Friday, July 19, 2019
Follow Us on :

మరులుగొలిపే రామప్ప శిల్పాలు.. మనసుని మార్దవంగా తడిమే జ‌ల‌పాతాలు

By BhaaratToday | Published On Jan 25th, 2019

17వ శతాబ్దంలో ఇటాలియన్ యాత్రికుడు టావెర్నియర్ హైదరాబాద్‌లో పర్యటించి ఇక్కడి ఉద్యానవనాలకు, సరస్సుల శోభకు ముగ్దడయ్యాడు. నాటి నుంచి నేటి వరకు హైదరాబాద్ అందం రెట్టింపయ్యేందే కానీ, ద‌గ్గ‌ర‌లేదు. అంతర్జాతీయంగా ఎప్పుడు సర్వే చేసినా.. సాహో హైదరాబాద్ అనాల్సిందే. ఎన్నో అంతర్జాతీయ సదస్సులకు, పండుగలకు, సాహితీ సభలకు హైదరాబాద్ వేదికైంది. ఈమధ్యనే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఆకాశంలో హరివిల్లును సాక్షాత్కరింపజేసింది. టూరిజం రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్న నేపథ్యంలో జ‌న‌వ‌రి 25న (నేడు) జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా భార‌త్ టుడే ప్ర‌త్యేక క‌థ‌నం.

చార్మినార్ :
ప్రపంచంలో ఏ కట్టడమూ దీనంత ఫోటోజెనిక్ కాదు. సాలార్జంగ్ మ్యూజియం.. ఎప్పుడు సందర్శించినా చరిత్రను కొత్తగా కళ్లముందు నిలబెడుతుంది. గోల్కొండ సౌండ్ అండ్ లైట్ షో.. ఎన్నిసార్లు చూసినా తనివితీరదు. హన్మకొండ వేయిస్తంభాల గుడి..రాతిస్తంభాల్లో శబ్దనాదాలు వేయిభావాలు రేకెత్తించేలా ఉంటాయి. లక్నవరం చెరువు.. కళ్లలో సముద్రాన్ని ఒంపుకున్న భావన కలుగుతుంది. మరులుగొలిపే రామప్ప శిల్పాలు.. మనసుని మార్దవంగా తడిమే కుంటాల, పొచ్చర జలపాతాలు. ఈమధ్యే వెలుగులోకి వచ్చిన మల్లూరు గుట్టలు.. పాండవుల గుహలు.. భద్రాద్రి, యాదాద్రి, బాసర, వేములవాడ, కాళేశ్వరం లాంటి పుణ్యక్షేత్రాలు.. నాగార్జునసాగర్, జూరాల, మానేరు, ఎస్సారెస్పీ, కిన్నెరసాని లాంటి ప్రాజెక్టులు.. ఇలా ఒకట రెండా తెలంగాణ యాత్రాస్థలాలు, దర్శనీయ ప్రదేశాలు కోకొల్లలు. అందుకే టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది సర్కారు.

చారిత్రక కట్టడాలకు గుర్తింపునిస్తూనే, తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాన్ని, ఆత్మను, బాహ్యసౌందర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలన్న ఉద్దేశంతో.. గతంలో కంటే ఎక్కువ బడ్జెట్ కేటాయించింది. ఈ మధ్యనే అసిఫాబాద్ దగ్గర సప్తహాం పేరుతో ఏడు వరుస జలపాతాలు బయటపడ్డాయి. ఏటా పర్యాటకుల తాకిడి 20 నుంచి 25 శాతం పెరుగుతోంది. ముఖ్యంగా విదేశీ టూరిస్టులను ఆకర్షించడానికి అడ్వెంచర్ టూరిజానికి పెద్దపీట వేస్తున్నారు. 

బుద్ధుడు బతికున్నప్పుడే ఇక్కడ బుద్ధిజం మొదలైందని బాహ్య ప్రపంచానికి చెప్పబోతోంది సర్కారు. ఆ నేపథ్యంలోనే త్వరలో వరల్డ్ బుద్దిజం సదస్సు ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. భారతదేశాన్నంతా ఒక నగరంలో చూడాలంటే హైదరాబాద్‌కు రండి.. భారతదేశాన్నంతా ఒక రాష్ట్రంలో చూడాలంటే తెలంగాణకు రండి.. ఇదే నినాదంతో ముందుకు పోతోంది టూరిజం శాఖ.

