Saturday, October 19, 2019
Follow Us on :

ఆ మూడు అవకాశాలు ఆస్ట్రేలియా కొంపముంచాయి.. ఘోర తప్పిదం చేసిన ఆసీస్ ఆటగాళ్లు..!

By BhaaratToday | Published On Jan 18th, 2019

మూడో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ధోని ఆడిన మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ భారత్ కు విజయాన్ని అందించింది. అయితే ధోని ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడడానికి అవకాశాలు ఇచ్చింది ఆసీస్ ఆటగాళ్లే..! ఎందుకంటే ముచ్చటగా మూడు అవకాశాలు మహేంద్రుడికి ఆసీస్ ఆటగాళ్లు ఇచ్చారు. 

ధోని ఆడిన మొదటి బంతికే పాయింట్ లో ఫీల్డర్ గ్లెన్ మాక్స్ వెల్ కు క్యాచ్ ఇచ్చాడు. సమకాలీక క్రికెటర్లలో బెస్ట్ ఫీల్డర్ మాక్స్ వెల్ చాలా సులువైన క్యాచ్ ను వదిలేశాడు. ఇక ఆ తర్వాత ధోని సింగిల్స్, డబుల్స్, ఫోర్లతో రెచ్చిపోయాడు. మ్యాచ్ బాగా రసపట్టులో ఉన్న దశలో కూడా ధోనికి ఓ అవకాశం ఇచ్చారు ఆసీస్ ఫీల్డర్లు. ధోని 74 పరుగులతో ఉన్న సమయంలో మిడ్ ఆఫ్ లోకి బలంగా బంతిని బాదాడు. అయితే దాన్ని అందుకోవడంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ విఫలమయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు 47 ఓవర్లకు 204 పరుగులు మాత్రమే. అదే క్యాచ్ పట్టి ఉండి ఉంటే ఆసీస్ మ్యాచ్ పై పట్టు బిగించే అవకాశం ఉండేది. 

ఇక ఈ రెండు క్యాచ్ లు మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఘోర తప్పిదం ఒకటి చేశారు. ధోని కీపర్ క్యాచ్ అవుట్ అయినా కనీసం అప్పీల్ చేయలేదు. భారత్ 128 బంతుల్లో 122 పరుగులు చేయాల్సిన దశలో ఫాస్ట్ బౌలర్ పీటర్ సిడిల్ విసిరిన బంతిని బాదడానికి ధోనీ క్రీజు వెలుపలికి వచ్చాడు. కానీ.. బ్యాట్ అంచున తాకిన బంతి నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. బౌలర్‌తో పాటు వికెట్ కీపర్, సమీపంలోని ఫీల్డర్లు నామ మాత్రంగానే  అప్పీల్ చేయడంతో అంపైర్ స్పందించలేదు. పలుమార్లు రీప్లే చూడగా బంతి బ్యాట్ ను తాకినట్లు స్పష్టం అయింది. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది.