Tuesday, October 15, 2019
Follow Us on :

మళ్లీ తెరపైకి సీబీఐ రగడ..! సీనియర్‌ అధికారికి సుప్రీం సమన్లు..!!

By BhaaratToday | Published On Feb 7th, 2019

బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ బాలికల సంరక్షణాలయానికి సంబంధించిన కేసులో సీబీఐ సీనియర్‌ అధికారి ఎం.నాగేశ్వరరావుకు సుప్రీం కోర్టు సమన్లు జారీ చేసింది. ముజఫర్‌పూర్‌ బాలికల సంరక్షణాలయం కేసును విచారిస్తోన్న అధికారి ఏకే శర్మను బదిలీ చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలని వ్యాఖ్యానిస్తూ, ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని మండిపడింది. ఫిబ్రవరి 12న నాగేశ్వరరావు, ఇతర అధికారులు కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. సీబీఐకి నాగేశ్వరరావు తాత్కాలిక డైరెక్టర్‌గా వ్యవహరించిన కాలంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. శర్మను బదిలీ చేసిన వ్యవహారంలో ఏఏ అధికారుల పాత్ర ఉందో తేల్చాలని సీబీఐకు సూచించింది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ అయిన శర్మ ముజఫర్‌పూర్‌ సంరక్షణాలయానికి సంబంధించిన కేసులను విచారిస్తోన్న సీనియర్‌ అధికారి. విచారణ ముగిసే వరకు ఆయన్ను బదిలీ చేయొద్దని గతంలోనే కోర్టు ఆదేశించింది. సీబీఐలో చెలరేగిన అంతర్గత వివాదం కారణంగా సంస్థలో ఆయన పదవీకాలం ముగియక ముందే జనవరి 17, 2019న సీఆర్‌పీఎఫ్ ఏడీజీపీగా బదిలీ అయ్యారు.