Wednesday, October 16, 2019
Follow Us on :

కుమారస్వామి సంచలన నిర్ణయం…కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్‌…!

By BhaaratToday | Published On Aug 3rd, 2019

- రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానన్న కుమారస్వామి
- అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను
- అనుకోకుండా ముఖ్యమంత్రినయ్యా..
- కర్ణాటక రాజకీయాల్లో హట్ టాపిగ్గా మారిన కుమారస్వామి నిర్ణయం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు వ్యాఖ్యానించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని.. అనుకోకుండానే ముఖ్యమంత్రిని అయ్యానని ఆయన వ్యాఖ్యానించారు. రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆ భగవంతుడు కల్పించాడని, ఎవరినో సంతృప్తిపరిచేందుకు తాను రాజకీయాల్లో లేనని స్పష్టం చేశారు. తాను సీఎంగా పనిచేసిన 14నెలలు ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసమే పనిచేశానని పేర్కొన్నారు. 

ప్రస్తుత రాజకీయాలు ఎటువైపు పోతున్నాయో తాను గమనిస్తున్నానని, రాజకీయాలు మంచి వాళ్ల కోసం కాదని.. రాజకీయాలు కుల సమీకరణాలతో కూడుకున్నవని కుమారస్వామి వ్యాఖ్యానించారు. ఆ కులాల రొంపిలోకి తన కుటుంబాన్ని లాగొద్దన్నారు. తాను ప్రశాంత జీవనాన్ని గడపాలనకుంటున్నానని.. అందువల్లే రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు కుమారస్వామి వెల్లడించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు మంచే చేశానని, ప్రజల గుండెల్లో తనకూ కొంత చోటు ఉండాలని కోరుకుంటున్నట్లు అన్నారు. అయితే రాజకీయాలకు స్వస్తి పలకాలని కుమారస్వామి తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.