Monday, November 18, 2019
Follow Us on :

20 నెలలు.. మూడు జిల్లాలు.. 10 హత్యలు.. ప్రసాదం అంటూ ప్రాణాలు తీశాడు..!

By BhaaratToday | Published On Nov 7th, 2019

20 నెలలు.. మూడు జిల్లాలు.. 10 హత్యలు. నమ్మకాన్ని అమ్మకానికి పెట్టి నట్టేట ముంచడంలో ఆరితేరాడు ఆ నరరూప రాక్షసుడు. ప్రశాంతమైన గోదారి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో ఈ దారుణాలు చోటు చేసుకున్నాయి. అయితే హత్యలు చేయడానికి బరిసెలు, పదునైన కత్తులు, తుపాకులు, నాటు బాంబులు ఏమీ వాడలేదు. మరి ఎలా చంపాడు అనే కదా మీ సందేహం. కేవలం నమ్మకం అనే ఆయుధంతో ఎదుటి వారి బలహీనతే అణుబాంబుగా వినియోగించాడు ఈ కిల్లర్. ఒక్కో హత్యలో ఒక్కో కథ. ఈ సీరియల్ కిల్లర్ చేసిన ఘాతకాలు తెలిస్తే వెన్నులో వణుకుపుట్టక మానదు.

Image result for nagaraju serial killer

ఏడాది మీద ఎనిమిది నెలల్లో పది మందిపై సాగించిన ఈ దారుణమారణకాండలో కన్న తల్లిపైనా కనికరం చూపలేదు. ఓ స్వామిని వదల లేదు. ఈ సీక్రెట్ కిల్లర్ మారణహోమానికి సంబంధించి సగం కేసుల్లో ఫిర్యాదులు లేవు. కనీసం పోస్టుమార్టం రిపోర్టులు లేవు. ఇన్ని హత్యలు జరిగినా నిఘా వర్గాల నుంచి పోలీసుశాఖకు చిన్న చప్పుడు సైతం వినిపించలేదంటే విడ్డూరమే మరి. గతంలో చీటింగ్ కేసుల్లో నేరస్థునిగా పోలీసులు గుర్తించినా, నిఘా మాత్రం పెట్టలేకపోవడం గమనార్హం.

ఎదుటి వారి కష్టాలను, ఆశను అదనుగా తీసుకుని వల వేస్తాడు. భక్తి ముసుగులో ముంచేసి.. ఆపై వంటిపై గాయం కూడా లేకుండానే ప్రసాదంలో సైనేడ్‌ విషాన్ని కలిపి ప్రాణాలు తీస్తాడు. తానొక రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌నని చెప్పుకుంటూ పరిచయాలు పెంచుకుంటాడు. ఏలూరులోని ఓ వ్యాయామ ఉపాధ్యాయుడి హత్యను పోలీసులు ఛేదించారు. ఆయన కాల్‌డేటా ఆధారంగా హంతకుడిని గుర్తించి.. తమదైన శైలిలో విచారణ జరుపుతుండటంతో నివ్వెరపోయే నిజాలు.. మరిన్ని హత్యలు వెలుగు చూశాయి.

ఏలూరు రూరల్‌ మండలం లింగారావుగూడెంకు చెందిన కాటి నాగరాజు ఏలూరు అశోక్‌నగర్‌లోని కేపీడీటీ హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తన కుటుంబంతో సత్రంపాడులో ఉంటున్నారు. ఇటీవల తన స్వగ్రామంలో నూతన గృహాన్ని నిర్మించారు. ఈ నెల 16న ఆయన తన ఇంట్లోవున్న రెండు లక్షల నగదు, కొంత బంగారం తీసుకుని హడావుడిగా వెళ్లారు. కొంతసేపటికే వట్లూరు సీఆర్‌ఆర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీ వద్ద ఆయన కూలబడి అపస్మారక స్థితిలో ఉండటంతో.. అటుగా వెళుతున్న వారు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

ఆయన వెంట తీసుకెళ్లిన బంగారు ఆభరణాలు, నగదు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు హత్య, దోపిడీగా భావించి కేసు నమోదు చేశారు. విష ప్రభావంతో మరణించాడని పోస్టుమార్టం నివేదిక రావడంతో ఇది హత్యేనని భావించిన పోలీసులు రంగంలోకి దిగారు. నాగరాజు మాస్టారు కాల్‌ డేటాను పరిశీలించారు. ఈ కేసుకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. పోలీసులు తమదైన శైలిలో విచారించారు. వారికే దిమ్మ తిరిగే విషయాలను కిల్లర్‌ చిట్టా విప్పడంతో వాటిని నమోదు చేసుకుంటూ మిగిలిన మరణాలపై ఆరా తీశారు. 

