Monday, December 09, 2019
Follow Us on :

పాక్ ఆశలపై నీళ్లు.. పాకిస్థాన్ టూర్ కు వెళ్ళమని చెప్పేసిన శ్రీలంక క్రికెటర్స్

By BhaaratToday | Published On Sep 10th, 2019

పాకిస్థాన్ లో సెక్యూరిటీ సమస్యల కారణంగా ఇప్పటికే ఆ దేశంలో క్రికెట్ ఆడటానికి ఏ జట్లూ వెళ్లడం లేదు. ఎందుకంటే 2009లో లాహోర్ లో శ్రీలంక ఆటగాళ్ల బస్సుపై ఉగ్రదాడి జరిగింది. శ్రీలంక ఆటగాళ్ళు తీవ్ర గాయాలపాలయ్యారు కూడా. ఈ ఘటన అనంతరం విదేశీ జట్లు పాకిస్థాన్ లో పర్యటించాలంటేనే భయపడిపోతున్నాయి. చివరికి పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ కూడా వారి సొంత దేశంలో జరుపులేకపోతున్న పరిస్థితి ఆ దేశానిది. 

 అయితే అక్కడ శ్రీలంక బోర్డు సిరీస్ ను ఫిక్స్ చేసుకుంది. కానీ ఆటగాళ్లు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. సెప్టెంబరు 27 నుంచి శ్రీలంక జట్టు పాకిస్థాన్ గడ్డపై 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా పాకిస్థాన్ లో పరిస్థితులను కారణంగా చూపుతూ 10 మంది శ్రీలంక క్రికెటర్లు టూర్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. శ్రీలంక టి20 జట్టు కెప్టెన్ లసిత్ మలింగ సహా 10 మంది ఆటగాళ్లు పాకిస్థాన్ వెళ్లకూడదని నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. ఏంజెలో మాథ్యూస్, తిసర పెరెరా, నిరోషన్ డిక్వెలా, కుశాల్ పెరెరా, ధనంజయ డిసిల్లా, అఖిల ధనంజయ, సురంగ లక్మల్, దినేశ్ చాందిమల్, దిముత్ కరుణరత్నే లాంటి స్టార్స్ పాకిస్థాన్ కు వెళ్లకూడదని అనుకుంటూ ఉన్నారు. దీంతో శ్రీలంక బోర్డు చేసేదేమీ లేక పాకిస్థాన్ వెళ్లాలా? వద్దా? అనేది ఆటగాళ్లకే వదిలేశామని ఓ ప్రకటనలో తెలిపింది.