
కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. ఐసీజే తీర్పుపై స్పందించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌కు ఇది గొప్ప విజయమని వ్యాఖ్యానించారు. జాదవ్ కేసును అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, వాదనలు వినిపించిన హరీష్ సాల్వేకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలావుంటే.. అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ విజయం సాధించింది. కుల్‌భూషణ్ జాదవ్ కేసులో భారత్‌కు అనుకూలంగా అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. జాదవ్‌కు పాక్ సైనిక కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేస్తూ.. ఆ కేసును పునః సమీక్షించాలని పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు.. జాదవ్‌కు అవకాశం ఇవ్వాలని ఐసీజే తీర్పులో స్పష్టం చేసింది. 2016లో గూఢచర్య ఆరోపణలపై కుల్‌భూషణ్‌ను పాక్ అరెస్ట్ చేసింది.