తిత్తుల్లోకి నీరు బాగా చేరిందని రాజేశ్వరి తెలిపారు. గంటల తరబడి నీటిలో నానిన తర్వాత ఊపిరి తిత్తులు ఎలా ఉబ్బిపోతాయో.. అలానే ఉన్నాయని అన్నారు. దీనిని బట్టి ఆయన నీటిలో మునగడం వల్లే చనిపోయినట్టు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్టు తెలిపారు. అయితే తుది నివేదిక వివరాలు త్వరలో వెల్లడి కావాల్సి ఉంది. 

సోమవారం సాయంత్రం మంగళూరులోని ఉల్లాల్‌లో బ్రిడ్జిపై నుంచి ఆయన దూకేసినట్టు వార్తలు వచ్చాయి. నేత్రావతి నదిపై కిలోమీటరు పొడవున్న ఈ బ్రిడ్జిపై నుంచి రాత్రి 9 గంటల సమయంలో ఓ వ్యక్తి దూకినట్టు వార్తలు రావడంతో పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో బెంగళూరు నుంచి ఉల్లాల్‌కు చేరుకున్న సిద్ధార్థ బ్రిడ్జి వద్దకు వెళ్లాల్సిందిగా డ్రైవర్‌ను కోరారు. కారు బ్రిడ్జి చివరికి చేరుకున్నాక కారును ఆపమని చెప్పి దిగారు. బ్రిడ్జిపై కొంతదూరం నడిచి ఆ తర్వాత అదృశ్యమయ్యారని డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. 90 నిమిషాలు వేచి చూసినా అతను తిరిగి రాకపోవడంతో డ్రైవర్ పోలీసులను ఆశ్రయించాడు. తీరా మంగళవారం ఉదయం ఆయన మృతదేహం లభించింది.