Tuesday, October 15, 2019
Follow Us on :

సైరా ప్రీరిలీజ్ ఫంక్షన్ ను అడ్డుకుంటామని హెచ్చరించారు.. స్పందించిన రామ్ చరణ్, సురేందర్ రెడ్డి

By BhaaratToday | Published On Sep 22nd, 2019

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. చిరంజీవి, రామ్ చరణ్ తమను మోసం చేశారంటూ ఉయ్యాలవాడ వంశీయులు పోలీసులను ఆశ్రయించారు. ఉయ్యాలవాడ కుటుంబసభ్యులు మాట్లాడుతూ తమను చిరంజీవి, రామ్ చరణ్ ఛీటింగ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా కోసం తమతో రామ్ చరణ్ స్వయంగా మాట్లాడాడని నోటరీపై 22 మందితో సంతకాలు చేయించారని వెల్లడించారు. సైరా మార్కెట్ విలువలో 10 శాతం ఇస్తామని మాటిచ్చారని, ఆ లెక్కన తమకు రూ.50 కోట్లు రావాల్సి ఉందని అన్నారు. సినిమా షూటింగ్ సమయంలో తమ ఆస్తులు, స్థలాలను వాడుకున్నారని ఆరోపించారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని రామ్ చరణ్ ను, దర్శకుడ్ని కోరామని వారు తెలిపారు. న్యాయం జరిగేవరకు ఆందోళన విరమించేది లేదని, చిరంజీవి, రామ్ చరణ్ లపై కేసు నమోదు చేయాల్సిందేనని ఉయ్యాలవాడ వంశీయులు అంటున్నారు.

ఉయ్యాలవాడ వంశీయుల న్యాయవాది జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఛీటింగ్ చేశారు కాబట్టే ఫిర్యాదు చేశామని తెలిపారు. జూబ్లీహిల్స్ పీఎస్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని వెల్లడించారు. తమ ఫిర్యాదుతో పాటు అన్ని ఆధారాలు సమర్పించామని చెప్పారు. న్యాయం జరగకపోతే సైరా ప్రీరిలీజ్ ఫంక్షన్ ను అడ్డుకుంటామని హెచ్చరించారు.

 ఈ వివాదంపై చిత్ర నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి స్పందించారు. తాము కేవలం ఓ నలుగురి కోసం ఈ సినిమాను తీయలేదని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు. తమపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. 100 సంవత్సరాలు దాటిన కథలకు కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి అనుమతీ అక్కర్లేదన్నారు. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ తాము ఎన్నో ప్రాంతాల్లో పర్యటించి, ఈ కథను సిద్ధం చేసుకున్నామని తెలిపారు. ఈ కథ ఏ కొద్దిమంది నుంచో సేకరించింది కాదన్నారు.