Tuesday, September 24, 2019
Follow Us on :

పుల్వామాలో భారత ఆర్మీ కాన్వాయ్‌పై మరో దాడి

By BhaaratToday | Published On Jun 17th, 2019

దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగే అవకాశాలున్నాయంటూ పాకిస్థాన్ హెచ్చరించింది. ఈ సమాచారాన్ని భారత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ)కు అంద‌జేసింది. రాబోయే రోజుల్లో సౌత్ కశ్మీర్‌లోని జాతీయ రహదారిపై ఉగ్రదాడి జరిగే అవకాశముందని ఎన్ఎస్ఏకు పాకిస్థాన్ సమాచారమిచ్చిన సంగతి తెలిసిందే. అల్‌ఖైదా ఇండియా కమాండర్ జాకిర్ ముసా సహా పలువురు కమాండర్లను ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్‌లో భారత భద్రతా బలగాలు మట్టుబెట్టినందుకు ప్రతీకారంగా లష్కరే తొయిబా, జైషే మహ్మద్ వంటి టెర్రరిస్టు గ్రూపులు దాడులు జరిపేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయ‌ని పాక్ హెచ్చరించగా.. అన్నట్లుగానే ఈరోజు పుల్వామాలో ఓ దాడి జరిగింది. 

కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో మరోసారి ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఐఈడీతో దాడి చేశారు. అది కూడ గతంలో సిఆర్ఫీఎఫ్ కాన్వాయ్ దాడి జరిగిన ప్రాంతంలో జరగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతవరణం నెలకొంది. 44 రాష్ట్ర్రీయ రైఫిల్స్‌కు చెందిన ఆర్మ్‌డ్ కాన్వాయ్ పై పుల్వామా జిల్లాలోని అరిహల్ గ్రామం సమీపంలో ఈ దాడి జరిగింది. ఆర్మీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో దాడికి పాల్పడ్డారు. దాడి జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి 27 కిలోమీటర్ల దూరంలో ఈరోజు దాడి జరిగింది. ఈ దాడిలో ఒక వాహనం ధ్వంసమవ్వగా.. వెంటనే భారీ ఎత్తున కాల్పులు, రాళ్లు రువ్వడం ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సింది.