
సురేష్ రైనా.. అంతర్జాతీయ క్రికెట్ కు దూరమై చాలా రోజులైంది. ఐపీఎల్ లోనూ.. దేశవాళీ మ్యాచ్ లలోనూ.. అద్భుతంగా రాణించి తిరిగి భారతజట్టులో స్థానం సంపాదించాలని సురేష్ రైనా కష్టపడుతున్నాడు. ఇటువంటి తరుణంలో సురేష్ రైనా ఆసుపత్రి పాలయ్యాడు. ఆసుపత్రి బెడ్ పై సురేష్ రైనా ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే సురేశ్ రైనాకు మోకాలికి ఆపరేషన్ జరిగినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా మోకాలి నొప్పిత బాధపడుతున్న రైనా ఆమ్ స్టర్ డ్యామ్ లో మోకాలికి చికిత్స చేయించుకున్నాడు. ఆపరేషన్ విజయవంతమైనట్టు అక్కడి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. రైనా పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాల సమయం పడుతుందని తెలిపారు. సురేష్ రైనా కోలుకోవాలని అభిమానులు, పలువురు క్రికెటర్లు సోషల్ మీడియాలో స్పందించారు.