Saturday, August 24, 2019
Follow Us on :

బ్రిటీషు వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు

By BhaaratToday | Published On Feb 27th, 2019

»  బ్రిటీష‌ర్ల‌తో వీరోచితంగా పోరాడి అమ‌రుడైన ఆజాద్‌
»  నేడు చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ వ‌ర్థంతి

దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన వీరుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌. భగత్‌ సింగ్‌, రాజగురు, సుఖదేవ్‌ సహచరుడిగా బ్రిటీషు వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆజాద్‌ పూర్తి పేరు చంద్రశేఖర సీతారామ్‌ తివారి. 1906 జులై 23న మధ్యప్రదేశ్‌లో భావ్రా గ్రామంలో జన్మించాడు. తండ్రి పండిట్‌ సీతారాం తివారి. తల్లి జగరాణీ దేవి. బాల్యం నుండే ఆజాద్‌ విలువిద్య, తుపాకీతో కాల్చడం వంటివి నేర్చుకోవడంపై ఆసక్తి కనబర్చేవాడు. సొంత ఊళ్లోనే చిన్న నౌకరీ చేసుకునే ఆజాద్‌ ఒకసారి బొంబాయి వెళ్లాడు. అక్కడ కార్మికులతో మమేకమై ఉండ‌డటం వల్ల వారి స్థితిగతుల గురించి చక్కటి అవగాహన ఉండేది. గ్రామంలో ఉన్నప్పుడే గిరిజనుల, రైతుల జీవితాలను లోతుగా అధ్యయనం చేశాడు.

ఆయన ఉద్యమ ప్రస్థానంలో రహస్య సంస్థ నియమ నిబంధనలకు ఇతరులు బద్ధులై ఉండాలని కోరుకునేవాడు. ముందుగా తానే వాటిని పూర్తిగా పాటించేవాడు. పార్టీ గురించి అధిక ప్రసంగం చేసేవాడు కాదు. ఆజాద్‌ ధైర్యోత్సాహాలు కలిగిన యువకుడైనందువల్లే అన్ని 'యాక్షన్ల'కు ఆయనే నేతృత్వం వహించేవాడు. పైగా దీర్ఘకాలం అజ్ఞాతవాస జీవితం గడపడంలో కూడా ఆయన నేర్పరి. పలు రకాల మారు రూపాలతో అజ్ఞాతవాసం గడిపేవాడు. 

ఆజాద్‌ గురి తప్పకుండా రివాల్వర్‌ కాల్చడం గురించి ఆ రోజుల్లో కథలుగా చెప్పుకునేవారు. లాహోర్‌లో సాండర్స్‌ హత్య అనంతరం భగత్‌సింగ్‌, రాజగురు తప్పించుకు పారిపోతున్నారు. అప్పుడు పోలీసు హవల్దారు చనన్‌సింగ్‌ వారిద్దరినీ అడ్డగించడానికి ప్రయత్నించాడు. చనన్‌సింగ్‌ భగత్‌సింగ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా, తప్పని స్థితిలో అతణ్ణి పొట్టలో చొచ్చుకెళ్లేలా తుపాకీతో పేల్చాడు ఆజాద్‌. ముగ్గురి మధ్య అంత తక్కువ దూరం మాత్రమే వున్నా, గురి తప్పకుండా శత్రువునే కాల్చి చంపడం ఆజాద్‌ ఒక్కడికే చేతనైన విద్య. చనన్‌సింగ్‌ను చంపడం కర్తవ్యమవుతుంది. అయితే అనేక సందర్భాలలో అతని కుటుంబం దీనావస్థ గూర్చి ప్రస్తావిస్తూ చింతాక్రాంతుడయ్యేవాడు ఆజాద్‌. ఇది అతనిలోని మరో కోణం. ఆ తర్వాత 1921లో జరిగిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. 