నాగరాజు మాస్టారు నూతన ఇంటి నిర్మాణానికి అప్పులు చేశారు. రెండేళ్ల క్రితం ఏలూరుకు చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ పరిచయమయ్యాడు. తొలుత ఆయన కట్టిన ఇంటినే విక్రయిస్తే ఎక్కువ డబ్బు వస్తుందని నమ్మబలికినట్లు సమాచారం. నాగరాజు మాస్టారు అప్పుల్లో ఉన్నారని ఆ బ్రోకర్‌ గ్రహించాడు. ఓ రహస్యం చెబుతానని, దానితో కుబేరుడు అవుతారని నమ్మించాడు. తనకు తెలిసిన వారి ద్వారా బియ్యాన్ని ఆకర్షించే పురాతన నాణేలు ఏలూరులో కొందరు కొన్నారని, వారి పరిస్థితి తెలుసుకోమంటూ ఉదాహరణగా ధనవంతుల పేర్లు చెప్పినట్లు సమాచారం. దీనిని నమ్మిన నాగరాజు మాస్టారు ఏడు లక్షల రూపాయలకు ఆ నాణేన్ని కొనడానికి బేరం కుదుర్చుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. 

ఆ నాణేన్ని ఒకరు తీసుకు వస్తున్నారని, వెంటనే డబ్బులు తీసుకురమ్మని రావాలంటూ నాగరాజు మాస్టారుకు శివ ఫోన్‌ చేయడంతో ఆయన ఇంటిలోని రెండు లక్షల నగదు, కొంత బంగారాన్ని తీసుకుని హడావుడిగా వెళ్లిపోయినట్లు గుర్తించారు. వట్లూరు మేరిమాత విగ్రహం వద్ద కలిసిన నాగరాజు మాస్టారుకు ఆ నాణేలు పొందాలంటే ముందుగా ఈ ప్రసాదాన్ని తీసుకోవాలని చెప్పడంతో పౌడర్‌ రూపంలో ఉన్న ప్రసాదాన్ని మాస్టారు తిన్నట్లు గుర్తించారు. దీంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణించినట్లుగా వైద్యులు వెల్లడించారు. దీంతో కిల్లర్‌ కథ పోలీసులకు చిక్కింది. 

ఆ సీరియల్ కిల్లర్ విచారణలో వెల్లడించిన విషయాలతో పోలీసులే విస్తు పోయారు. రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌గా చలామణి అవుతూ ఎదుటి వారి కష్టాలను, ఆర్థిక అవసరాలను గ్రహించి తనదైన శైలిలో మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుని నగదు, బంగారు ఆభరణాలను తీసుకుని ఆపై ప్రసాదం పేరుతో హతమార్చే కిల్లర్‌ని పోలీసులు ఓ రహస్య ప్రాంతంలో విచారించారు. ఇప్పటి వరకు మంది హత్యలకు పాల్పడినట్లు వెల్లడించాడు. కృష్ణా జిల్లాలో తన బంధువును ఇదే మాదిరిగా హతమార్చాడని, ఏలూరులో మరో నలుగురు, తూర్పు గోదావరిలో మరో ఇద్దరిని ఈ విధంగా ప్రసాదం పేరుతో హతమార్చినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. 

కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన వల్లభనేని ఉమామహేశ్వరరావును రైస్ పుల్లింగ్ కాయిన్ పేరు 2018 మార్చి రెండవ తేదీన సైనేడ్ ఇచ్చి హత్య చేసి నాలుగు లక్షలు దోచుకున్నాడు ఈ కిలాడీ. మళ్లీ  అదే సంవత్సరం మర్రిబందం గ్రామానికి చెందిన పులుపు తవిటయ్యను చంపి ఎనిమిది లక్షల దోచుకున్నాడు. అదే నెలలో ఆగిరిపల్లికి చెందిన గండికోట భాస్కర్ రావును హత్య చేసి లక్షా 70 వేలు దోచుకున్నాడు. ఇక అదే నెలలో గన్నవరం ముస్తాబాద్ కు చెందిన కడియం బాలా వెంకటేశ్వరరావును హత్య చేసి రెండు లక్షల 90 వేలు కాజేశాడు. ఏప్రిల్ మాసంలో పశ్చిమగోదావరి జిల్లా వంగాయగూడెంలో మణికంఠ అనే ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్న చోడవరపు సూర్యనారాయణ ను హత్య చేసి అయిదు లక్షలు దోచుకున్నాడు.

అదే మాసంలో తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపు పట్నంలోని ఆశ్రమానికి చెందిన  శ్రీశ్రీ రామకృష్ణానంద స్వామీజీని ఆయుర్వేద మందు పేరుతో సైనేడ్ ఇచ్చి హత్య చేశాడు. ఆ తర్వాత పెద్ద ఎత్తున బంగారం, నగదు దొంగిలించాడు. ఇక డిసెంబర్ నెలలో రాజమండ్రిలో కిల్లర్ సింహాద్రి బంధువు కొత్తపల్లి రాఘవమ్మను హత్య చేసి బంగారం కాజేశాడు. ఇక ఈ ఏడాది జనవరిలో బొమ్మూరు కు చెందిన సామంతకుర్తి నాగమణిని హత్యచేసి అయిదు లక్షల నగదు, బంగారం ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత సెప్టెంబరు మాసంలో ఏలూరు హనుమాన్ నగర్ లో అద్దెకు ఉంటున్న రావులమ్మను హత్య చేసి బంగారం, వెండి వస్తువులు తీసుకెళ్లాడు. చివరిగా అక్టోబర్ మాసంలో వట్లూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన కాటి నాగరాజును హత్యచేసి రెండులక్షలు నగదు దోచేశాడు. 

నాగరాజు మాస్టారు చేతిలో ఎంతో మంది శిక్షణ పొందిన వారు పోలీసుశాఖలో ఉండటంతో వారు ఈ కేసుపై అన్నికోణాల్లో తమదైన శైలిలో సహకారాన్ని అందించారు. దీంతో కిల్లర్ సింహాద్రి నేరాలు అన్నీ బయటకు వచ్చాయి. రంగురాళ్లు, గుప్తనిధుల పేరుతో పలు ప్రాంతాల్లో మోసాలకు పాల్పడాడు. జనం నుంచి 28 లక్షల రూపాయలకు పైగా కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. సింహాద్రితో పాటు సైనేడ్‌ సరఫరా చేసిన షేక్‌ అమీనుల్లాను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. సింహాద్రి నుంచి సైనేడ్‌, 23 కాసుల బంగారం, లక్షా 63 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సింహాద్రి తన బంధువులు, కుటుంబసభ్యులనూ హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. 

పది హత్యలు జరిగినా పోలీసులకు కనీసం నిఘా వర్గాల నుండి చిన్న చప్పుడు కూడా వినపడలేదు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో నివాసం ఉంటూ కిల్లర్.. టార్గెట్ చేసిన ప్రతి వ్యక్తిని హత్య చేసాడు. పురుషులు, మహిళలు, స్వామిలు అనే బేధం లేకుండా వారిని హత్య చేయడం వారి వద్ద నుండి బంగారం. నగదు దోచుకోవడం చేసేవాడు. ఇంత చేసి ఒక పెద్ద భవంతి నిర్మాణం చేసాడు. పనీ పాట లేనోడు ఇంత పెద్ద భవంతి ఎలా నిర్మాణం చేసాడన్న కనీస సమాచారం కూడా పోలీసులు కూడా తెలుసుకోలేకపోయారు.

Image result for nagaraju serial killer