Tuesday, October 15, 2019
Follow Us on :

పాక్ ను చిత్తుగా ఓడించాలి

By BhaaratToday | Published On Feb 21st, 2019

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే..! పాకిస్థాన్ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ ను భారతీయులు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్ తీరుపై.. అతడు చేయాల్సిన పనుల గురించి లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. భారత్-పాక్ దేశాల మధ్య సమస్యలు పరిష్కారమయ్యే దిశగా ఇమ్రాన్ ఒక స్నేహపూర్వక అడుగు వేయడానికి ఇదే మంచి అవకాశం అని సునీల్ గవాస్కర్ అన్నారు. పుల్వామా ఉగ్రదాడికి బాధ్యుడైన జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను ఐక్యరాజ్యసమితికి కానీ, భారత్ కు కానీ ఇమ్రాన్ అప్పగించాలని.. అప్పుడే ఇమ్రాన్ ఖాన్ ను నమ్ముతారని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చారు. ఏదైనా మాటల్లో ఉండరాదని, చేతల్లో ఉండాలని.. టెర్రరిజాన్ని అంతం చేసే దిశగా పని చేయాలని... నయా పాకిస్థాన్ ను నిర్మించుకోవాలని తన మిత్రుడుని కోరుతున్నానని చెప్పారు.  

 
ఇక క్రికెట్ ప్రపంచ కప్ లో పాకిస్థాన్ తో ఆడకూడదనే డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో గవాస్కర్ స్పందించారు. పాకిస్థాన్ తో ఆడి, వారిని చిత్తుగా ఓడించాలని అన్నారు. ప్రపంచకప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడకపోతే మనం రెండు పాయింట్లు కోల్పోతామని గవాస్కర్ చెప్పారు. ప్రపంచకప్ లాంటి టోర్నమెంట్ లో రెండు పాయింట్లను కోల్పోవడమంటే చిన్న విషయం కాదని.. టోర్నమెంట్ నుంచి బాధతో నిష్క్ర్రమించే అవకాశాలు కూడా ఉంటాయని తెలిపారు. పాక్ తో మనం ఆడి, ఆ జట్టు సెమీస్ కు చేరకుండా నిలువరించాలని.. పాకిస్థాన్ తో ఆడకున్నా... నాకౌట్ కు క్వాలిఫై కాగల సత్తా భారత్ కు  ఉందనే విషయం తనకు తెలుసని తెలిపారు. వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఆడకుండా నిషేధించడం అంత సులభం కాదని.. ఈ ప్రతిపాదనను ఇతర దేశాలు అంగీకరించవని తెలిపారు. ఇది రెండు దేశాల మధ్య సమస్యని ఇందులోకి తమను లాగవద్దని ఇతర దేశాలు చెప్పే అవకాశం ఉందని చెప్పారు.  

 మే నెలాఖర్లో ఇంగ్లాండ్‌లో ఆరంభమయ్యే వన్డే ప్రపంచకప్‌లో రెండు జట్ల మధ్య పోరు కోసం కోట్లాది మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే జూన్‌ 16న జరగాల్సిన ఈ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో భారత్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌ ఆడకూడదంటూ కొన్ని రోజుల కిందట సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ డిమాండ్‌ చేశాడు. అప్పుడు ఈ విషయాన్ని తేలిగ్గానే తీసుకున్నారు. కానీ ఈ డిమాండ్‌ అంతకంతకూ పెరుగుతోంది. సౌరభ్‌ గంగూలీ, అజహరుద్దీన్‌ సహా పలువురు మాజీ కెప్టెన్లు పాకిస్థాన్‌తో క్రికెట్‌ సంబంధాల్ని పూర్తిగా తెంచుకోవాలని అభిప్రాయపడుతుండటం గమనార్హం. దీంతో ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు బీసీసీఐ ఈ విషయంపై సీరియస్‌గా దృష్టిపెట్టే పరిస్థితి కనిపిస్తోందిప్పుడు. ప్రపంచకప్‌లోనూ పాక్‌తో తలపడకూడదన్న డిమాండ్లో అర్థం ఉందంటూ కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వ్యాఖ్యానించడం, ప్రభుత్వం ఆదేశిస్తే పాక్‌తో మ్యాచ్‌ నుంచి వైదొలుగుతామని బీసీసీఐ పేర్కొనడం.. ఈ మ్యాచ్‌ జరగడంపై అనుమానాల్ని పెంచేదే. ‘‘ప్రపంచకప్‌ దగ్గర పడ్డాకే ఆ టోర్నీలో పాకిస్థాన్‌తో తలపడటంపై స్పష్టత వస్తుంది. భారత జట్టు పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడకూడదని ప్రభుత్వం భావిస్తే మేం ఆడం. పాక్‌తో తలపడకుంటే పాయింట్లు ఆ జట్టుకు వెళ్తాయి. కానీ ఆ జట్టుతో ఫైనల్‌ ఆడాల్సి వస్తే.. కప్పే వారికి వెళ్తుంది. ప్రస్తుతానికి ఈ విషయంలో ఐసీసీతో సంప్రదింపులేమీ జరపట్లేదు’’ అని ఓ బీసీసీఐ అధికారి చెప్పడం గమనార్హం. పాక్‌తో మ్యాచ్‌ నుంచి వైదొలిగితే భారత్‌ ఓడినట్లవుతుంది. దీనికి తోడు ఐసీసీకి భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని, నిషేధం కూడా ఎదుర్కోవాల్సి వస్తుందన్న చర్చ కూడా నడుస్తోంది. ఐతే సభ్య దేశాల భాగస్వామ్య ఒప్పందం ప్రకారం మ్యాచ్‌ నుంచి తప్పుకునే హక్కు భారత్‌కుందని బీసీసీఐ అంటోంది.