Saturday, August 24, 2019
Follow Us on :

తెలంగాణలో అపహరణలపై క్లారిటీ ఇచ్చిన డీజీపీ మహేందర్ రెడ్డి

By BhaaratToday | Published On Jun 13th, 2019

తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, పిల్లలు, పెద్ద వయసు వారు అపహరణకు గురవుతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. జరిగినవి కొన్నయితే మరికొన్ని వదంతులు కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనిపై డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించాల్సి వచ్చింది. తెలంగాణలో చాలా మంది తప్పిపోతున్నారంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని ఆయన ఓ ట్వీట్ చేశారు. 

కుటుంబ వ్యవహారాలు, ప్రేమ సంఘటనలు, పరీక్షల్లో తప్పడం వల్ల వెళ్లిపోయే పిల్లలు, తమ తల్లిదండ్రులపై అలిగి మరికొందరు పిల్లలు, పిల్లల సంరక్షణ దొరకని వృద్ధులైన తల్లిదండ్రులు ఇళ్లు విడిచి వెళ్లిపోయినవే ఉన్నాయని ఆయన అన్నారు. నమోదైన కేసుల్లో 85 శాతానికి పైగా పరిష్కరించామన్నారు. మిగిలిన కేసుల పరిష్కారానికి పోలీస్ శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తుందని, సమాజంలోని అన్ని వర్గాల భద్రతకు కట్టుబడి పోలీసు సిబ్బంది అహర్నిశలు పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ఈ వదంతులను నమ్మొద్దని.. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో భయాందోళనలు సృష్టించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.