Saturday, October 19, 2019
Follow Us on :

చెత్త వేయండి చాయ్ తాగండి..! కుంభమేళాలో భక్తులకు ఆఫర్..!!

By BhaaratToday | Published On Feb 7th, 2019

ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఇప్పుడో టీ వెండింగ్ మిషీన్ అందరినీ ఆకర్షిస్తోంది. కుంభమేళాకు కోట్లాదిమంది భక్తులు వస్తుండడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారకుండా, చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ఉండేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా చెత్త సేకరణ కోసం అధికారులు ఓ మెషీన్‌ను ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే అందులో చెత్తను వేసేందుకు ఎవరూ ముందుకు రారు కానీ.. అలా చెత్త వేసిన ప్రతిసారి వేడివేడిగా ఓ చాయ్ ఇస్తే.. వావ్! భలేగా ఉంటుంది కదూ.. ఇప్పుడక్కడి భక్తులు కూడా అదే అంటున్నారు. పరిశుభ్రత, పర్యావరణం పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ మెషీన్ ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది. భక్తులు తాము వాడిపడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర చెత్తా చెదారాన్ని ఆ వెండింగ్ మెషీన్‌లో వేసి చంపేస్తున్న చలిలో వెచ్చని చాయ్ తాగి వెళ్తున్నారు. ఇన్ఫ్రారెడ్ సెన్సార్ ద్వారా పనిచేసే ఈ మెషీన్ చెత్తను వేయడానికి ఉద్దేశించిన బాక్స్‌లో చెత్తను పూర్తిగా వదిలిపెట్టిన తర్వాత మాత్రమే టీ ఇస్తోంది.