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అద్భుత చరిత్ర, పురాతన కట్టడాలు, చారిత్రక ఆనవాలు, శతాబ్ధాల చరిత్ర, జీవనదులు ఉన్నా పర్యాటకంగా మాత్రం అభివృద్ధి చెందలేదు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో అద్భుతమైన కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. నిజామాబాద్ జిల్లాను మొదట ఇందూరు అనే పేరుతో పిలిచేవారు. ఐదో శతాబ్ధంలో ఇంద్రదత్త అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించినందున ఆయన పేరు మీద ఇందూరు అని పిలుస్తారు. ఈ జిల్లాను పూర్వకాలంలో మౌర్యులు,శాతవాహనులు, రాష్ట్రకూటులు, చాలుక్యులు, కాకతీయులు, సుల్తాన్, కుత్భుషాలు, మొగలులు పాలించేవారు. నిజం కాలంలో అప్పటి ప్రధాన మంత్రి సర్ సారాల్ జంగ్ 1876లో ఇందూరును నిజాం పేరుమీద జిల్లాగా ప్రకటించారు. నిజాంపేరు మీద నిజామాబాద్ జిల్లాను ప్రకటించారు. 

కంఠేశ్వరాలయం…
నిజామాబాద్ జిల్లాలోని కంఠేశ్వరాలయాకి చాలా చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని శతవాహనుల రాజు రెండవ శాతకర్ణి కట్టించారు. ప్రముఖ శివాలయంగా అప్పటి నుంచి ఈ ఆలయం కొనసాగుతోంది. ఈ గుడి గోపురం ఉత్తరాధి రాష్ట్రాలలో నిర్మించే ఆలయాల కట్టడాలను పోలి ఉంటుంది. రథ సప్తమి రోజు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు.

డిచ్ పల్లి రామాలయం… 
నిజామాబాద్- హైదరాబాద్ రహదారిలో డిచ్ పల్లి రామాలయం ఉంది. ఈ ఆలయాన్ని తెల్ల, నల్లని రాళ్లతో 17వ శతాబ్ధంలో నిర్మించారు. దక్షిణాధిరాష్ట్రాల శిల్పకళను పోలి ఈ ఆలయ నిర్మాణం ఉంటుంది. గుట్టపై ఉన్న ఈ ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది. 

ఖిల్లా రామాలయం…
ఖిల్లా రామాలయాన్ని 10వ శతాబ్ధంలో రాష్ట్రకూటులు నిర్మించారు. వారి విజయానికి భిన్నంగా ఈ ఆలయాన్ని నిర్మించారట. ఆ తర్వాత అల్లాఉద్దీన్ ఖిల్జీ 13వ శతాబ్ధంలో దండయాత్ర చేసి ఇందూరును ఆక్రమించుకున్నాడని చరిత్ర చెబుతోంది. ఆయన నుంచి తర్వాత బ్రాహ్మణీసుల్తాన్ లు, కుత్బుషాహీ సుల్తాన్లకు వెళ్లింది. వారి పరిపాలన అనంతరం అసాజ్ జాహీచేతుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం ఉన్న ఆలయం చుట్టూ ఉన్న కట్టడాలన్నీ వారి కాలంలోనే శిల్పకళను పోలి ఉంటుంది. 

దోమకొండ కోట…
కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండల కేంద్రంగా ఈ కోట ఉంది. జాతీయ రహదారికి ఐదు కిలోమీటర్ల దూరంలో కోటను రెడ్డి రాజులు నిర్మించారు. 18వ శతాబ్ధంలో ఈ కోట నిర్మాణం చేశారు. ఈ కోటను అస్బాజాహీ వంశస్థుల శిల్పకళ నైపుణ్యాన్ని పోలి ఉంటుంది. 

బడాపహాడ్…
వర్ని మండలం చందూరు గుట్టపైన బడాపహాడ్ ఉంది. సయ్యద్ షాదుల్లా హుస్సేనీ ఈ గుట్టపై వెలిశాడని జాతర నిర్వహిస్తుంటారు. ప్రతి శుక్ర, ఆదివారాల్లో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. 

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు…
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు.ఈ ప్రాజెక్టు నుంచి వరంగల్ వరకు తాగు,సాగునీరు అందుతుంది. గోదావరి నదిపై పోచంపాడ్ వద్ద నిర్మించిన ఈ ప్రాజెక్టుకు వేలాది మంది పర్యాటకులు వస్తారు. 

నిజాంసాగర్ ప్రాజెక్టు…
మంజీరా నదిపై నిజాంసాగర్ వద్ద అప్పటి నిజాం ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు రాజధాని నుంచే కాక మహరాష్ట్ర నుంచి ప్రర్యాట‌కులు  వస్తుంటారు. 

పోచారం ప్రాజెక్టు…
కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలో పోచారం ప్రాజెక్టు ఉంది. మెదక్ జిల్లాను ఆనుకుని ఉన్న ఈ ప్రాజెక్టును ఆనుకుని అభయ ఆరణ్యం, పార్కు ఉంది. మెదక్ దగ్గరగా ఉన్న ఈ పార్కుకు ఈ రెండు జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి సందర్శకులు వస్తుంటారు.

ఆలీసాగర్…
ఎడపల్లి మండలం ఆలీసాగర్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టును ఆనుకుని పార్కు ఉంది. నిజామాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఈ పార్కుకు సందర్శకులు వస్తుంటారు. 

