
ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల ఇటీవలే ఆనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్యం కారణంగా హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయనిర్మల కన్నుమూశారు. నిన్న విజయనిర్మల సంస్మరణ సభను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సంస్మరణ సభకు కృష్ణ, నరేశ్, నమ్రత, జయసుధ, మురళీమోహన్, నందమూరి బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ, విజయనిర్మల జ్ఞాపకశక్తి అపారం అని, ఎప్పుడో పాతికేళ్లనాటి సంగతులు కూడా ఆమెకు గుర్తుండేవని అన్నారు. అయితే, అల్జీమర్స్ వ్యాధి బారినపడడంతో నిన్నమొన్న జరిగిన విషయాలు కూడా మర్చిపోయేదని చెప్పారు. మెదడు పక్కన ఉండే కీలకమైన నరం బలహీనపడడంతో విజయనిర్మల ఆరోగ్యం క్షీణించిందని వెల్లడించారు. చివరికి ఆ అనారోగ్యంతోనే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు కృష్ణ.