Saturday, August 24, 2019
Follow Us on :

భారత్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాక్

By BhaaratToday | Published On Mar 8th, 2019

మొన్నటిదాకా చైనాతో కయ్యం. ఇప్పుడు భారత్ తో వాణిజ్య యుద్ధం. జి.ఎస్.పి. రద్దు చేస్తామంటూ రంకెలేస్తున్న ట్రంప్. ఆందోళనలో పారిశ్రామిక వర్గాలు. ప్రాధాన్యత హోదా తీసేస్తే పన్ను ప్రయోజనాలపై ప్రభావమెంత..? ఎగుమతులపై మనం కోల్పోయే ధనమెంత..? పారిశ్రామికవేత్తలకు నష్టమెంత..?  ఇదే భార‌త్ టుడే స్పెష‌ల్ స్టోరీ.

భారతీయులకు అమెరికా అంటే ఓ రంగుల కల. విద్యా, ఉద్యోగాల పరంగానే కాకుండా వాణిజ్యపరంగాను భారత్ కు అమెరికా ప్రధాన భాగస్వామిగా ఉంటోంది. అందుకే మన మేధోసంపత్తి అంతా అగ్రరాజ్యానికే క్యూకడుతోంది. అందుకు తగిన విధంగా.. అమెరికా కూడా దౌత్యపరంగా, వాణిజ్య పరంగా భారత్ తో సత్సంబంధాలనే కొనసాగిస్తోంది. కానీ, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తున్నారు. మొన్నటికి మొన్న హెచ్1బి వీసాల విషయంలో భారత్ షాకిచ్చిన ట్రంప్.. ఇప్పుడు జి.ఎస్.పి. రద్దు దిశగా అడుగులు వేస్తున్నారు. భారత్ కు ప్రాధాన్యతా హోదా తొలగించాలనే నిర్ణయం.. దాదాపు 50 ఏళ్లుగా కొనసాగుతున్న రెండు దేశాల వాణిజ్య సంబంధాల్లో ఇది పెనుమార్పు అని చెప్పకతప్పదు. చైనాతో వాణిజ్యం విషయంలో కఠిన వైఖరి అవలంబించిన ట్రంప్.. ఇప్పుడు భారత్ తో కూడా అదే రీతిలో ప్రవర్తిస్తున్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడి వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జి.ఎస్.పి. రద్దుతో పెద్దగా నష్టపోయేదేమీ ఉండదని భారత్ ఘంటాపథంగా చెబుతోంది.

అమెరికాలో సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ 1970లో ప్రారంభమైంది. ప్రపంచ బ్యాంకు డాటా ప్రకారం ఈ వ్యవస్థ కింద 120 దేశాలు లబ్దిపొందుతున్నాయి. వీటిలో అత్యధిక ప్రయోజనం పొందుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. గత 50 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వాణిజ్య బంధానికి ట్రంప్ తూట్లు పొడుస్తున్నారు. ఇంతకీ జి.ఎస్.పి. ని రద్దు చేయాలన్న నిర్ణయానికి అమెరికా ఎందుకు వచ్చింది..? ఇలాంటి కఠిన నిర్ణయం వెనుక కారణమేంటి..?