‘కౌలాన్ ఖిల్లా’
కామారెడ్డి జిల్లాలో ఉన్నచారిత్రక సంపదకు రక్షణ కరువైంది. దశాబ్దాల చరిత్ర కలిగిన అనేక కట్టడాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. జిల్లాలోని జుక్కల్ మండలం కౌలాస్ కోట శిథిలావస్థ దశలో ఉంది. అత్యంత పురాతన చరిత్ర ఉన్న ఈ కోటను పరిరక్షించాల్సి ఉంది.

కోట చరిత్ర
జుక్కల్ మండలం కౌలాస్ గ్రామం వద్ద 1544లో కౌలాస్ ఖిల్లాను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. బాల్ ఘాట్ పర్వతాలలో కౌలాస్ అనే మహముని తపస్సు చేసినట్లు చరిత్రకారుల కథనం. ఇదిరాష్ట్ర కూటులు, కాకతీయుల కాలంలో నిర్మించినట్లు పెద్దలు చెబుతున్నారు. మహ్మద్ బిన్ తుగ్లక్ పాలనలో కూడా ఈ కోట ప్రసిద్ధి చెందింది. కాకతీయులపై అల్లా ఉద్దీన్ ఖీల్జి దండయాత్ర చేసిన తర్వాత నాలుగు భాగాలుగా విభజించబడి బహుమణి రాజ్యంలో ఇందూరు, కౌలాస్ ఖిల్లాలు ఉన్నాయి. కుతుబ్ షాహి రాజ్యంలో కౌలాస్ సర్కార్ గా పేరు గడించింది. మహారాష్ట్ర్ట లోని నాందేడ్, ఖందార్,ముఖేడ్, బాన్సువాడ, బిచ్కుంద ప్రాంతాలు కౌలాస్ రాజ్యం ఆధీనంలో కొనసాగాయి. నాలుగవ రాష్ట్ర కూట రాజు గోవిందుని కాలంలో కౌలాస్ ప్రాంతం గొప్ప సంస్కృతి కేంద్రంగా కొనసాగినట్లు తెలుస్తోంది. కౌలాస్ ఖిల్లాను కేంద్రంగా చేసుకుని పరిపాలించిన రాజుల కాలంలో ఈ ఖిల్లా అనేక యుద్ధాలకు సాక్షిగా నిలిచింది. 1987 లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కౌలాస్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజా దీప్ సింగ్ ఉద్యమంలో పాల్గొన్నట్లు చెబుతారు. మహారాష్ట్ర్ట, కర్నాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ కోటను చూడడానికి అనేక మంది పర్యాటకులు వస్తుంటారు.

అత్యంత విలువైన శిల్ప సంపద…
ప్రస్తుతం కౌలాస్ ఖిల్లా ఆదరణ కరువై శిథిలావస్థలో ఉంది. వారసత్వంగా వస్తున్న చరిత్రక ప్ర‌దేశాల‌ను పరిరక్షించే చర్యలు చేపట్టకపోవడంతో విలువైన శిల్పసంపద కనుమరుగవుతోంది. ఖిల్లా లోపలిభాగంలో అత్యంత నైపుణ్యంతో నిరమించిన రాతికట్టడాలు చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. వెంకటేశ్వర మందిరం, రామమందిరం, దుర్గామాత మందిరాలు రాతితో నిర్మించారు. ప్రతిమందిరం వద్ద దిగుడు బావులతోపాటు ఏనుగులు స్నానాలు చేసేందుకు పెద్ద బావులను నిర్మించారు. ఎంతో నైపుణ్యంతో నిర్మించిన మందిరాల చుట్టూ ముళ్ల పొదలుమొలచి మందిరాలు ధ్వంసం అవుతున్నాయి. ధాన్యాగారం, స్నానపు గదులు,రాణి గారిపట్టే మంచం తదితర కట్టడాలు కూలిపోతున్నాయి.

మాయమైన ఫిరంగులు…
పంచలోహాలతో తయారు చేసిన అనేక ఫిరంగులు దొంగల పాలయ్యాయి. వీటిలోపల బంగారం ఉందనే నమ్మకంతో ఎత్తుకెళ్లి ఉంటారని స్థానికులు తెలుపుతున్నారు. ఎక్కువ బరువుతో కూడిన కొన్ని ఫిరంగులు కోట లోపల ఉ న్నాయి. అత్యంత ప్రాచీన చరిత్రకలిగిన కౌలాస్ ఖిల్లా ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కొందరు పురావస్తు శాఖ అధికారులు కోటను సందర్శించారు. గతంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా పని చేసిన అశోక్ కుమార్ కోటను సందర్శించి పర్యాటక ప్రదేశంగా మార్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మరి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతారో లేదో వేచి చూడాల్సిందే.