ఒకసారి గంగానది ఒడ్డున వున్న ఒక సాధువు వద్ద విలువైన వజ్రం అపహరించదలచి తప్పనిసరి పరిస్థితులలో అయిష్టంగానే తోటి కామ్రేడ్లతో కలసి యాక్షన్‌లో పాల్గొన్నాడు. అయితే 20 నిమిషాల తరువాత 'ఈ యాక్షన్‌ జరగబోదు పదండి' అన్నాడు. 'ఎందుకని?' అని ఒక కామ్రేడ్‌ ప్రశ్నించాడు. 'ఈ ప్రయత్నంలో ఇద్దరి ముగ్గురి ప్రాణాలు బలిపెట్టకుండా మనం విజయం సాధించలేము. ఇంత చిన్న పనికి ప్రాణాలు తీయడం నాకిష్టం లేదు.' అని అనడంలోనే ఆయన ఔదార్యం తెలుసుకోవచ్చు.

దోపిడీ నిర్మూలన, మానవ సమానత్వం, వర్గ రహిత సమాజ స్థాపన మున్నగునవి చంద్రశేఖర్‌ ఆజాద్‌ను ముగ్ధుణ్ణి చేశాయి. పెట్టుబడిదారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించి, సోషలిజం స్థాపించడమే ఆయన జీవిత ధ్యేయం. ఒక్కొక్క కామ్రేడ్‌ ఆజాద్‌కు కంటిపాప లాంటివారు. ఒక సారి 'ఇక నేను కామ్రేడ్లను యాక్షన్స్‌కు విడివిడిగా పంపి వారిని బలి చేయను' అని దృఢంగా చెప్పాడు. పార్లమెంటు భవనం మీద బాంబుల దాడి సాగించడానికి భగత్‌సింగ్‌ను పంపడం ఆయనకు సుతరామూ ఇష్టం లేదు. భగత్‌సింగ్‌, సుఖదేవ్‌ల ఒత్తిడి కారణంగానే ఆయన ఆ నిర్ణయానికి ఒప్పుకొన్నాడు. అయితే భగత్‌సింగ్‌ను పోగొట్టుకో బోతామనే దుఃఖం ఆయన‌ను కుంగదీసింది.

చంద్రశేఖర్‌ ఆజాద్‌ మొరటు వాడని, దేన్నీ లెక్కచేయనివాడని, మొండిపట్టుదల గలవాడని కొందరు అనుకుంటారు. ఇది అసత్యం. పార్టీలో కేంద్రకమిటీ నిర్ణయాలపై ఆయనెప్పుడూ కూడా తన సొంత నిర్ణయాన్ని రుద్దడానికి ప్రయత్నించలేదు. అయితే సైన్యాధిపతి హోదాలో కార్యక్రమాలను అమలుపరచే సమయంలో చాలా కఠినంగా వ్యవహరించేవాడు. అందుకే ఆయనను 'రాతిగుండె మనిషి' అనుకొని ఉంటారు. 

ఒకానొక దశలో ఆజాద్‌ బ్రిటీష్‌ పోలీసులకు సింహస్వప్నంలా నిలిచాడు. 1931, ఫిబ్రవరి 27వ తేదీన తన ఇద్దరు సహచరులను కలిసేందుకు అలహాబాద్‌లోని ఆల్ఫ్రెడ్‌ పార్క్‌కు చేరుకోగా, ఇన్ఫార్మర్లు ఇచ్చిన సమాచారం మేరకు బ్రిటీష్‌ పోలీసులు చుట్టుముట్టారు. ఆజాద్‌ను లొంగిపోవాలంటూ హెచ్చరికలు చేశారు. అయినా కూడా పోలీసులకు లొంగకుండా, ఒక్కడే పోరాడుతూ ముగ్గురు పోలీసులను హతమార్చాడు. అలసిపోయేదాకా పోరాడిన ఆయన చివరి క్షణంలో తన వద్ద మిగిలిన ఒకే ఒక్క బుల్లెట్‌తో తనను తానే కాల్చుకుని అసువులు బాశాడు. ఇటువంటి ఎందరో వీరుల బలిదానం, పోరాట ఫలితమే నేటి మన స్వతంత్ర భారతదేశం.