Thursday, December 12, 2019
Follow Us on :

పాక్ కు షాకిస్తూ వచ్చిన తీర్పుపై మోదీ స్పందించారు

By BhaaratToday | Published On Jul 18th, 2019

అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ కు ఘ‌న‌ విజయం ల‌భించింది. కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో భారత్‌కు అనుకూలంగా ఐసీజే తీర్పు ఇచ్చింది. జాదవ్‌ కేసును పునః సమీక్షించాలని పాక్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు.. జాదవ్‌కు అవకాశం ఇవ్వాలని తీర్పులో పేర్కొంది. 2016లో గూఢచర్య ఆరోపణలపై కుల్‌భూషణ్‌ను పాక్‌ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో 2017 ఏప్రిల్‌లో కుల్‌భూషణ్‌కు పాక్‌ సైనిక కోర్టు మరణశిక్ష విధించింది. దీంతో భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసులో భారత్‌కు అనుకూలంగా 15 మంది జడ్జీల తీర్పు ఇవ్వగా.. ప్రతికూలంగా ఒక జడ్జి తీర్పు ఇచ్చారు.

ఈ తీర్పుపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తీర్పును స్వాగతిస్తున్నామని, న్యాయాన్ని ప్రతిబింబించేలా ఈ తీర్పు ఉందని అన్నారు. కుల్ భూషణ్ జాదవ్ కు తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రతి భారతీయుడి సంక్షేమం తమ ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. వాస్తవాలను పరిశీలించి, సంతృప్తికరమైన తీర్పు ఇచ్చిందంటూ అంతర్జాతీయ న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు. 

గూఢచర్యం ఆరోపణలతో 2016లో జాదవ్‌ను ఇరాన్ నుంచి జాదవ్‌ను పాక్‌ ఏజంట్లు కిడ్నాప్‌ చేశారు. అనంతరం బలూచిస్థాన్లో ప్రవేశించినట్టు ప్రకటించారు.   2017 ఏప్రిల్‌లో పాకిస్థాన్‌ మిలిటరీ కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. అయితే ఇరాన్‌లో ఉంటున్న జాదవ్‌ను పాక్‌ కిడ్నాప్‌ చేసిందని భారత్‌ ఆరోపించింది. పాక్‌ విధించిన మరణశిక్షను సవాల్‌ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.