
ఎన్నికల ముందు ఒకలా, తర్వాత ఒకలా వ్యవహరిస్తున్నారంటూ చంద్రబాబుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థతో వంశీ మాట్లాడుతూ 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ను కావాలనే తప్పించారంటూ సంచలన విషయాలను బయటపెట్టారు. 2009 సమయంలో ఎన్టీఆర్‌ను ఎన్నికల ప్రచారానికి తాను, కొడాలి నాని కలిసి ఒప్పించి తీసుకొచ్చామని.. ఎన్నికల ఫలితాల తర్వాత..జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోయిందంటూ ప్రముఖ వార్తా పత్రికతో తప్పుడు ప్రచారం చేయించారని అన్నారు. నారా లోకేశ్ పొలిటికల్ భవితవ్యం కోసమే ఎన్టీఆర్‌ను అలా చేశారని చెప్పుకొచ్చారు వంశీ.
వంశీ చేసిన వ్యాఖ్యలపై నారా లోకేష్ స్పందించారు కానీ సరైన వివరణ ఇవ్వలేకపోయారు. జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారంపై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలపై నారాలోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఇప్పుడెందుకు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది 2009 నాటి విషయమని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ది 2009 వ్యవహారం, ఇప్పుడు 2019లో ఉన్నాం ఆయన ఇంకా హ్యాంగోవర్లో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇక ఎన్టీఆర్ కు సన్నిహితుడైన ఏపీ మంత్రి కొడాలి నాని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తే ఎక్కువ సీట్లు వస్తాయనే భావనతో 2009 ఎన్నికల్లో ఆయన చేత చంద్రబాబు ప్రచారం చేయించారని.. అయితే తన కుమారుడు లోకేశ్ కు ఇబ్బంది అవుతుండేమో అనే ఉద్దేశంతో ఆ తర్వాత ఎన్టీఆర్ ను పక్కన పెట్టేశారని చెప్పారు. లోకేశ్ ది కార్పొరేటర్ స్థాయి కూడా కాదని.. చంద్రబాబు కుమారుడు అయినందువల్లే లోకేశ్ ని ఎమ్మెల్సీ చేసి, మంత్రి పదవిని కట్టబెట్టారని చెప్పారు. టీడీపీకి లోకేశ్ గుదిబండగా మారారని అన్నారు.