Wednesday, October 16, 2019
Follow Us on :

లిక్కర్ కింగ్ రాకను ఎవరూ ఆపలేరు..! జైలు జీవితం తప్పదు..!!

By BhaaratToday | Published On Feb 5th, 2019

దేశీయ బ్యాంకుల సొమ్మును కొల్లగొట్టి విదేశాలకు పరారైపోతున్నారు కొంత మంది బడా వ్యాపారవేత్తలు. అయితే... అలాంటి వారి ఆటలు కట్టించేందుకు మోడీ సర్కార్ నడుం బిగించింది. విదేశాల్లో తలదాచుకున్న ఆర్థిక నేరగాళ్లను స్వదేశానికి రప్పించేందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తోంది. కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను అప్పగించేందుకు బ్రిటన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్‌మాల్యా త్వరలోనే భారత్ తిరిగి రానున్నాడు. మాల్యాను అప్పగించేందుకు యూకే ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన దస్త్రాలపై బ్రిటన్ హోం శాఖ కార్యదర్శి సాజిద్ జావిద్ సంతకం చేశారు.  మరోవైపు... ఈ వ్యవహారంపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి మాల్యాకు రెండు వారాల గడువు ఉంది. మాల్యా న్యాయ పోరాటానికి దిగిన పక్షంలో అతణ్ని భారత్ కు తీసుకొచ్చేందుకు మరో 7-8 నెలల సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.  ఇక మాల్యా అప్పగింతపై కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి పి.పి.చౌదరి స్పందించారు. త్వరలోనే  మాల్యాను భారత్ కు రప్పిస్తామని చెప్పారు. ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాల్లో తలదాచుకుంటున్న నేరగాళ్లను స్వదేశానికి రప్పించడంలో బీజేపీ ప్రభుత్వం చేసిన కృషి ఫలిస్తోందని అన్నారు. ఇదిలా ఉండగా... ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించిన విజయ్ మాల్యా బ్యాంకులకు సుమారు 9 వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టారు. దీంతో అతణ్ని ఆర్థిక మోసగాడిగా భారత్ పేర్కొంది. మరోవైపు... తనపై ఉన్న పరారీ ముద్రను తొలగించుకునేందుకు విజయ్ మాల్యా నానా తంటాలు పడుతున్నారు. బ్యాంకుల అప్పు తీరుస్తానన్న తన ఆఫర్లకు భారత అధికార వర్గాలను ఒప్పించడానికి విశ్వప్రయత్నాలు చేసిన మాల్యా, సుప్రీంకోర్టును ఆశ్రయించి తన పేరుకు ముందు పరారీ ముద్రను తీసేయాలని, విచారణపై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, దర్యాప్తు సంస్థల అభియోగపత్రాల ఆధారంగా ఈడీ ఆయనను పరారీలో ఉన్న ఎగవేతదారుగా నిర్ధారించింది.