Wednesday, October 16, 2019
Follow Us on :

యోగి దెబ్బకు మాస్ కాపీయింగ్ క్లోజ్..! ఏం జరిగిందో తెలుసా..?

By BhaaratToday | Published On Feb 10th, 2019

ఉత్తరప్రదేశ్‌లో యూపీ బోర్డు పరీక్షలు‌ కొనసాగుతున్నాయి. అయితే ఈ పరీక్షలకు గైర్హాజరయ్యే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. రెండు రోజుల్లో 40 వేలకు పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకాలేదని అధికారులు తెలిపారు. పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడకుండా ఈసారి కఠిన నిబంధనలు అమలు చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. యూపీ మాధ్యమిక శిక్షా పరిషత్‌‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మొదటి రోజు పరీక్షలకు 20,674 మంది హాజరుకాలేదు. ‘రెండు రోజుల్లో మొత్తం 40,392 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాలేదు. కాపీయింగ్‌ పాల్పడకుండా కఠిన నిబంధనలు అమలు చేయడమే ఇందుకు కారణమా? అనే విషయం తెలియాల్సి ఉంది’ అని యూపీ బోర్డు కార్యదర్శి నీనా శ్రీవాత్సవ తెలిపారు. గతేడాది మొత్తం అభ్యర్థుల్లో 10,44,619 విద్యార్థులు హాజరు కాలేదు. ఈ ఏడాది కూడా కఠిన నిబంధనలు అమలు చేయడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. కాపీయింగ్‌ మాఫియాను నిరోధించేందుకు తనిఖీలు విస్తృతం చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించడంతోపాటు, కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వాయిస్‌ రికార్డర్లను అమర్చామని.. ఈ సారి పరీక్షలను 16 రోజులపాటు నిర్వహిస్తున్నామని శ్రీవాత్సవ తెలిపారు. హైస్కూల్‌, ఇంటర్మిడియట్‌ పరీక్షల కోసం మొత్తం 58,06,922 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు.