Monday, November 18, 2019
Follow Us on :

పాక్ టైమ్ ఓవర్.. గ్రే లిస్ట్ లో వున్న పాకిస్తాన్ ఇకపై బ్లాక్ లిస్ట్

By BhaaratToday | Published On Oct 15th, 2019

ఓవైపు ఉగ్రవాదం.. మరోవైపు అంతర్జాతీయ సమాజం.. ఈ రెండింటి నడుమ అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది పాకిస్తాన్ పరిస్థితి. ఆర్టికల్ 370ని రద్దు చేసిన నాటినుంచి.. కల్లుతాగిన కోతిలా ఎగిరెరిగి పడుతున్న ఉగ్రదేశానికి.. అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయి. అది చాలదన్నట్టు.. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం కూడా ఆ దేశాన్ని ముంచేందుకు సిద్ధమైంది. ఉగ్రవాదంపై చర్యలు తీసుకుంటామని.. తమను బ్లాక్ లిస్ట్ లో పెట్టొద్దని.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ముందు.. నక్కవినయాలు ప్రదర్శించిన పాక్.. ఆ మేరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఇప్పటికే ‘గ్రే లిస్ట్’ లో వున్న పాకిస్తాన్ ‘బ్లాక్ లిస్ట్’ లో చేర్చేందుకు సిద్ధమవుతోంది ఎఫ్ఏటీఎఫ్.

పాకిస్తాన్ భవిష్యత్తు రోజురోజుకూ దిగజారిపోతోంది. ఇప్పుడు ఆ దేశానికి ‘బ్లాక్ లిస్ట్’ భయం పట్టుకుంది. ఇప్పటికే ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్’ నివేదిక పాకిస్తాన్ ఆర్థిక స్థితిని కళ్లకుకట్టింది. అదే సమయంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మరింత భయపెడుతోంది. ఉగ్రవాదం విషయంలో ఎఫ్ఏటీఎఫ్ పెట్టిన షరతులను ఏమాత్రం ఖాతరు చేయని పాకిస్తాన్.. ఇప్పటికే ‘గ్రే లిస్ట్’ లో చేరి అప్పుల కోసం పాకులాడుతోంది. అయితే, ఇప్పుడు ఆ దేశాన్ని ‘బ్లాక్ లిస్ట్’ లో పెట్టేందుకు ఎఫ్ఏటీఎఫ్ సిద్ధమవుతోందన్న సంకేతాలు.. ఇమ్రాన్ సర్కార్ ను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి ఇమ్రాన్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలా తెలియక సతమతవుతున్నాడు ఉగ్రదేశాధినేత. ఎటుచూసినా ప్రతికూల పరిస్థితులే ఎదురవుతుండటంతో ఏం చేయాలో తోచక తల పట్టుకుంటున్నాడు.

గతంలో ఐఎంఎఫ్ నుంచి, మిత్రదేశం చైనా నుంచి ఎడాపెడా అప్పులు చేసిన ఇమ్రాన్ కు ఇప్పుడు అన్ని దారులూ మూసుకుపోయాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అంతర్జాతీయంగా ఎదురుకానున్న ఇబ్బందులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మనీలాండరింగ్, ఉగ్రమూకలకు నిధుల సరఫరాకు అడ్డుకట్ట వేయడంలో పాకిస్తాన్ తీసుకొంటున్న చర్యలపై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ తాజాగా పారిస్ నగరంలో సమీక్ష ప్రారంభించింది. ఈ సమీక్షలో ఏమాత్రం వ్యతిరేక ఫలితం వచ్చినా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ.. ఉత్తర కొరియా స్థాయికి దిగజారడం ఖాయం. 

ఇప్పటికే పాకిస్తాన్ ను గ్రే లిస్టులో చేర్చిన ఎఫ్ఏటీఎఫ్.. ఆ దేశానికి విధించిన షరతులను అమలు చేసే విషయంలో దారుణంగా ఫెయిల్ అయింది. దీనిపై అసహనం వ్యక్తం చేసిన.. ఎఫ్ఏటీఎఫ్ ఆసియా-పసిఫిక్ విభాగం ఇటీవల 228 పేజీల సమగ్ర నివేదిక తయారుచేసింది. పాక్ కు సూచించిన 40 సిఫార్సుల్లో ఒకటి మాత్రమే పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చిందని.. మరో 35 సిఫార్సులు వివిధ దశల్లో ఉన్నాయని తేల్చింది. కీలకమైన మరో నాలుగు సిఫార్సుల అమలు ఊసేలేదని చెప్పింది. పాక్ తీసుకుంటున్న కంటితుడుపు చర్యలు.. లష్కరే తొయిబా, ఫలాయీ ఇన్సానియత్ , జమాత్ ఉద్ దవా వంటి ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై ఎంతమాత్రం ప్రభావాన్ని చూపలేదన్నది ఎఫ్ఏటీఎఫ్ వాదన.

ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లిస్ట్ నుంచి తప్పించుకోవాలంటే ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవడమే పాకిస్తాన్ ముందున్న ఏకైక మార్గం. అయితే, ఆ దిశగా పాక్ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అయితే, ఎఫ్ఏటీఎఫ్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో.. ఆగమేఘాల మీద కొన్ని కంటితుడుపు చర్యలకు దిగింది. హఫీజ్ సయీద్, మసూద్ అజర్ లాంటి పెద్దచేపలను వదిలేసి.. కొద్దిరోజుల కిందట లష్కరే తొయిబాకు చెందిన నలుగురు కీలక నేతలను పాకిస్తాన్ అదుపులోకి తీసుకుంది. ప్రొఫెసర్ జాఫర్ ఇక్బాల్, యాహ్య అజీజ్, మమ్మద్ అష్రాఫ్, అబ్దుల్ సల్మాన్‌లను అరెస్ట్ చేసి.. నక్కవినయాలు ప్రదర్శించే ప్రయత్నం చేసింది.

