Thursday, July 18, 2019
Follow Us on :

న‌ష్టాల ఆర్టీసీకి క‌ష్టాలు

By BhaaratToday | Published On Apr 15th, 2019

నష్టాల ఆర్టీసీకి కష్టాలు ఎదుర‌వుతున్నాయి. ఎండలు బాగా ముదురుతుండటంతో తెలంగాణ ఆర్టీసీలో కొత్త సమస్య ఏర్పడింది. డ్రైవర్ల కొరతతో నిత్యం కొన్నిబస్సులు డిపోలకే పరిమితమవుతుండగా, తాజాగా ఎండవేడి భరించలేక డ్రైవర్లు డబుల్‌ డ్యూటీకి నిరాకరిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో డిపోల్లో నిలిచిపోతున్న బస్సుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ  పోతోంది. ఫలితంగా అర్ధంతరంగా కొన్ని ట్రిప్పులను రద్దు చేయాల్సి వస్తోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నెలాఖరుకల్లా ఎండ తీవ్రత మరింత పెరగనుండటంతో సమస్య అధికం కానుంది. ఆర్టీసీలో ఆరేళ్లుగా డ్రైవర్ల నియామకం లేదు. పదవీవిరమణ అవుతున్నవారు, మృత్యువాత పడుతున్న వారు, అనారోగ్యం ఇతర కారణాలతో దీర్ఘకాలిక సెలవుల్లో  వెళ్తున్న వారి సంఖ్య ఎక్కువ‌వుతోంది.దీంతో ప్రస్తుతం ఆర్టీసీలో  రెండువేల మంది డ్రైవర్ల కొరత ఏర్పడింది. దీంతో అప్పటికప్పుడు డిపో అధికారులు అందుబాటులో ఉన్న డ్రైవర్లను బతిమిలాడి డబుల్‌ డ్యూటీలకు పంపుతున్నారు.  తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఇది పెద్ద సమస్యగా మారింది.
 
హైద‌రాబాద్‌లో డ్రైవ‌ర్ల  కొర‌త మ‌రింత తీవ్రం:
అయితే డ్రైవర్ల కొరత హైదరాబాద్‌ నగరంలో మరింత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం నగరంలో దాదాపు 700 డ్రైవర్‌ పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అనారోగ్యం, ఇతర సమస్యలతో కొందరు డ్యూటీలకు హాజరుకావటం లేదు. అందుకు నిత్యం వేయిమంది వరకు డ్రైవర్లు విధులకు రావటం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో నిత్యం 20 శాతం మేర సర్వీసులు డిపోలకు పరిమితమవుతున్నాయి. ఇటీవల అద్దెబస్సుల సంఖ్య బాగా పెంచటంతో సమస్య కొంత తగ్గినా, అది ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా లేదు. డ్రైవ‌ర్ల కొర‌త వ‌ల్ల కొన్ని బ‌స్సులు డిపోల‌కే ప‌రిమితం కావ‌డంతో ప్ర‌యాణికుల‌కు ఇబ్బందులు త‌ప్ప‌డంలేదు.