Sunday, December 15, 2019
Follow Us on :

వైసీపీ నేత తోట వాణి బీజేపీలో చేరబోతున్నారా.. సమాధానం ఇదే

By BhaaratToday | Published On Jul 16th, 2019

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన వైసీపీ నేత తోట వాణి బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు చర్చ జరుగుతోంది. ఎంపీ సుజనా చౌదరి ద్వారా బీజేపీలో చేరేందుకు ఆమె నిర్ణయించుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. 

ఈ వార్తలపై ఆమె స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు. తనకు సీఎం జగన్ పై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తే, వాటిని నిర్వహిస్తానని, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆమె పెద్దాపురం నుంచి పోటీ చేసి నిమ్మకాయల చినరాజప్ప  చేతిలో ఓటమి పాలయ్యారు. 

ఆంధ్రప్రదేశ్ లో బలమైన పార్టీగా మారడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది.. ఆ దిశగా ఇప్పటికే పావులు కదుపుతోంది. ఇప్పటికే పలువురు నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు రాబోతున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.