ఇదిలావుంటే, ఎఫ్ఏటీఎఫ్ సదస్సు జరుగుతున్న నేపథ్యంలో.. భారత్ కూడా ఘాటుగా స్పందించింది. కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తున్న విదేశీ సంస్థలకు కరెక్ట్‌గా చెక్‌ పెట్టామని, ఉగ్రవాదానికి నిధుల కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు ద్వారా ఆయా విదేశీ సంస్థలపై సరైనరీతిలో ఒత్తిడి తీసుకురాగలిగామన్నారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌. సోమవారం ఢిల్లీలో జరిగిన టాప్‌ పోలీసుల సదస్సులో పాక్ పై ఆయన విరుచుపడ్డారు.

కశ్మీర్‌ లోయలో ఉగ్రమూకలకు అందుతున్న నిధులపై ఎన్‌ఐఏ గట్టిగా చెక్‌ పెట్టడం, ఫైనాన్షియల్‌ యాక్షసన్‌ టాస్క్‌ఫోర్స్‌ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడాన్ని దోవల్ ప్రస్తావించారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాదులకు అందుతున్న నిధులపై ఎఫ్‌ఏటీఏఫ్‌ గట్టి చర్యలు తీసుకుందని, ఇది పాకిస్తాన్‌పై ఒత్తిడిని పెంచిందన్నారు. సరైన ఆధారాలు, సమాచారం సేకరించడం ద్వారానే ఇది సాధ్యమైందని తెలిపారు.

ఇక, పాకిస్తాన్ పై అమెరికా మరోసారి హెచ్చరికలు జారీచేసింది. తన భూభాగంలోని ఉగ్రవాద సంస్థలను పాక్ నిర్మూలించాలని స్పష్టం చేసింది. లష్కరే తొయిబా సహా దాని అధినేత హఫీజ్ సయీద్‌పై చర్యలు తీసుకోవాలని ట్రంప్ సర్కార్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ ను ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లిస్ట్ భయపెడుతున్న సమయంలో అమెరికా హెచ్చరికలకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, లష్కరే తొయిబా, జమాతే ఉద్దవ్ సంస్థలకు చెందిన ముఖ్యమైన నేతల అరెస్ట్‌ను అమెరికా దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల బ్యూరో చీఫ్ అలీసీ వెల్స్ స్వాగతించారు. అయితే వారందరినీ తప్పక విచారించి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు.

 ఉగ్రవాదులకు పాకిస్థాన్ స్వర్గధామంగా మారిన విషయం జగమెరిగిన సత్యం. దశాబ్దాలుగా అది ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న ప్రపంచ దేశాలన్నింటికీ తెలిసిన విషయమే. అంతర్జాతీయ సమాజం ఎంతగా హెచ్చరించినా ఉగ్రవాదం విషయంలో పాక్ తన పంథాను మార్చుకోవడం లేదు. తన భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై చర్యలు తీసుకోకపోగా, వారికి ఆర్థికంగా సాయం చేస్తున్నట్టు పక్కా ఆధారాలు లభించడంతో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాక్‌ను గ్రే లిస్ట్‌లో చేర్చింది. అయితే, తమ సిఫార్సులను గాలికొదిలేసిన నేపథ్యంలో.. పాకిస్తాన్ ను ఇప్పుడు బ్లాక్ లిస్ట్ లో చేర్చే దిశగా ఎఫ్ఏటీఎఫ్ ఆలోచిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పారిస్ మీటింగ్ లో పాక్ ను బ్లాక్ లిస్ట్ లో గనుక పెడితే.. ఇక, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయినట్టేనంటున్నారు ఆర్థిక నిపుణులు.

ఎఫ్ఏటీఎఫ్ ఓటింగ్ విషయానికి వస్తే, భౌగోళిక రాజకీయాల్లో విషయ తీవ్రత ఆధారంగా ఏ దేశం ఓటు వేయదు. ఆయా దేశాల దౌత్య అవసరాల ఆధారంగానే ఓటింగ్ జరుగుతుంది. ఇప్పటికే బ్లాక్ లిస్టు లో ఉన్న ఇరాన్, ఉత్తర కొరియా పశ్చిమ దేశాలకు తలనొప్పిగా మారాయి. పాకిస్తాన్ తో పోల్చుకుంటే ఉగ్రవాద చరిత్రలో ఉత్తర కొరియా పాత్ర తక్కువే. కానీ, అమెరికాతో విరోధం కారణంగానే ఉత్తర కొరియా ఇప్పటికీ బ్లాక్ లిస్టు లో కొనసాగుతోంది. ఈ దేశాలతో పోలిస్తే పశ్చిమ దేశాలు పాకిస్తాన్ పై ఆ స్థాయి వ్యతిరేకతతో లేవు. ఎఫ్ఏటీఎఫ్ 40 సిఫార్సులు సూచించింది. వాటిలోని 36 సిఫార్సుల్లో ఎంతో కొంత పురోగతి చూపడంతో మరికొంత సమయం ఇవ్వాలని పేర్కొంటూ మరోసారి పాకిస్తాన్ ను గ్రే లిస్టులో కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. దీని నుంచి బయటపడాలంటే 15 మందికి పైగా సభ్యుల మద్దతు పాక్ కూడగట్టాలి. అమెరికా, ఐరోపా దేశాల ఆశీస్సులు లేకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ కు మద్దతు సాధన దాదాపు అసాధ్యం.