Monday, November 18, 2019
Follow Us on :

పుల్వామా ఉగ్ర‌దాడిని ఖండించిన ప్ర‌పంచ దేశాలు

By BhaaratToday | Published On Feb 16th, 2019

జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన తీవ్రవాద దాడిపై దేశంలోని ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రదాడిని ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదుల చర్చను అమానవీయంగా పేర్కొంది రష్యా. టెర్రరిస్టుల అంతానికి ప్రపంచ దేశాలు ఏకతాటిపై నిలిచి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చింది. ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు జర్మనీ, ఫ్రాన్స్ ప్రగాఢ సంతాపం ప్రకటించాయి. ఇక యురి ఘటన తర్వాత పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ సర్జికల్ స్టైక్స్ చేసిన భారత్.. ఇప్పుడు మరో యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. పుల్వామా ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న మోదీ సర్కార్.. పాక్ దుశ్చర్యలకు చరమగీతం పాడేందుకు నిశ్చయించుకుంది.

ఇప్పటికే పుల్వామా ఘటనను ఖండించిన యావత్ ప్రపంచ దేశాలు భారత్ కు మద్దతుగా నిలిచాయి. అటు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో వివిధ దేశాల ప్రతినిధులతో భారత ప్రతినిధులు కీలక చర్చలు జరిపారు. ఈ భేటికి సౌత్ కొరియా, స్వీడన్, స్లోవేకియా, ఫ్రాన్స్, స్పెయిన్, భూటన్, జర్మనీ, హంగేరి, ఇటలీ, యూరోపియన్ యూనియన్, కెనడా, బ్రిటన్, రష్యా, ఇజ్రాయిల్, ఆస్ట్రేలియా, జపాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ దేశాలకు చెందిన విదేశాంగ ప్రతినిధులు హాజరయ్యారు.

అంతకుముందు, జరిగిన కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అత్యవసరంగా సమావేశంలో.. భద్రతా దళాలకు మోదీ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ హాజరయ్యారు. త్రివిధ దళాధిపతులతో పాటు సీఆర్ఫీఎఫ్‌ డీజీ కూడా సమావేశానికి వచ్చారు. జమ్మూకశ్మీర్‌లో చేపట్టాల్సిన భద్రతా చర్యల గురించి సమావేశంలో చర్చించినట్టు సమాచారం.

ఓవైపు కశ్మీర్ లోతక్షణ చర్యలకు కార్యాచరణ రూపొందిస్తూనే.. ఉగ్రవాదానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న పాక్ కు బుద్ధిచెప్పేందుకు మోదీ ప్రభుత్వం ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తెస్తున్నారు. పుల్వామా ఘటనకు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత్.. పాక్ దమనకాండకు సరైన జవాబు చెబుతుందని దేశ పౌరులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆర్థికంగా కోలుకోలేని స్థితిలో ఉన్న పాక్.. ఉగ్రవాద నిర్మూలనకు ఉపక్రమించకపోతే.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని యూఎన్ సహా ప్రపంచదేశాలన్నీ హెచ్చరిస్తున్నాయి.