వాణిజ్య హోదాకు ట్రంప్ తూట్లు :
భారత్ ఎగుమతి చేసే వస్తువులపై అత్యధిక సుంకాలు విధిస్తామని చెప్పిన కొన్ని గంటలకే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో సంచలన ప్రకటన చేశారు. భారత్‌ కు ప్రాధాన్యత హోదాను తొలగించే యోచనలో అమెరికా ఉన్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు ఎలాంటి సుంకాలు లేకుండా భారత్ కొన్ని వస్తువులను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. కానీ, రాబోయే రోజుల్లో భారత్‌కు అలాంటి సౌలభ్యం ఉండదని ట్రంప్ తేల్చేశారు. అంతేకాదు, భారత్‌కు ఇస్తున్న ప్రాధాన్యత వాణిజ్య హోదాను కూడా తొలగించాలని ట్రంప్ ప్రకటించారు. పన్నుల్లేకుండా భారత ఉత్పత్తులు అమెరికాలోకి రావడాన్ని అడ్డుకుంటానని ట్రంప్‌ తెలిపారు. ఈ విషయంపై యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యులకు ట్రంప్‌ లేఖ ద్వారా తెలియజేశారు. ట్రంప్ చర్య వల్ల భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశముందంటున్నారు విదేశాంగ నిపుణులు. అమెరికా మార్కెట్లలో భారత్‌కు కొన్ని వెసులుబాట్లు కల్పించామని.. అదే విధంగా భారత మార్కెట్లలోనూ అమెరికాకు అలాంటి సదుపాయాలు కల్పించాలని కోరామని ట్రంప్ లేఖలో పేర్కొన్నారు. కానీ, భారత్‌ దానిపై ఖచ్చితమైన హామీ ఇవ్వలేదని.. అందుకే భారత్‌ కు ప్రాధాన్యత వాణిజ్య హోదాను తొలగించాలని అనుకుంటున్నట్టు లేఖలో స్పష్టం చేశారు. ఇదే జరిగితే ఇక నుంచి భారత్‌ నుంచి ఎగుమతి చేసే అన్ని వస్తువులపై అమెరికా సుంకాలు విధిస్తుంది. దీని వల్ల దేశానికి భారీ నష్టం చేకూరే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. భారత్‌తో పాటు టర్కీకి కూడా ఈ హోదాను ఉపసంహరించుకోవాలని ట్రంప్‌ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆదాయం కోల్పోనున్న భార‌త్‌ :
భారత్, అమెరికా మధ్యనున్న ఒప్పందాల్లో భాగంగా చాలా రకాల వస్తువులు ఎలాంటి పన్నులు లేకుండా అమెరికన్ మార్కెట్ లో విక్రయిస్తున్నాము. మన దేశం నుంచి 3 వేల 7వందల వస్తువులు యూఎస్ కు ఎగుమతి చేస్తుండగా.. వీటిలో 1784 వస్తువులకు ఎలాంటి సుంకం లేకుండా పంపిస్తున్నాం. భారత్ ఏటా 5.6 మిలియన్ డాలర్ల విలువైన వస్తులను ఎగుమతి చేస్తోంది భారత్. దీంతో మనకు ప్రతియేటా 190 మిలియన్ డాలర్ల లబ్ది చేకూరుతోంది. ఇప్పుడు ప్రధాన్యత హోదా తొలగిస్తే.. ఈ ఆదాయాన్ని భారత్ కోల్పోతుంది. భారత్ తో వాణిజ్యం విషయంలో ట్రంప్ ఇలా కఠిన వైఖరి ప్రదర్శిస్తుండటం వెనుక చాలా కారణాలున్నాయి. ట్రంప్ కు వ్యక్తిగతంగా చికాకు కలిగించిన హార్లే డేవిడ్ సన్ మోటారు సైకిళ్ళపై అధిక సుంకం విధింపు మొదలు, రబ్బర్, వస్త్రాలు, ఆల్కాహాల్ ఉత్పత్తులపై వాణిజ్యపరమైన ఆంక్షలు ఇలా అనేక విషయాలను ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. భారతదేశంతో వాణిజ్య సంబంధాలను సమీక్షించడం, చివరకు ప్రత్యేక ప్రాధాన్యతల నుంచి తొలగించడం వెనుక అమెరికాకు చెందిన రెండు లాబీలు బలంగా పనిచేసినట్టు తెలుస్తోంది. ఒకటి వైద్యపరికరాల పరిశ్రమ, రెండవది డైరీ ఉత్పత్తుల సంఘం భారతదేశం వాణిజ్యపరంగా కఠినమైన ఆంక్షలు విధిస్తున్నదని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే ప్రతిచర్యగా ప్రత్యేక ప్రాధాన్యతల హోదా తొలగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చాయి.

మెడిక‌ల్ టెక్నాల‌జీ విష‌యంపై :
అక్టోబర్ 2017లో అడ్వాన్స్ మెడికల్ టెక్నాలజీ అసోసియేషన్ ఈ విషయమై అమెరికా వాణిజ్య ప్రతినిధులకు ఈ విషయమై ఫిర్యాదు చేసింది. అబ్బోట్, మెడ్ ట్రానిక్స్ వంటి భారీ పరిశ్రమలున్న అసోసియేషన్ ఇది. ఈ కంపెనీల అసంతృప్తికి కారణమేమంటే, ఇటీవల భారతదేశం గుండెజబ్బులకు వాడే స్టెంటులను, మోకాలి చిప్పల మార్పిడికి వాడే ఇంప్లాంటులను చవగ్గా దొరికేలా ధరలను తగ్గించింది. ఈ నిర్ణయం అమెరికా కంపెనీలకు నచ్చడం లేదు. అలాగే భారత్ వైఖరి అమెరికాలోని పాలఉత్పత్తి దారులకు కూడా నచ్చడం లేదు. భారతదేశం పాల దిగుమతులకు సంబంధించి కఠినమైన ఆంక్షలు పెట్టింది. పశువులకు ఎలాంటి మాంసాహార సంబంధమైన ఆహారం పెట్టకూడదని, అలాంటి పశువుల పాలే దిగుమతి చేసుకుంటామని అంటుంది. ఈ రెండు విషయాల పట్ల అమెరికా ఒత్తిడికి లొంగేది లేదని స్పష్టం చేసింది. భారత ఎగుమతి చేస్తున్న వ్యవసాయ ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు, చేతిపనుల ఉత్పత్తులపై కూడా అమెరికా నిర్ణయం ప్రభావం పడుతుంది. భారతదేశం ఎగుమతి చేసే వస్తువుల్లో అధికశాతం మధ్యంతర వస్తువుల తరగతిలోకి వస్తాయి. అంటే తక్కువ ఉత్పాదక విలువ ఉండే వస్తువులు. అమెరికాలో కంపెనీలు ఈ వస్తువులను తయారు చేయవు కాబట్టి పోటీ ఉండదు. అమెరికాతో భారతదేశం చేసే వ్యాపారం చాలా భారీస్థాయిలో ఉంది. ఇందులో ప్రత్యేక ప్రాధాన్యతల ద్వారా లభించే ప్రయోజనాలు చాలా తక్కువే. కానీ, ఈ ప్రయోజనాలు కోల్పోవడం వల్ల ఇక్కడి చిన్నపరిశ్రమలు, మధ్యమస్థాయి పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

భారతదేశానికి సంబంధించి ప్రత్యేక ప్రాధాన్యతల సమీక్ష సందర్భంగా ఇక్కడి చిన్న మధ్యస్థాయి పరిశ్రమలు అమెరికా ప్రభుత్వ సబ్ కమిటీకి ఈ నిర్ణయం మార్చుకోవాలని విజ్ఞప్తులు పంపాయి. ఆటో విడిభాగాలు మొదలు వస్త్రాలు వగైరా అనేక ఉత్పత్తులు చేసే ఈ పరిశ్రమల వాదన ప్రకారం భారతదేశానికి ఈ హోదా తొలగిస్తే చైనా కంపెనీలు ప్రయోజనం పొందుతాయి. అమెరికాకు, భారత్ కు మధ్య వాణిజ్య వివాదాల నేపథ్యంలో ఈ నిర్ణయం వచ్చింది. 2018లో ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా సుంకం పెంచింది. దానికి జవాబుగా భారత్ కూడా కొన్ని అమెరికా వస్తువులపై సుంకం పెంచింది. అయితే పెంచిన సుంకాలను అమలు చేయడంలో ఆలస్యం జరిగింది. అమెరికా అసలు సమస్య రెండు దేశాల మధ్య వాణిజ్యలోటు 20 బిలియన్ డాలర్లుండడం. ఈ లోటును పూరించుకునే వరకు ట్రంప్ ఏదో ఒక సమస్యను సృష్టిస్తునే ఉంటారని నిపుణులు అంటున్నారు. అందులో భాగంగానే జి.ఎస్.పి. రద్దు కు ఉవ్విళ్లూరుతున్నట్టు తెలుస్తోంది.

భారత్ ప్రధానంగా ముడి సరుకులు, ఆర్గానిక్ కెమికల్స్ వంటి ఇంటర్మీడియేట్ గూడ్స్‌ను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. 1976 నుంచి జీఎస్‌పీ కింద అమెరికా మార్కెట్‌లో రసాయనాలు, ఇంజినీరింగ్ వంటి పలు రంగాలకు చెందిన 1,937 భారతీయ ఉత్పత్తులకు పన్ను మినహాయింపులు లభిస్తున్నాయి. జీఎస్పీ రద్దు చేస్తే భారత్ ఎగుమతి చేసే అన్ని వస్తువులపై అమెరికా ప్రభుత్వం పన్నులు విధిస్తుంది. దీంతో పారిశ్రామిక వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే జీఎస్పీ రద్దు ప్రభావం అంతగా వుండదని.. భయపడాల్సిన అవసరం లేదంటోంది భారత ప్రభుత్వం. భారత్‌కు వాణిజ్య ప్రాధాన్య హోదాను రద్దు చేస్తామన్న ట్రంప్‌ ప్రకటనపై ఇప్పటికే కేంద్రం స్పందించింది. భారత్‌-అమెరికా ప్రభుత్వాల మధ్య కుదిరిన విస్తృత ఒప్పందం నేపథ్యంలో ట్రంప్‌ ప్రకటన ప్రభావం భారత్‌ ఎగుమతులపై నామమాత్రంగానే ఉంటుందని వాణిజ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.