Wednesday, October 16, 2019
Follow Us on :

ఓటు హక్కును వినియోగించుకోలేకపోయిన కేసీఆర్, ఆయన సతీమణి శోభ.. ఇదే హాట్ టాపిక్..!

By BhaaratToday | Published On Jan 22nd, 2019

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ చింతమడక గ్రామానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే పంచాయతి ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటు వేయలేకపోయారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఇవి. కేసీఆర్, ఆయన సతీమణి శోభ తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం హాట్ టాపిక్ అయింది. 

తన వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్న సహస్ర మహా చండీయాగంలో నిమగ్నమై ఉన్నందునే కేసీఆర్ దంపతులు సోమవారం జరిగిన ఎన్నికల్లో ఓటును వేయలేకపోయారు. సరిగ్గా యాగం ప్రారంభమైన సమయంలోనే ఓటింగ్ జరగడంతోనే ఆయన వెళ్లలేకపోయారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కేసీఆర్ స్వగ్రామమైన సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలో సోమవారం పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అయితే ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ యాగం నిర్వహిస్తుండటంతో ఓటు వేసేందుకు వీలు కాలేదు. యాగం ఉదయమే ప్రారంభం కావడం, పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకే జరగడంతో చింతమడకకు కేసీఆర్ దంపతులు వెళ్లలేకపోయారు. 

తెలంగాణ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ విజయం సాధించింది. తొలి విడతలో 4,479 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా ఏకగ్రీవంతో కలిపి టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 2,629 స్థానాలు కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ 920, టీడీపీ 31, బీజేపీ 67, సీపీఐ 19, సీపీఐ 32, ఇతరులు 758 స్థానాల్లో విజయం సాధించారు.