Thursday, October 17, 2019
Follow Us on :

శశిథరూర్ కు తీవ్ర గాయాలు..!

By BhaaratToday | Published On Apr 15th, 2019

కాంగ్రెస్‌ ఎంపి శశిథరూర్‌ తలకు తీవ్ర గాయాలు అయిన విషయం కాంగ్రెస్ వర్గాలను కలవరానికి గురిచేసింది. ఆయనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇంతకూ ఆయనకు ఈ ప్రమాదం జరగడానికి కారణం తులాభారం సందర్భంగా జరిగిన ప్రమాదమే..!  

తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి శశిథరూర్‌ పోటీ చేస్తున్నారు. ఈరోజు ఉదయం గాంధారి అమ్మన్‌ కోవిల్‌ ఆలయంలో తులాభారం నిర్వహించారు. కేరళలో విషు పర్వదినం సందర్భంగా ఆయన ఆలయానికి వెళ్లారు. అమ్మవారికి అరటి పండ్లతో తులాభారం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తక్కెడలో ఓ వైపు అరటిపండ్లు ఉంచారు. మరోవైపు శశిథరూర్ కూర్చున్నారు. తక్కెడ పైకి లేచిన వెంటనే.. ఇనుప కమ్మీ విరిగిపోయింది. తక్కెడ పైభాగంలో ఉండే ఇనుప కడ్డీ నేరుగా శశిథరూర్ పై పడటంతో తలపై తీవ్ర రక్తస్రావమైంది. ఆ ఇనుప కడ్డీ బరువు సుమారు ఎనిమిది కేజీల వరకు ఉంటుందట. దీంతో  హుటాహుటిన ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తలకు ఆరు కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు.